కాలపరిమితి కుదించడానికి వీల్లేదు

ABN , First Publish Date - 2022-10-02T09:51:37+05:30 IST

మైనర్‌ మినరల్స్‌ లీజులను వేలం ద్వారా మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. అయితే గ్రానైట్‌ లీజు గరిష్ఠ కాలపరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ తీసుకొచ్చి..న ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌పై

కాలపరిమితి కుదించడానికి వీల్లేదు

గ్రానైట్‌ లీజుపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధన చెల్లుబాటు కాదు : హైకోర్టు 


అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మైనర్‌ మినరల్స్‌ లీజులను వేలం ద్వారా మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. అయితే గ్రానైట్‌ లీజు గరిష్ఠ కాలపరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ తీసుకొచ్చిన ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్‌ రూల్స్‌కు ఇవి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కేంద్ర రూల్స్‌ ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీకి లీజు కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్ల వరకు నిర్ణయించే అధికారం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్స్‌ ఆ అధికారానికి కోత పెడుతున్నాయంది.


గ్రానైట్‌ లీజు కాలపరిమితి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్‌ రూల్‌ 6కు అనుగుణంగా ఉండాలి తప్ప, ఏపీ మైనర్‌ మినరల్‌ రూల్‌ 12(5)(హెచ్‌)కు అనుగుణంగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రానైట్‌ లీజు రెన్యువల్‌ 20 ఏళ్లకు మించకూడదని ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తేవడం ద్వారా రెన్యువల్‌ కాలపరిమితిని కుదించలేదని స్పష్టం చేసింది. ఒకే అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పుడు కేంద్రం నిబంధనలే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. ‘‘మైనింగ్‌ లీజు మంజూరు చేసేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలో గ్రానైట్‌ రూల్స్‌లో నిర్దేశించలేదు. ఏపీ మైనింగ్‌ కన్సెషన్‌ రూల్స్‌ కింద నిర్దేశించిన విధంగా ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 14 ప్రకారం వేలం ద్వారా మైనింగ్‌ లీజులు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథంలో కేంద్ర ప్రభుత్వ గ్రానైట్‌ రూల్స్‌, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 14 నిబంధనల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు.


ఏపీ మైనర్‌ మినరల్‌ ఆక్షన్‌ రూల్స్‌-2022 అమల్లోకి రాకముందు లీజు మంజూరు కోసం చేసుకున్న దరఖాస్తులు చెల్లుబాటు కావని రూల్‌ 12(5)(డి) స్పష్టం చేస్తుంది. ఆ నిబంధనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రూల్‌ 12(5)(డి) గ్రానైట్‌ నిబంధనలకు విరుద్ధంగా లేదు. ఈ విధంగా దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదని గ్రానైట్‌ రూల్స్‌లో ఎక్కడా పేర్కొనలేదు. గ్రానైట్‌ రూల్స్‌ ప్రకారం గ్రానైట్‌ లీజు మంజూరు ప్రాంతంలో ప్రభుత్వం ముందుగా ఆధారాలు చూపించాలి. అయితే ఈ నిబంధన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌లో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ గ్రానైట్‌ రూల్స్‌ను ఉల్లంఘిస్తే బాధిత వ్యక్తులు కోర్టును ఆశ్రయించవచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. జీవో 13,14ను సవాల్‌ చేస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ మైనర్‌ మినరల్‌ ఇండస్ట్రీస్‌, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయదులు ఇంద్రజిత్‌ సిన్హా, ఎం.బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

Read more