ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

ABN , First Publish Date - 2022-09-30T09:07:26+05:30 IST

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

బందరు పోర్టుపై ఎన్‌ఎంపీఎల్‌ అనుబంధ పిటిషన్లు కొట్టివేత

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. ప్రధాన అప్పీల్‌పై డిసెంబరులో విచారణ


అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు నిర్మాణ విషయంలో సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ నవయుగ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎన్‌ఎంపీఎల్‌) దాఖలు చేసిన అప్పీల్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. లోయెస్ట్‌ బిడ్డర్‌తో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుందని, ఈ దశలో ప్రాజెక్టు నిర్మాణ పనులను వేరేవారికి అప్పగించకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం, తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ సర్కారు జారీచేసిన జీవో 66ను సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేయాలని, పోర్టు నిర్మాణ పనులు మూడో పార్టీకి అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని ఎన్‌ఎంపీఎల్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ప్రాజెక్టు అభివృద్ధి చేసే విధానాన్ని పీపీపీ మోడల్‌ నుంచి ల్యాండ్‌ లాడ్‌ మోడల్‌కు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలును నిలుపుదల చేయాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్‌ఎంపీఎల్‌ ప్రధాన అప్పీల్‌పై డిసెంబరు మొదటి వారంలో తుదివిచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఒప్పందం మేరకు బందరు పోర్టు నిర్మాణాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎంపీఎల్‌) విఫలమైందని పేర్కొంటూ కంపెనీతో చేసుకున్న కన్సెషన్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 8న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ డైరెక్టర్‌ వై రమేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పోర్టు నిర్మాణం విషయంలో 2010లో చేసుకున్న కన్సెషన్‌ అగ్రిమెంట్‌ను అమలుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి ఈ ఏడాది ఆగస్టు 25న పోర్టు నిర్మాణం కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. ఎన్‌ఎంపీఎల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది. మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ ఎన్‌ఎంపీఎల్‌  వేసిన అనుబంధ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.

Read more