రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీసు కడితే తప్పేంటి?

ABN , First Publish Date - 2022-09-30T09:16:02+05:30 IST

రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీసు కడితే తప్పేంటి?

రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీసు కడితే తప్పేంటి?

విశాఖలోనే పరిపాలన రాజధాని

ఆ 29 గ్రామాలే బాగుపడాలా: బొత్స 


అమరావతి/విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండపై మరమ్మతులకు గురైన రిసార్ట్స్‌ను కూలగొట్టి ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తే తప్పేముందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం కడితే తప్పేంటని.. మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ అధికారిక నివాసం నిర్మించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌గా వాడుతున్నారు. భవిష్యత్తులో కూడా సీఎం అధికార నివాసంగానే ఉంటుంది కానీ నిర్మించిన వారికి సొంతమైపోదుకదా?’’ అని బొత్స అన్నారు. రుషికొండ పూర్తిగా ప్రభుత్వ స్థలమని, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కొండను, అక్కడి భూమిని పరిరక్షిస్తుంటే దోచుకుంటున్నట్లా అని ప్రశ్నించారు. అక్కడ ఏం కట్టినా ప్రభుత్వ సొంతమే అయినప్పుడు అర్థం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. గురువారం విశాఖలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ అవసరాల కోసం టెండర్లు పిలిచి నిర్మాణాలు చేస్తుంటే అందులో దోపిడీ ఏముంటుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నందునే అక్కడకు మీడియాను అనుమతించడం లేదన్నారు. ఒకసారి మీడియాను తీసుకువెళ్లి అన్నీ వివరించే విషయాన్ని పరిశీలిస్తానన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, అది వచ్చి తీరుతుందని బొత్స అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదా? ఆ 29 గ్రామాలే బాగుపడలా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో పుట్టిన వ్యక్తిగా తాను ఇక్కడ పరిపాలనా రాజధాని ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలుగుదేశం పార్టీయే రైతుల ముసుగులో ‘అమరావతి టు అరసవల్లి’ పాదయాత్ర చేస్తోందని ఆరోపించారు. తాము ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదని, దేవుడి దయవల్ల తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉందన్నారు. తాను డిగ్రీలో ఉండగానే స్కూటర్‌ ఉందని, 1985లోనే సొంతంగా అంబాసిడర్‌ కారు ఉందని బొత్స చెప్పారు. 


శాశ్వత అధ్యక్షుడి విషయం తెలియదు

వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడిగా ఉండటం కుదరదని ఈసీ స్పష్టంచేసిన విషయం తనకు తెలియదని మంత్రి బొత్స అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘అన్ని స్థానాలు గెలవాలని సీఎం గట్టిగా చెప్పారు. కొందరు రకరకాల కారణాలతో గడప గడపకూ పూర్తి చేయలేదు. మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు. అంతేకానీ ఎవరిపైనా ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేయలేదు. వారసుల విషయంలో సరదాగా మాట్లాడుకున్నాం. నాకు అబ్బాయి ఉన్నాడు. డాక్టర్‌ చేస్తున్నాడు. వారసులు రావాలని ప్రజలు కోరుకోవాలి. 40 మంది అభ్యర్థులను మారుస్తానని సీఎం చెప్పలేదు’’ అని అన్నారు. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా... ‘మా పార్టీ గురించి మీకెందుకు? అది పార్టీ అంతర్గత విషయం’ అని వ్యాఖ్యానించారు. పీకే టీమ్‌ తమకు సలహాలిస్తుందని, మంచి సలహాలు ఎవరిచ్చినా తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి, రెండు తప్ప 98 శాతం అమలు చేశామని చెప్పారు.

Read more