ఉద్యమంలో పాల్గొనండి

ABN , First Publish Date - 2022-01-23T08:32:16+05:30 IST

ఉద్యమంలో పాల్గొనండి

ఉద్యమంలో పాల్గొనండి

వైద్యారోగ్యశాఖ ఉద్యోగులకు యూనియన్‌ పిలుపు


అమరావతి/విజయవాడ, జనవరి 22(ఆంరఽధజ్యోతి): పీఆర్సీ సాధన సమితి రూపొందించిన ఉద్యమ కార్యాచరణలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొనాలని ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జీ ఆస్కారరావు, ఎస్‌వీ రమణ పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘం తరపున కూడా నోటీసు ఇస్తామని, జిల్లా, తాలూకా స్థాయిలో అవసరమైతే వైద్య సేవలను నిలిపివేస్తామని తెలిపారు.

మేము సైతం.. మెరుగైన పీఆర్సీ కోసం పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్రం సంఘం సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయమైన హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.

సారీ.. పనిచేయలేం: ట్రెజరీ సిబ్బంది

కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు చేయాల్సిందేనని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై రోజు రోజుకూ ఒత్తిడి పెంచుతోంది. ట్రెజరీ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు, ట్రెజరీ ఉన్నతాధికారులు గంటలు గంటలు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్‌ ఆఫీసర్లకు (డీడీవోలు) ఫోన్‌ చేసి  బిల్లులు తెప్పించుకుని పరిశీలించి కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు చేయాలంటూ ఆదేశాలిస్తున్నారు. తమపై పెరుగుతున్న ఒత్తిడితో ట్రెజరీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రివర్స్‌ పీఆర్సీపై పీఆర్సీ సాధన సమితి చేస్తున్న ఆందోళనలో తామూ భాగమేనని, అలాంటప్పుడు తాము ప్రభుత్వానికి సహకరించి బిల్లులు చేయాలంటే ఏలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెజరీ కార్యాలయాలకు ఇప్పటి వరకు ఒకటి రెండు శాతం డీడీవోల నుంచి బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది. బిల్లులు చేయాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం తగదని, రివర్స్‌ పీఆర్సీపై పీఆర్సీ సాధన సమితి చేపట్టిన కార్యాచరణలో ట్రెజరీ ఉద్యోగులు కూడా భాగమేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అర్గనైజింగ్‌ సెక్రటరీ కాజ రాజ్‌కుమార్‌ అన్నారు. 

Read more