AP News: అయినా వెనక్కి తగ్గని జగన్ ప్రభుత్వం...

ABN , First Publish Date - 2022-08-31T05:30:00+05:30 IST

ఏపీలో ముఖ ఆధారిత హాజరు యాప్‌ (Face recognition app)పై రగడ కొనసాగుతోంది.

AP News: అయినా వెనక్కి తగ్గని జగన్ ప్రభుత్వం...

అమరావతి (Amaravathi): ఏపీలో ముఖ ఆధారిత హాజరు యాప్‌ (Face recognition app)పై రగడ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితిలో యాప్‌ను డౌన్ లోడ్ (Download) చేసుకోమని ఉపాధ్యాయులు (Teachers) తేల్చి చెప్పారు. అయినా జగన్ ప్రభుత్వం (Jagan Govt.) వెనక్కి తగ్గలేదు. గురువారం నుంచి తప్పనిసరిగా అటెండెన్స్‌ (Attendance)ను యాప్ ద్వారా నమోదుచేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Bosta) ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నారు.


ఏపీ ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య వివాదం కొలిక్కిరాకపోగా... రోజురోజుకూ ముదురుతోంది. టీచర్లపై జగన్‌ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను గురువారం నుంచే అమలు చేయాలని ఆదేశించింది. అయితే... ఉపాధ్యాయులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే యాప్స్ డౌన్‌కు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. 


జగన్‌ ప్రభుత్వం ఆదేశాలను ఫ్యాఫ్టో తప్పుబడుతోంది. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకపోతే.. సెప్టెంబర్‌ 2 నుంచి యాప్స్ డౌన్‌ చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం డివైజ్‌లు ఇస్తే.. అటెండెన్స్ వేసేందుకు తమకు అభ్యంతరం లేదని... అలా కాకుండా.. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో అటెండెన్స్‌ను వేయాలని కోరడం పట్ల ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్ మంజుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 


జగన్‌ ప్రభుత్వం మిగతా శాఖలకు డివైజ్‌లు ఇచ్చి, అటెండెన్స్‌ నమోదు చేయమని కోరుతోంది. కాగా.. తమ పట్ల మాత్రమే వివక్షత ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం....  సిపిఎస్ ఆందోళనకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులను నమోదు చేసిందని, తాజాగా అటెండెన్స్‌ యాప్‌ పేరిట వేధిస్తున్నారని ఏపీటిఎఫ్‌ పూర్వపు ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ ఆరోపించారు. 


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ను నమోదు చేయాల్సి ఉంది. ఇందులో యాండ్రాయిడ్ ఫోన్‌లు లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ ఫోన్‌లో అటెండెన్స్‌ నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఆర్‌జేడి కార్యాలయాలు, డిఈఓ, ఎంఈఓ కార్యాలయాలతో సహా అన్ని కార్యాలయాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో అటెండెన్స్‌కు 10 నిమిషాలు గ్రేస్ పిరియడ్ కూడా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2022-08-31T05:30:00+05:30 IST