ధర్మాసనం.. ఇదీ శాసనం!

ABN , First Publish Date - 2022-03-04T08:33:41+05:30 IST

ధర్మాసనం.. ఇదీ శాసనం!

ధర్మాసనం.. ఇదీ శాసనం!

రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం 307 పేజీల తీర్పు వెలువరించింది. ప్రభుత్వం, సీఆర్డీయే తీరును తప్పు పడుతూ అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తి హక్కు, జీవించే హక్కు, సుపరిపాలన, ప్రభుత్వ నైతిక బాధ్యత, రాజ్యాంగ నిబంధనలు... ఇలా పలు అంశాలను ప్రస్తావించింది. ఇందులోని ముఖ్యాంశాలు కొన్ని... 


పేదలు... ప్రభుత్వం మధ్య ఘర్షణ

ఇది రాజధాని కోసం త్యాగం చేశామని చెబుతున్న పేద భూ యజమానులకు... బలమైన ప్రభుత్వానికీ మధ్య జరిగిన పోరాటం! ‘డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ - వెనక్కి తీసుకోలేని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ’లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం... రాజధాని నగరం, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వంతో భూ యజమానులు చేసిన పోరాటం! ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైనందునే న్యాయస్థానంలో వేర్వేరు అంశాల ప్రాతిపదికన అనేక రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి.


మాట ఇచ్చే ముందే...

ప్రజా ప్రయోజనం పేరిట చేసిన మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత మరోసారి ఈ చట్టం తీసుకొస్తామంటోంది. అయితే... ఈ కేసులో అమరావతి విషయంలో ఇచ్చిన చట్టబద్ధమైన హామీలు/కుదిరిన ఒప్పందాల ముందు ప్రభుత్వం చెబుతున్న ‘ప్రజా ప్రయోజనం’ నిలబడదు. ‘భూసమీకరణ’ విధానం చట్ట విరుద్ధం కాదు. పైగా... ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో భూ యజమానులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక విధానాన్ని ప్రకటించే ముందే ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అలా ఆలోచించకుండా హామీలు ఇవ్వకూడదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చట్టపరంగానే కాదు... నైతికంగానూ సరికాదు. అయితే... గత ప్రభుత్వం ముందూ వెనుకా ఆలోచించకుండానే రాజధాని రైతులకు హామీ ఇచ్చిందని అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు. కానీ... గత ప్రభుత్వం రాజధానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను రచించింది. ఆర్థిక వనరులు, నిర్మాణానికి నిధుల అంశాలపై నిర్దిష్ట చర్యలు తీసుకుంది. వెరసి... రాజధానికి సంబంధించి అన్ని కోణాల్లో ఆలోచించి, వనరులపై స్పష్టత వచ్చిన తర్వాతే సదరు హామీలు ఇచ్చింది. ఇప్పుడు... అన్ని పనులను ఆపివేసి, భూ సమీకరణ పథకాన్ని అమలు చేయకపోవడం...  2016 ఫిబ్రవరి 23వ తేదీన జారీ చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో సుమారు 30 వేల మంది రైతులకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమే!

‘మా భూములు, ఆస్తుల విలువ పెంచేలా అభివృద్ధి పనులు చేపట్టండి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసే హక్కు ఎవరికీ లేదని... అలా ఏ చట్టమూ చెప్పడంలేదని ప్రభుత్వం ‘కౌంటర్‌ అఫిడవిట్‌’ దాఖలు చేసింది. కానీ... ఈ వాదనలో పస లేదు. సీఆర్డీయే ఇచ్చిన హామీల మేరకు... వారు భూములు అప్పగించారు. అందువల్ల... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం పునరావాసం కోరే హక్కు వారికి ఉంది. అంతేకాదు... తమకు తిండి పెట్టే భూములనే రైతులు రాజధానికోసం అప్పగించారు. జీవనోపాధికి దూరమయ్యారు. దీనికి బదులుగా... రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తామని మాస్టర్‌ ప్లాన్‌లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. 


