Somu Veerraju About Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై బీజేపీ ఇంట్రస్ట్ ఏంటో కుండబద్ధలు కొట్టిన సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-09-04T20:37:14+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని..

Somu Veerraju About Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై బీజేపీ ఇంట్రస్ట్ ఏంటో కుండబద్ధలు కొట్టిన సోము వీర్రాజు

అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌పై (Jr ntr) ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో (Janasena) కలిసే తాము ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. సేవల వినియోగించుకోవడం అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో (AP) జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr NTR) ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుందేమోనన్న చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం అమిత్‌షా (Amit Shah) హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr ntr Amit Shah Meet) సమావేశం కావడంతో బీజేపీ అధిష్ఠానం జూనియర్ ఎన్టీఆర్‌పై ఫోకస్ పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఆ భేటీలో అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లనున్నారన్న సంకేతాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.భేటీ అయిన రోజు రాత్రి 11.16 వరకు ఎన్టీఆర్‌ నోవాటెల్‌లోనే ఉన్నారు. కాగా.. షా-ఎన్టీఆర్‌ ఎందుకు కలిశారు..? జూనియర్‌కు బీజేపీ అగ్రనేత పిలుపు దేనికి సంకేతం..? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విజయవంతమైనందుకు అభినందించడానికే ఆయన్ను ఆహ్వానించారా..? లేక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా..? టీడీపీ విషయంలో సానుకూలంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడానికే ఎన్టీఆర్‌తో షా భేటీ అయ్యారా..? వారిద్దరి భేటీలో అసలేం జరిగింది?.. ఆ భేటీ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా దీనిపైనే ఆసక్తికర చర్చ జరిగింది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే వీరి సమావేశం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే సాధారణంగా చాలా హిట్‌ సినిమాలు వస్తుంటాయి. వాటిలో కథానాయకుల నటన నచ్చితే కలవడం పెద్ద విషయమేం కాదు. కేంద్ర మంత్రులను కలిసేందుకు పలువురు చిత్ర ప్రముఖులు ఢిల్లీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చి మరీ జూనియర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాలు వివిధ విశ్లేషణలు చేస్తున్నాయి.జూనియర్‌ను తురుపు ముక్కగా వాడుకోవాలని కూడా బీజేపీ యోచిస్తోందా అన్న చర్చ మొదలైంది. తెలంగాణలో ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌తో షా భేటీ అయ్యారా అన్న చర్చ కూడా జరుగుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు ఇవ్వడం ద్వారా వారి దృష్టిని ఆకర్షించడానికి కమలనాథులు స్కెచ్‌ వేశారని అంటున్నారు. జూనియర్‌ బీజేపీకి అనుకూలంగా మారారా? ఆ పార్టీలో చేరతారా? లేదామద్దతుగా ఉంటారా.. అనే ప్రశ్నలను జనాల్లోకి వదలడానికే ఈ ఎత్తుగడ వేసినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన మేనత్త పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. షాను కలవడానికి ముందు జూనియర్‌ ఆమెతో సమావేశమయ్యారు కూడా. అయితే ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు కుటుంబాన్ని కాదని ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు. టీడీపీని వ్యతిరేకించో.. సామాజిక వర్గాన్ని వ్యతిరేకించో.. తన కెరీర్‌ను పాడు చేసుకునేంత తెలివి తక్కువ వాడు కాదని.. షాతో భేటీకి గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి వెళ్లారే తప్ప... అంత తేలిగ్గా టీడీపీని కాదనుకునే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. సుదీర్ఘకాలం ఉండే తన సినీ జీవితాన్ని రాజకీయాల కోసం వదులుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న.

Read more