పునరావాసానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-03-04T08:49:11+05:30 IST

పునరావాసానికే ప్రాధాన్యం

పునరావాసానికే ప్రాధాన్యం

నిర్వాసితులతో సీఎం, కేంద్ర మంత్రి ముఖాముఖి

ఆ తర్వాతే ప్రాజెక్టు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష

నేడు పోలవరంలో పర్యటించనున్న సీఎం జగన్‌, షెకావత్‌


ఏలూరు, రాజమహేంద్రవరం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌తో కలిసి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తొలుత పునరావాస కాలనీల్లో పర్యటించనున్నారు. నిర్వాసితులతో మాట్లాడి, ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించనున్నారు. కార్యక్రమ షెడ్యూల్‌ ప్రకారం సీఎం, కేంద్ర మంత్రి ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేట పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడినుంచి 11.20కి పశ్చిమగోదావరిలోని తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెం కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తారు. 


పునరావాసంలో ఏం జరిగిందంటే..

పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు మండలాల్లో సుమారు 6వేలకుపైగా గిరిజనేతర కుటుంబాలను కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. వీటి పరిధిలో 44గ్రామాలు ఉండగా, వీరి పునరావాసానికి 530 ఎకరాల సేకరణకు రూ. 287కోట్లు వ్యయం చేశారు. మౌలిక వసతుల కోసం మరో రూ.137 కోట్లు సమకూర్చారు. పునరావాస కాలనీల్లో 3,905 మందికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించాల్సి ఉండగా, మిగిలిన వారు సొంతంగా నిర్మించుకోవడానికి రూ.2.80 లక్షల చొప్పున కేటాయిస్తామని తెలిపింది. కార్మల్‌పురం, ప్రగడపల్లి, వింజరం, గురువాయిగూడెం, తిరుమలాపురంలో 180 ఎకరాలు సేకరించి ఇళ్ల నిర్మాణానికి 9.3 కోట్లు వెచ్చించారు. భూమికి భూమి పథకం కింద మరో రూ.37 కోట్లు చెల్లించారు. రెండో ఫేజ్‌లో 3వేల కుటుంబాలను తరలించేందుకు కాలనీల నిర్మాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు వ్యక్తిగత పరిహారంగా తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని 10లక్షలకు పెంచి చెల్లిస్తేనే తాము గ్రామాల నుంచి కదలబోమని నిర్వాసితులు భీష్మించారు. తాను అధికారంలోకి వస్తే.. బాధితులకు వ్యక్తిగత కుటుంబ పరిహారాన్ని ఐదు నుంచి 10లక్షలకు పెంచుతానని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ పరిహారం ఊసే లేదు. దీనిపై బాధితులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం రూ.131 కోట్లు విడుదల చేసింది. దీంతో నిర్వాసితులు దీక్షలు విరమించుకున్నారు. తిరిగి చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 వేల 400 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా, వీరిలో ఇంకా 748 మందికి మాత్రమే పరిహారం పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు.


రూ. 55,656 కోట్లకు క్లియరెన్సు ఇవ్వండి: సీఎం 

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,656.87 కోట్లకు ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్సు ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను సీఎం జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల పరిశీలనకు షెకావత్‌ గురువారం రాత్రి విజయవాడ వచ్చారు.  తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జగన్‌ నివాసంలో ఇరువురూ కలిసి విందు ఆరగించారు. 


ఇంధన శాఖ కార్యదర్శిగా బి.శ్రీధర్‌

ఇంధన శాఖ కార్యదర్శిగా జెన్కో ఎండీ బి.శ్రీధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ గురువారం ఉత్తర్వు జారీ చేశారు. కేంద్ర కేబినెట్‌ సంయుక్త కార్యదర్శిగా ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై వెళ్తున్న ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను వెంటనే రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేస్తున్నట్లుగా ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Read more