ఇది అధికారిక మోసం

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో పరిపాలనా, ఆర్థిక, న్యాయ... ఇలా తొమ్మిది నగరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు ప్రధాన వ్యవస్థలు (శాసన, న్యాయ, పరిపాలన) అమరావతి రాజధానిలోనే ఉండాలి. మిగిలిన నగరాలు ఉపాధి కల్పనకు ఉద్దేశించినవి. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా చూడాలి. ‘అభివృద్ధి చేసిన ప్లాట్లు’ పొందే హక్కు వారికి ఉంది. ఇచ్చిన భూములకు బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి పొందడం పేద, సాధారణ రైతుల ప్రాథమిక హక్కు. ఏపీసీఆర్డీయే చట్టం 2014 ప్రకారం ఆ సంస్థకు నిర్దిష్టమైన బాధ్యతలు, విధులు ఉన్నాయి. వాటిని నిర్వర్తించకపోవడం... అధికారం చేతిలో ఉందని మోసం చేయడమే!


చట్టబద్ధ ఒప్పందం... రద్దు కుదరదు!

సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చిన అనేక తీర్పులను పరిశీలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇతరులతో కుదుర్చుకునే ఒప్పందాలను (కాంట్రాక్టులు)  చట్టబద్ధమైనవిగా పరిగణించాల్సిందే. వాటికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. రాజధాని విషయంలో... ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే)కు ఆ బాధ్యత ఉంది. రాజధాని భూసమీకరణ నిబంధనల్లోని 9.14 ఫామ్‌లో కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో సీఆర్డీయే విఫలమైంది. ‘డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ ఇర్రివోకబుల్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ’ ప్రకారం... రాజధానికి ఇచ్చిన భూముల యజమానులకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. అలా చేయకపోవడం... ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. అదే సమయంలో... భూములు ఇవ్వడంతో వారు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోయారు. పౌరులుగా తమకు ఉన్న ‘ఆస్తి హక్కు’ను కోల్పోయారు. ప్రభుత్వం రాజ్యాంగంలోని 21, 300-ఏ అధికరణలను ఉల్లంఘించింది. ‘మీకు లబ్ధి కలుగుతుంది’ అని రైతులకు ప్రభుత్వం ‘గ్యారెంటీ’ ఇచ్చింది. కానీ, మాట నిలబెట్టుకోవడంలో విఫలమైంది. 


ఇదేనా మంచి పాలన?

‘‘కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను, పనులను నిలిపివేయవచ్చా? విధానాలను మార్చేయవచ్చా? మరీ ముఖ్యంగా అప్పటికే వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టులను అర్ధాంతరంగా నిలిపివేయడం సరైనదేనా?’’... పిటిషనర్లు ప్రస్తావించిన ప్రధాన అంశాలలో ఇది ఒకటి! అయితే... అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజాధనాన్ని ఒకే ప్రాంతంలో ఖర్చు చేయడం సరికాదని... గత ప్రభుత్వం ఈ విషయంలో సరైన ఆలోచన చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. ఆయా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధుల కొరత ఉందని కూడా తెలిపింది. ‘ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం’ అనేది ఒక ప్రత్యేకమైన పథకం. రాజధాని నిర్మిస్తామనే హామీతో 33 వేల ఎకరాలు సమీకరించారు. ఆ మాటలు నమ్మి రైతులు తమ భూములను ఇచ్చేశారు. ఈ భూముల్లో వివిధ నిర్మాణాల కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేశారు. పూర్తయ్యే దశలో నిర్మాణాలను కూడా ఇప్పుడు నిలిపివేశారు. వాటిని గాలికి, ధూళికి వదిలేశారు. ముళ్ల చెట్లు, పొదలతో ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. ఆయా నిర్మాణాలు మెల్లమెల్లగా ధ్వంసమవుతున్నాయి. తుప్పు పడుతున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో పెట్టిన ఖర్చు గురించి ప్రభుత్వం కానీ, సీఆర్డీయే కానీ పట్టించుకోవడంలేదు. రూ.15వేల కోట్లను ఇలా బూడిదలో పోసిన పన్నీరు చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజా ధనాన్ని ఇలా వృథా చేయడం... సుపరిపాలన అనిపించుకోదు. రాజ్యాంగ నైతికత, విశ్వాసమూ కాదు. సుపరిపాలన స్ఫూర్తిని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ప్రభుత్వం ఉల్లంఘించింది. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి... ప్రజా ప్రయోజనాలు, సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటేనే అది సుపరిపాలన అవుతుంది. ఖజానా నుంచి ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. వనరుల వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. దీనినే 1500 సంవత్సరాల క్రితం ‘పబ్లిక్‌ ట్రస్ట్‌ డాక్ట్రిన్‌’ అని పిలిచారు. భారతదేశంలో కోర్టులు, రాజ్యాంగం ఇదే స్ఫూర్తిని అనుసరిస్తున్నాయి. 


