ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంకో 1000 కోట్ల అప్పు!

ABN , First Publish Date - 2022-12-30T03:33:08+05:30 IST

అధికారంలోకి రాగానే ఉన్నా లేనట్లుగా, నామమాత్రంగా మార్చేసిన ‘ఫైబర్‌నెట్‌’ను జగన్‌ సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చింది.

ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంకో 1000 కోట్ల అప్పు!

యూబీఐకి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు

నిధులొస్తే సొంతానికి వాడుకోవడమే!?

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాగానే ఉన్నా లేనట్లుగా, నామమాత్రంగా మార్చేసిన ‘ఫైబర్‌నెట్‌’ను జగన్‌ సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రజలకు చౌకధరతో వినోదాన్ని, సమాచారాన్ని అందించేందుకు కాదండోయ్‌! కొత్త అప్పులు తెచ్చుకునేందుకు! ఫైబర్‌ నెట్‌కు రూ.1000 కోట్ల అప్పు ఇవ్వాలని ప్రభుత్వం యూనియన్‌ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వంతో ఉన్న బలమైన బంధం నేపథ్యంలో యూనియన్‌ బ్యాంకు ఈ ప్రతిపాదనలను తిరస్కరించే అవకాశం లేదని, రేపోమాపో సొమ్ములు వచ్చేస్తాయని ఆర్థిక శాఖ అధికారులు నమ్ముతున్నారు. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులు ఇవ్వడంపై ఆర్బీఐ ఇదివరకే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రుణాన్ని సదరు కార్పొరేషన్‌ ఎందుకు వాడుతోంది? తిరిగి తన నిధులతోనే చెల్లిస్తోందా? ఇవన్నీ పరిశీలించాలని ఆదేశించింది. ఫైబర్‌ నెట్‌ విషయంలో ఇవేవీ యూనియన్‌ బ్యాంకు పాటిస్తున్న దాఖలాలు లేవు. చంద్రబాబు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఫైబర్‌నెట్‌’ను జగన్‌ అధికారంలోకి రాగానే నిర్వీర్వం చేశారు. నామమాత్రపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. బిల్లుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. దీంతో ఇప్పటికే తెచ్చుకున్న అప్పును తిరిగి చెల్లించలేక ఫైబర్‌నెట్‌ సంస్థ ‘డిఫాల్ట్‌’ అయ్యింది. 2022 జూన్‌ నెలలో ఈ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించారు. మూడు నెలల తర్వాత అంటే సెప్టెంబరులో బ్యాంకులకు బకాయిపడిన అప్పులు తిరిగి తీర్చినట్లు తెలిసింది. ఇలాంటి సంస్థకు మరో రూ.వెయ్యి కోట్లు అప్పు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యూబీఐని కోరడం గమనార్హం. అది కూడా సొంత అవసరాలకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అధికారులే పేర్కొంటున్నారు.

Updated Date - 2022-12-30T03:33:08+05:30 IST

Read more