మహిళా గర్జన!

ABN , First Publish Date - 2022-02-23T08:19:13+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ సర్కారు తీరుపై మహిళలు నిప్పులు చెరిగారు. కనీస వేతనం పెంపు సహా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు కదం తొక్కితే.. మంగళవారం ఆశా వర్కర్లు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు.

మహిళా గర్జన!

  • సర్కారు తీరుపై సివంగులై సమరనాదం
  • నిన్న అంగన్‌వాడీలు.. నేడు ఆశా వర్కర్లు


(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని వైసీపీ సర్కారు తీరుపై మహిళలు నిప్పులు చెరిగారు. కనీస వేతనం పెంపు సహా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు కదం తొక్కితే.. మంగళవారం ఆశా వర్కర్లు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేశారు. కొన్నిచోట్ల ముందస్తుగానే నిర్బంధించారు. వేల సంఖ్యలో ఆశా వర్కర్లను అరెస్టు చేశారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 600 మందికిపైగా ఆశాలను అరెస్టు చేసి వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ.. ఆశా వర్కర్లు వెనుకంజ వేయకుండా ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కొందరు తమ పిల్లాపాపలతోనే ధర్నాల్లో పాల్గొన్నారు. వీరి ఉద్యమానికి పలు పార్టీలు మద్దతు పలికాయి.


నిర్బంధాలను అధిగమించి

ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. యూనియన్‌ నాయకులు, కీలక ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. పలుచోట్ల సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. నిర్బంధాలను అధిగమించి చాలామంది మహిళలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వేటపాలెంకు చెందిన ఆశా కార్యకర్త హెబ్సిబా తన 4నెలల పాపతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మీ మాట్లాడుతూ.. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయలేరని హెచ్చరించారు. 


ఆకలి అన్నా.. వదల్లేదు! 

విజయనగరం కలెక్టర్‌ ముట్టడికి యత్నించిన ఆశాలను పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. ఎల్‌.కోట, బొబ్బిలి తదితర ప్రాంతాలకు చెందిన ఆశా కార్యకర్తల నాయకులను విజయనగరంలోకి రానీయకుండా అదుపులోకి తీసుకున్నారు. వారిని దిశా పోలీస్‌ స్టేషన్లో సాయంత్రం 3గంటల వరకు ఉంచారు. ఆకలేస్తోందని అన్నా.. పోలీసులు పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో ఆశాలను పోలీసులు ముందస్తు అరె్‌స్టలు చేసినా.. వందలాది మంది కలెక్టరేట్‌కు చేరుకున్నారు. విశాఖజిల్లాలో ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జగదాంబ జంక్షన్‌ వద్ద సీఐటీయూ కార్యాలయానికి చేరుకునే క్రమంలో పలువురు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చేశారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. సుమారు 200 మందిని అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.


కృష్ణాజిల్లా నలుమూలల నుంచి మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు వచ్చే క్రమంలో ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మచిలీపట్నం బస్టాండ్‌ వద్ద ఉదయం 6 గంటల నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వచ్చిన వాళ్లను వచ్చినట్టు స్టేషన్లకు తరలించారు.  ఇలా మొత్తం 600 మంది ఆశాలను పోలీసులు అరెస్టు చేసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 




అణగదొక్కలేరు: ఎమ్మెల్సీ ఇళ్ల 

‘నిర్బంధాలతో పోరాటాలను అణగదొక్కాలని అనుకోవడం అవివేకం. ప్రశ్నించే వారిపై పోలీసులతో నిర్బంధాలను ప్రయోగించడం సరైనది కాదు. వ్యాపారస్థులు, నటులతో చర్చించడానికి సమయం కేటాయిస్తున్న ప్రభుత్వం ఆశాల సమస్యలు తీర్చలేకపోవడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద ఆశా వర్కర్ల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. 


ఆశాల డిమాండ్లు ఇవీ

కనీస వేతనం రూ.15 వేలు

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు

కరోనాతో మృతి చెందిన ఆశా  కుటుంబాలకు 10 లక్షల సాయం

వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం

శాఖకు సంబంధం లేని పనులు వద్దు

కొవిడ్‌ టెస్టుల బాధ్యత నుంచి విముక్తి

Updated Date - 2022-02-23T08:19:13+05:30 IST