నిర్మాణం కొనసాగించండి

రాజధాని నగరం నిర్మిస్తామని, రాజధాని ప్రాంతంలో అనేక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 28 గ్రామాల పరిధిలోని 30వేల మంది రైతుల నుంచి భూములు సమీకరించింది. దీంతో ‘వ్యవసాయం’ అనే ఉపాధిని వారు వదులుకున్నట్లయింది. దీనికి బదులుగా అభివృద్ధి చెందిన నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ... ఏళ్లు గడిచిపోయినా రాజధాని నగరం ఒక కలగానే మిగిలిపోయింది. ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిన మూడేళ్లలో అభివృద్ధి పనులు చేయాలన్న నిబంధనను సీఆర్డీయే విస్మరించింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. కానీ... ప్రభుత్వం కానీ, సీఆర్డీయేకానీ దీనికి సంబంధించిన ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రాలేదు. ఆయా నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నామో  చెప్పలేదు. ఆయా ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను సీఆర్డీయే చేపట్టాలి. అంటే... రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలి.


ఇదీ కేసు...


ప్రధాన పిటిషనర్‌: రాజధాని రైతు పరిరక్షణ సమితి

మొత్తం పిటిషన్లు: 39

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు: 24

రైతుల రిట్‌ పిటిషన్‌: 13203/2020 

(హైకోర్టు దీనినే ప్రధానంగా భావించి తీర్పు వెలువరించింది.)

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు: 34మంది

ప్రభుత్వం తరఫు న్యాయవాదులు: 8మంది

తీర్పు చెప్పింది: చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, 

జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు.

తీర్పు కోసం ధర్మాసనం పరిశీలించిన కేసులు: 195

వెలువరించిన తీర్పు: 307 పేజీలు


పిటిషనర్లు కోరిందేమిటి...

రాజధాని నగరాన్ని మార్చే శాసన అధికారం (లెజిస్లేటివ్‌ కాంపిటెన్స్‌) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదు. శాసన, పరిపాలన, న్యాయ కేంద్రాలను అమరావతి నుంచి తరలించడం కుదరదు. ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి.

సీఆర్డీఏ రద్దు చట్టం - 2020, పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలు రాజ్యాంగంలోని 3, 4, 14, 19, 21, 197, 174, 300-ఏ అధికరణలకు విరుద్ధం. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం కూడా సీఆర్డీఏను రద్దు చేయడం కుదరదని తేల్చాలి.

అమరావతితోపాటు చుట్టుపక్కల ఇప్పటికే ఏర్పాటైన శాసన, పరిపాలన, న్యాయ విభాగాలతోపాటు ఉన్న రాజ్‌భవన్‌, సీఎం కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం, ఇతర అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఎక్కడికీ తరలించకూడదని ఆదేశించాలి.

2016 జూన్‌ 23వ తేదీన అధికారికంగా ప్రకటించిన మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలి. శాసన, న్యాయ, పరిపాలనా విభాగాలకు సంబంధించిన కార్యాలయాలను, అవసరమైన గృహ సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి.


రాజ్యాంగబద్ధ అస్త్రం.. రిట్‌ ఆఫ్‌ మాండమస్‌!

