సీఎం పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ మారింది: అచ్చెన్న

ABN , First Publish Date - 2022-10-01T23:01:22+05:30 IST

సీఎం పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ (AP CID) మారిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు.

సీఎం పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ మారింది: అచ్చెన్న

అమరావతి: సీఎం పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ (AP CID) మారిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే అక్రమ కేసులు పెడుతారా? అని నిలదీశారు. సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకే టీడీపీ (TDP) నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. పిల్లల్ని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోవడం సిగ్గుచేటన్నారు. చింతకాయల విజయ్‌పై అక్రమ కేసు పెట్టడం.. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి మాటలు గుడ్డిగా వింటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తప్పుడు అధికారులకు శిక్ష పడే వరకు కోర్టుల్లో పోరాడుతామని   అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  


చింతకాయల విజయ్ (Chintakayala Vijay) ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వచ్చారో.. కేసు ఏంటో కూడా పోలీసులు చెప్పలేదు. ఇంట్లో పిల్లలు ఉన్న సమయంలో పోలీసులు రావడం.. అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు వాపోయారు. విజయ్‌.. ఐటీడీపీ కో కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఐటీడీపీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేశారని పోలీసుల అభియోగంగా ఉంది. 

Read more