ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి

ABN , First Publish Date - 2022-05-24T08:18:31+05:30 IST

కృష్ణా, గోదవరి నదుల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వెంటనే వాటిని అడ్డుకోవాలని ఆయా నదుల

ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి

కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లేఖలు

పోలవరంపై ఎత్తిపోతల వద్దని విజ్ఞప్తి

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ప్రాజెక్టులూ ప్రస్తావన


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదవరి నదుల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వెంటనే వాటిని అడ్డుకోవాలని ఆయా నదుల యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. గోదావరిలో నీటి లభ్యత లేదని వాదిస్తూ, మరోవైపు పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించేలా అక్రమంగా ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తోందని,  గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్‌కు రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు పేర్కొన్నారు. గోదావరిలో నీటి లభ్యత లేనందువల్ల తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతినివ్వరాదంటూ, తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, మరి పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించేలా ఎత్తిపోతల పథకాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. వీటి వల్ల వర్షాల్లేని కాలంలో ప్రధానంగా దిగువ ప్రాంతాలకు, గోదావరి డెల్టా సిస్టమ్‌(జీడీఎస్‌) పై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే, కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు భారీగా నీటిని తరలించడానికి వీలుగా ఏపీ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం పరిధిలోని కృష్ణా బేసిన్‌ ప్రాంతాలకు నీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. వన్యప్రాణులు,పర్యావరణ వ్యవస్థపైనా ప్రభావం ఉంటుందన్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి 34 టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని కోరారు. 

Updated Date - 2022-05-24T08:18:31+05:30 IST