రాజధానిలో పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-24T09:34:41+05:30 IST

హైకోర్టు ఆదేశాలు, కోర్టు ధిక్కార కేసులతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

రాజధానిలో పనులు ప్రారంభం

హైకోర్టు తీర్పు, ధిక్కార కేసులతో సర్కారులో కదలిక 

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల క్వార్టర్స్‌లో పనులు 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు 

గులాబీలతో స్వాగతం పలికిన అమరావతి రైతులు

చిన్న పనులు చేసి కోర్టును మభ్యపెట్టే యత్నం

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలి: రైతులు


విజయవాడ/తుళ్లూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలు, కోర్టు ధిక్కార కేసులతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాయపూడిలో తుదిదశలో ఉన్న భవన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను సీఆర్‌డీఏ కోరినట్టు తెలిసింది. శనివారం ఎన్‌సీసీ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌లో ఒక్కోదానిలో 6 చొప్పున అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు టైల్స్‌, మార్బుల్స్‌ పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరుగుతున్న పనుల ను అమరావతి రైతులు, దళిత, ముస్లింమైనార్టీ నేతలు పరిశీలించారు. లారీల్లో నుంచి మెటీరియల్‌ను దించుతున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టడం సంతోషకరమని, ఇలాగే సీడ్‌యాక్సెస్‌ రోడ్డు, పర్మినెంట్‌ టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆకాంక్షించారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 70-80 శాతం వరకు ఈ భవనాల పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని పనులను ఆపేసింది. తర్వాత 3 రాజధానుల పేరుతో పూర్తిగా అటకెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులే కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కరక ట్ట రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టలేదు. రాజధాని అమరావతిపై రైతుల కేసులకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ధిక్కరణ కేసులతో వైసీపీ సర్కారు దిగిరాక తప్పలేదు. దీంతో త్వరగా పూర్తయ్యే భవనాలను ఎంచుకుని పనులు మొదలు పెట్టింది. కాగా, ప్రభుత్వానికి రాజధాని అమరావతి అభివృద్ధి పనులు చేసే ఉద్దేశం లేదని, దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించి చర ్యలు తీసుకోవాలని రైతులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యర్రబాలెంకు చెందిన రైతు దోనే సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. 


న్యాయదేవత కన్ను కప్పలేరు 

రైతుల ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు ఇచ్చి రెండు నెలలు కావస్తోంది. ఇంతవరకు రైతుల ప్లాట్లలో ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించలేదు. ప్లాట్ల గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చిన్న చిన్న పనులు చేసి కోర్టును మభ్యపెట్టాలని చూస్తున్నారు. న్యాయదేవత కన్ను కప్పలేరు. 

- కొమ్మినేని వరలక్ష్మీ, రైతు, మందడం


మొదట రోడ్లు వేయాలి 

రహదారుల వ్యవస్థ బాగుంటే వెంటనే అభివృద్ధి జరుగుతుంది. రాజధానిలో గత ప్రభుత్వం పెద్దపెద్ద రోడ్లు వేసింది. కొన్ని పూర్తయ్యాయి. ఇంకొన్ని వివిధ దశల్లో ఉన్నా యి. వాటిని ముందు పూర్తి చేయాలి. కోర్టును మభ్య పెడతామనుకుంటే కుదరదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లో చిన్న, చిన్న పనులు చేయడమంటే అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్టు కాదు. కోర్టు తీర్పు అమలు చేయాలి. రైతుల ప్లాట్లను, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలి. 

- షేక్‌ జానీ, రైతు, రాయపూడి 


ఒక రాజధానితోనే అభివృద్ధి సాధ్యం

దాన్ని విభజించడం మంచిది కాదు

కేంద్ర మంత్రి నారాయణస్వామి 


మడకశిర, ఏప్రిల్‌ 23: ఒక రాజధాని ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి చెప్పారు. బెంగళూరు నుంచి పావగడ  వెళుతున్న ఆయనను శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో దళిత హక్కుల పోరాట సమితి శనివారం సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ రాజధానిని విభజించడం మంచిది కాదన్నారు. దీనివల్ల అభివృద్ధిలో వేగం అందుకోవడం కష్టమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని కీలకమన్నారు. కాగా, ప్రశాంత్‌ కిశోర్‌ ఒక పార్టీకే పరిమితం కాదని, ఇప్పటికే చాలా పార్టీల్లో పని చేశారని తెలిపారు. మంచి పదవులు లభించకే ఆయన పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. పీకేకి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఇచ్చినా ఆ పార్టీ అభివృద్ధి చెందదన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి బీజేపీయే అధికారంలోకి వస్తుందన్నారు. 

Read more