పది అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు.. పోలీసుల విచారణలో సంచలన వాస్తవాలు..

ABN , First Publish Date - 2022-09-26T02:10:11+05:30 IST

హ్యపీ మనీ యాప్‌ ద్వారా పది అకౌంట్లలోకి కోట్లాది రూపాయాలు జమయ్యాయని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దిశ..

పది అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు.. పోలీసుల విచారణలో సంచలన వాస్తవాలు..

హ్యపీ మనీ యాప్‌ ద్వారా పది అకౌంట్లలోకి కోట్లాది రూపాయాలు జమయ్యాయని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న రాజమహేంద్రవరంలో మనీయాప్‌ల (Money Apps) వేధింపులకు న్యూడ్‌ ఫొటోలతో బెదిరింపులకు కొల్లి దుర్గారావు రమ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయించి.. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడుగురు బ్యాంక్‌ అకౌంట్‌లను (Bank accounts) పరిశీలించి అవి 20 కంపెనీలకు జమైనట్టు గుర్తించారు. ఆ 20 కంపెనీల నుంచి కోట్లాది రూపాయల హవాల డబ్బును పది కంపెనీలకు బదలాయించారని తెలిసింది. ఈ కంపెనీలకు యజమానులు వర్కర్లను పెట్టి నడిపిస్తున్నారని విచారణలో బయటపడింది.


ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహరాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నలుగురుని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మనీ యాప్‌లకు సంబంధించి మొదటి దశలో 80 నుంచి 100 సేవింగ్‌ ఖాతాలు సృష్టించి ఒక్కొక్క అకౌంట్‌ నుంచి ప్రతినెలా సుమారు 100 మందికి అప్పు ఇచ్చి.. దానికి మూడొంతులు అధికంగా వసూలు చేస్తారు. రెండో దశలో వసూలు చేసిన వివిధ కంపెనీల పేర్లతో ఉన్న 20 కంపెనీల్లో ఒక్కొక్క అకౌంట్‌లో 15 నుంచి 20 కోట్లు జమవుతున్నట్టు తెలిసింది. మూడో దశలో గుజరాత్‌లో స్థాపించిన సెల్‌ కంపెనీలకు చెందిన 10 అకౌంట్‌లకు నగదు బదిలీ అవుతుంది. ఆయా అకౌంట్ల నుంచి డబ్బు డ్రా అయ్యి హవాలా మార్గం ద్వారా లోన్‌ యాప్‌ యజమానులు తీసుకుంటున్నారు.


ఇటీవల ప్రత్యేక బృందం గుజరాత్‌‌కు వెళ్లింది. గుజరాత్‌ సబర్కత జిల్లా లీల్పూర్‌కు చెందిన పటేల్‌ నితిన్‌ కుమార్‌ రమేష్‌భాయి, గాంధీనగర్‌ ముఖీన్‌ పత్‌ చరాడకు చెందిన పటేల్‌ మిలన్‌కుమార్‌ రాజేష్‌భాయి, ఆదే ప్రాంతం కలోల్‌కు చెందిన రాభారి విధాన్‌లను అరెస్టు చేశారు. వీరితో పాటు కమిషన్‌ పద్ధతిలో వీరితో కలిసి పనిచేస్తున్న.. సికింద్రాబాద్‌ వారణాసి గుడాకు చెందిన గోవింద్‌ రాజేంద్రప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీలను వివిధ వర్కర్ల పేరుతో పెట్టారని.. అసలు సూత్రధారి తప్పించుకున్నాడని చెప్పారు. మనీ యాప్‌లలో రుణాలు తీసుకోవద్దని సూచించారు. మనీ యాప్‌లకు సంబంధించి త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీలతను బృందాన్ని అభినందించారు.Read more