‘కానుక’లో కక్కుర్తి

ABN , First Publish Date - 2022-09-30T09:25:18+05:30 IST

‘కానుక’లో కక్కుర్తి

‘కానుక’లో కక్కుర్తి

పాఠశాల విద్యార్థులకు నాసిరకం బ్యాగులు

మూడు నెలలకే చిరిగిపోతున్న దుస్థితి

బ్యాగులకే రూ.100 కోట్లపైగా ఖర్చు

విద్యా కానుకలో నాణ్యతకు తిలోదకాలు

కొత్తవి సరఫరా చేయాలని కాంట్రాక్టు సంస్థకు విద్యా శాఖ ఆదేశం 

3 జతలకు బదులు 2 జతల యూనిఫాం

బూట్లు, సాక్సుల్లోనూ నాణ్యత లోపం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగనన్న విద్యాకానుకలో విద్యార్థులకు సరఫరా చేసిన బ్యాగులకు దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పిన ‘నాణ్యత’ అనే మాట కేవలం కాగితాలకే పరిమితమైంది. ఈ బ్యాగులు మూడు నెలలు గడవకముందే చిరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పక్కన పడేసి, సొంత డబ్బుతో బ్యాగులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాసిరకం బ్యాగులు విద్యాకానుకను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్యామేజ్‌ అయిన బ్యాగులను వెంటనే మార్చాలని, పాఠశాలల వారీగా వివరాలు సమర్పించాలని తాజాగా పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 10లోగా వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. డ్యామేజ్‌ అయిన బ్యాగుల స్థానంలో కొత్తవి సరఫరా చేయాలని సరఫరాదారులను ఆదేశించింది. అంతేతప్ప వారిపై చర్యలు తీసుకునే విషయాన్ని వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సర్కారు అంచనాలు తారుమారు 

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 47లక్షల మంది విద్యార్థులు చదువుతారని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. ఆ మేరకు విద్యాకానుకలు కొనుగోలు చేసింది. మొత్తం రూ.931 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. అయితే, విద్యాకానుకలో ఇచ్చే బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సుల వారీగా ఒక్కోదానికి ఎంత వెచ్చించిందనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ప్రభుత్వం అంచనా వేసినంత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదు. అంచనాలకు భిన్నంగా చాలామంది ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు. దీంతో చివరికి 41,24,139 మందికి మాత్రమే విద్యాకానుకలు పంపిణీ చేసింది. విద్యార్థులకు మూడు సైజుల్లో బ్యాగులు అందజేసింది. 1 నుంచి 4 తరగతుల విద్యార్థులకు చిన్నవి, 5 నుంచి 7 తరగతులకు వారికి మీడియం సైజు, 8 నుంచి 10 తరగతుల వారికి పెద్ద బ్యాగులు పంపిణీ చేసింది. ప్రభుత్వం చెప్పిన మొత్తం ఖర్చును బట్టి చూస్తే సగటున ఒక్కో బ్యాగుకు రూ.200పైనే ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది. ఒక్కరికే కాంట్రాక్టు ఇచ్చినందున బ్యాగులు నాణ్యతగా ఉండేలా చూడాలి. కానీ విద్యా సంవత్సరంలో కనీసం సగం రోజులు కూడా వచ్చేలా లేవు. 


చాలీచాలని బ్యాగులు... 

ఈ ఏడాది మొదటి నాలుగు తరగతుల విద్యార్థులకు స్మాల్‌ సైజ్‌ పేరుతో ఇచ్చిన బ్యాగుల్లో కనీసం మూడు, నాలుగు పుస్తకాలు కూడా పట్టడం లేదు. దీంతో చాలామంది విద్యార్థులు వాటిని తీసేసి సొంతంగా కొనుక్కున్నారు. 12 మంది విద్యార్థులున్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఒక్క బ్యాగు కూడా బాగాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల బ్యాగులు చిరిగిపోయినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇటీవల పాఠశాల విద్యా శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల అధికారులు స్వయంగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బ్యాగులు నాసిరకంగా ఉన్నమాట వాస్తవమేనని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. నష్టనివారణ కోసం మార్పులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సంవత్సరం బ్యాగుల నాణ్యత దారుణంగా ఉండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


ఇతర కానుకల్లోనూ లోపాలు 

ఈ ఏడాది అందజేసిన బ్యాగులతో పాటు ఇతర విద్యాకానుకల్లో లోపాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 3జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా 2జతలే ఇచ్చారని, మార్కెట్‌ రేట్లతో పోలిస్తే కుట్టుకూలీ చాలా తక్కువగా ఉందని ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బ్యాగుల సైజులు చాలా చిన్నవిగా ఉన్నందున వచ్చే సంవత్సరం రెండు రకాల సైజుల్లోనే బ్యాగులు పంపిణీ చేయాలని పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదించింది. ఇక ముందుగానే కొలతలు తీసుకున్నప్పటికీ విద్యార్థులకు సరిపడని విధంగా బూట్లు పంపిణీ చేశారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సాక్సుల నాణ్యత కూడా బాగాలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వచ్చే ఏడాది విద్యాకానుకలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది.


సరఫరాదారులపై చర్యలుంటాయా..?

విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన విద్యాకానుకల్లో నాణ్యత లోపించింది. ఇందుకు కారణమైన సరఫరాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాగులు, సాక్సులు నాసిరకంగా ఉన్నాయని అంగీకరించిన పాఠశాల విద్యాశాఖ సరఫరాదారులపై చర్యలకు మాత్రం ముందడుగు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. 

Updated Date - 2022-09-30T09:25:18+05:30 IST