రాజధాని అమరావతిపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పులో ‘రిట్‌ ఆఫ్‌ కంటిన్యుయస్‌ మాండమస్‌’ అనే పదం పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఇంతకీ ఏమిటా రిట్‌? దానికున్న పవర్‌ ఏంటి? వాస్తవానికి ‘మాండమస్‌’ అనే పదానికి కమాండ్‌ అని అర్థం. సరళంగా చెప్పాలంటే ప్రభుత్వం, సంస్థలు, అధికారులను ఫలానా బాధ్యతలు సరిగా నిర్వర్తించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం. ప్రధానంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ కింద తగిన ఆదేశాలిచ్చే అధికారాన్ని రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకు కట్టబెట్టింది. రాజ్యాంగంలోని 32, 226 అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ ఆదేశాలిస్తాయి. కొన్నిసార్లు తాము ఇచ్చిన ఆదేశాలను తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలుచేయాలని ఆదేశించడాన్ని ‘రిట్‌ ఆఫ్‌ కంటిన్యుయస్‌ మాండమ్‌స’గా వ్యవహరిస్తారు. ప్రస్తుత రాజధాని కేసులో రైతుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా నిర్దిష్ట చర్యలను చేపట్టి, ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది.


ఈ వృథా... నేరం!

రాజధాని ప్రాంత రైతులు 34,385 ఎకరాలు ఇచ్చారు. అవన్నీ ఏటా మూడు పంటలు పండే నల్లరేగటి భూములు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు... రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమకు ఇచ్చిన ప్లాట్ల ధరలు పెరుగుతాయని, అక్కడ ఉపాధి/ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో తరతరాలుగా తమకు తిండి పెడుతున్న భూములు వదులుకున్నారు. అటు భూములు లేక... ఇటు రాజధాని వల్ల వస్తాయని చెప్పిన ప్రయోజనాలూ లభించక... రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం వెనుకబాటుతనంలోకి నెట్టేసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అమరావతికి రాష్ట్ర రాజధాని హోదాను దూరం చేయడమంటే... భూములు ఇచ్చిన రైతుల జీవనోపాధిని దెబ్బతీయడమే. జీవించడం ప్రాథమిక హక్కు. ‘జీవించడం’ అంటే... ఏదో ఒక జంతువులాగా ఉన్నామంటే ఉన్నాం అనేలా కాదు. ఇది జీవనోపాధితో ముడిపడినది. చట్టపరమైన అనుమతి/విధానంతో తప్ప... ఈ హక్కును హరించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆ భూములను వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోలేరు.  ఈ భూముల్లోనే అంతర్గత రహదారులు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నిర్మించారు. ఇంకా... అనేక రహదారులను పూర్తి చేయాల్సి ఉంది. వాటర్‌ పైప్‌లైన్లను, డ్రైనేజ్‌ లైన్లనూ పూర్తి చేయలేదు. ఈ పనులు చేయడం ఏపీసీఆర్డీయే చట్టంలోని సెక్షన్‌ 57 ప్రకారం ప్రభుత్వ బాధ్యత. సారవంతమైన భూములను వృఽథాగా మిగల్చడం నేరంతో సమానం! ఇది ఆర్థిక వ్యవస్థనూ  దెబ్బతీస్తుంది. 


ముఖ్యమంత్రిదే ఆ బాధ్యత!

రాజ్యాంగం కల్పించిన భరోసాను (కాన్‌స్టిట్యూషనల్‌ ట్రస్ట్‌) నిలబెట్టాల్సిన బాధ్యత మంత్రివర్గ సారథిగా ముఖ్యమంత్రిపైనే ఉంది. ఒక ప్రాంత ప్రజలపై వివక్ష చూపించడం సరికాదు. ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి... రాజ్యాంగం ఇచ్చిన భరోసాను నిలబెట్టాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. రాజకీయ ప్రయోజనాల కోసం చూడకూడదు. ఈ కేసులో... గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఆయా ప్రాజెక్టులు రాజ్యాంగానికి, చట్ట నిబందనలకు విరుద్ధంగా ఉంటే తప్ప వాటిని పక్కన పెట్టకూడదు. 

Updated Date - 2022-03-04T08:33:41+05:30 IST