విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: లోకేష్

ABN , First Publish Date - 2022-08-03T13:56:42+05:30 IST

జగన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: లోకేష్

విజయవాడ: జగన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతొందన్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో జే గ్యాంగ్‌ క‌బ్జాలు, దౌర్జ‌న్యాలు, ప్ర‌మాదాలు, విష‌ర‌సాయ‌నాల లీకుల‌తో ప్ర‌జ‌లు తమ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌తుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలీమ‌ర్స్ మ‌ర‌ణ‌మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మ‌రువ‌క‌ముందే, అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్ కంపెనీలో రెండోసారి విష‌వాయువులు లీకై వంద‌ల‌మంది మ‌హిళ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గురి కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించిందన్నారు. ఉపాధి కోసం వ‌చ్చిన మ‌హిళల‌ ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేదు... క‌మీష‌న్లు నెల‌నెలా అందితే చాల‌న్న‌ట్టుంది వైసీపీ పాలన ఉందని మండిపడ్డారు. చ‌నిపోయాక ప‌రిహారం ఇవ్వ‌డం కాదు సీఎం గారూ! వాళ్లు బ‌తికేలా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోండని ఆయన సూచించారు. 

Read more