మోటర్లకు మీటర్లు మార్చికి పూర్తి

ABN , First Publish Date - 2022-09-30T09:22:01+05:30 IST

మోటర్లకు మీటర్లు మార్చికి పూర్తి

మోటర్లకు మీటర్లు మార్చికి పూర్తి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

శ్రీకాకుళంలో విద్యుత్‌ వినియోగం 30 శాతం తగ్గింది

రైతులూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు

విపక్షాలు స్వార్థంతో అపోహలు సృష్టిస్తున్నాయి

పారదర్శకత కోసమే స్మార్ట్‌ మీటర్లు: కాకాణి


అమరావతి, శ్రీకాకుళం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు 2023 మార్చి నాటికి నూరుశాతం పూర్తి చేయనున్నట్టు విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్‌ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అంతరాయాలు లేకుండా అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ఇంధనశాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు 41 వేల కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేసిందని, త్వరలో మరో 77 వేల కనెక్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు.  రైతులకు ఉచిత విద్యుత్‌ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, అక్కడ 30 శాతం తక్కువగా రైతులు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో ప్రభుత్వంపై ఉచిత విద్యుత్‌ భారం 30 శాతం తగ్గుతుందన్నారు. ఇదేవిధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 2023 మార్చి నాటికి 18లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు లక్ష్యంతో అధికారులు పని చేయాలని సూచించారు. రైతులు కూడా డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) కోసం ఖాతాలు తెరిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 70శాతంపైగా రైతులు బ్యాంక్‌ ఖాతాలు తెరిచారని, అక్టోబరు 15నాటికి ఖాతాలు తెరవడం, ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియ నూరుశాతం పూర్తవుతుందన్నారు. పోస్టాఫీసుల్లోనూ రైతులు ఖాతాలు తెరవొచ్చన్నారు. విపక్షాలు  స్వార్థంతో  అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. చేతులు, వేళ్లు నరకాలని పిలుపునిస్తున్న విపక్ష నేతలు తమ చేతులనే నరుక్కుంటున్నారనే విషయం వచ్చే ఎన్నికల తర్వాత అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, అక్కడి రైతులతో మాట్లాడిన తర్వాత దీనిపై స్పందిస్తే బాగుంటుందని సూచించారు. రైతుల్లో జవాబుదారీతనం, తమ ఖాతాల్లో ప్రభుత్వం జమచేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కంలకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై వారు ప్రశ్నించే హక్కును మరింతగా పొందుతారని చెప్పారు. కాగా, రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌లో జవాబుదారీతనం పెంచేందుకే పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు పెడుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఆయన గురువారం ప్రారంభించారు. 


 

Updated Date - 2022-09-30T09:22:01+05:30 IST