మనకేదీ ‘గుడ్‌ డే’?

ABN , First Publish Date - 2022-10-02T09:49:05+05:30 IST

‘‘దేశానికి ఈ రోజు సుదినం. మనం ప్రపంచ స్థాయికి ఎదిగామని గర్వంగా చెప్పుకోడానికి 5జీ సేవలే సాక్ష్యం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో అత్యంత ఆశాజనకమైన మాట చెప్పారు.

మనకేదీ ‘గుడ్‌ డే’?

5జీ సేవలకు నోచని ఏపీ

విశాఖ కంటే వెనుకబడిన నగరాలకూ ఆ సేవలు

విజయవాడ నగరానికీ దక్కని అదృష్టం

ఇప్పటికీ 2జీకి నోచని గ్రామాలెన్నో!


అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘‘దేశానికి ఈ రోజు సుదినం. మనం ప్రపంచ స్థాయికి ఎదిగామని గర్వంగా చెప్పుకోడానికి 5జీ సేవలే సాక్ష్యం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో అత్యంత ఆశాజనకమైన మాట చెప్పారు. తొలి దశలో అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చైన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి? మహానగరం విశాఖ, ఆ తర్వాత విజయవాడలకు ఎందుకు చోటు దక్కలేదు? ప్రధాని ప్రకటించిన ‘గుడ్‌ డే’ జాబితాలో ఏపీ ఎందుకు లేదు? ఇవన్నీ సగటు ఆంధ్రుడిని వేధిస్తున్న ప్రశ్నలు.


స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు విశాఖలోనే ఎక్కువ 

దేశంలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు విశాఖపట్నంలో ఉన్నారు. అయినా అక్కడ బ్యాండ్‌విడ్త్‌ స్పీడ్‌ 30 శాతంలోపే ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి టెక్‌పరంగా విశాఖ టాప్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్టివిటీని పెంచడంతోపాటు సిగ్నల్‌ స్ట్రెంత్‌ ను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఇందుకోసం టెక్‌ కంపెనీలతో సంప్రదింపులు జరిపి వాటికున్న లాజిస్టిక్‌ సమస్యలను తీర్చేలా దారిచూపే బాధ్యతను సర్కారే తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఆ పనిచేసిందా? అదే జరిగితే 5జీ జాబితాలో మహానగరం విశాఖ ఎందుకు లేదు? ఏపీలో 5జీ సేవల కోసం ఆరాటపడేవారు ఎందరో ఉన్నారు. కనీసం ఫోన్‌సిగ్నల్‌ వస్తే చాలనుకునే గ్రామాలు అనేకం ఉన్నాయి. 


ఎందుకు లేం?

ఏ రాష్ట్రమైనా పురోగమిస్తోందంటే అనేక రంగాలు అందులో భాగస్వామిగా ఉంటాయి. టెక్నాలజీ, టెలికాం సేవలు కూడా కీలకమైనవే. ఈ రంగాల్లో ఏపీ ముందు వరుసలోనే ఉంది. గ్రామగ్రామాన  ఫైబర్‌ నెట్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సెల్యులర్‌ సేవల్లో ఏపీ అగ్రస్థానంలోనే ఉంది. మరి ఆ కంపెనీల ప్రాధాన్యంలో ఏపీ ఎందుకు లేదన్నదే ఇప్పటి ప్రశ్న. పాలకులు సుస్థిర నిర్ణయాలు తీసుకునే విధానం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని టెక్‌ నిపుణులు పెదవి విరుస్తున్నారు. 


జామ్‌నగర్‌, లక్నో కంటే తీసిపోయామా?

ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే టెక్నాలజీ విస్తరణలో ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటన్న దానిపైనే భవిష్యత్‌ పరిణామాలు ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. గుర్‌గ్రామ్‌, ఢిల్లీ మధ్య పెద్దగా దూరం ఉండదు. కానీ, ఆ రెండు నగరాలకు 5జీ సేవలు ఇచ్చారు. విశాఖ మహానగరంతో పోలిస్తే జామ్‌నగర్‌, లక్నో, పుణె ఎందులో గొప్ప? విశాఖ మహానగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న తీరప్రాంత నగరం ఇది. అయినా ఇక్కడ పెద్ద లోపం ఏమిటంటే...ఇప్పటికీ విశాఖ చుట్టుపక్కల 3జీ, 4జీ సేవలు లేని గ్రామాలు, జనావాసాలు కూడా ఉన్నాయి. 


420 గ్రామాలకు 2జీ సేవలూ కరువే..

నాస్కామ్‌ లెక్కల ప్రకారమే ఏపీలో 420 గ్రామాలు, 8,200 జనావాసాలకు ఇప్పటికీ 2జీనే దిక్కులేదు. ఈ సమస్యను అధిగమించే బాధ్యత తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వమే. ఓ వైపు 2జీ సిగ్నల్‌ కోసం అనేక గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు దేశంలో విశాఖ కంటే అన్ని విషయాల్లో వెనుకబడ్డ నగరాల్లోనూ 5జీ సేవలు వచ్చేస్తున్నాయి. ఏపీకి ఎందుకీ దౌర్భగ్యం? అని సగటు ఆంధ్రుడు మనస్తాపానికి గురవుతున్నాడు. దీపావళి వెలుగుల వేల మన చుట్టూ ఉన్న నగరాలు 5జీలో దూసుకుపోతుంటే ఏపీ ఎందుకు వెనుకే ఉండిపోతోందన్న ప్రశ్న పాలకపెద్దలకు కలిగేనా? విశాఖ తర్వాత విజయవాడ మహానగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నాస్కామ్‌ లెక్కల ప్రకారం మొబైల్‌ డేటా వినియోగంలో విజయవాడ నగరం దేశంలో 12వ స్థానంలో ఉంది. కనీసం ఇక్కడైనా 5జీ సేవలు అందించాలని సర్కారు చొరవ తీసుకొని ఉండాల్సిందనేది టెక్‌ నిపుణుల అభిప్రాయం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఫైబర్‌నెట్‌ సేవలు అందించిన గడ్డ మీద 5జీ సేవలు అందుబాటులోకి రాకపోవడం దేనికి సంకేతమని ఆంధ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more