Another storm: మరో తుఫాను తరుముతోంది!

ABN , First Publish Date - 2022-12-13T03:22:46+05:30 IST

రాష్ట్ర రైతాంగానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుస విపత్తులు పంటల్ని నాశనం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే తరుణంలో కురుస్తున్న వర్షాలు రైతుల్ని నిలువునా ముంచుతున్నాయి.

Another storm: మరో తుఫాను తరుముతోంది!

మాండస్‌ నుంచి ఇంకా తేరుకోనేలేదు

నేడు అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం

వాయుగుండం, తుఫాన్‌గా మారే చాన్స్‌

నేడూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

వణికిపోతున్న రాష్ట్ర రైతాంగం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్ర రైతాంగానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుస విపత్తులు పంటల్ని నాశనం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే తరుణంలో కురుస్తున్న వర్షాలు రైతుల్ని నిలువునా ముంచుతున్నాయి. పంటంతా వర్షార్పణం అవుతోంది. మాండస్‌ తుఫాన్‌ నుంచి తేరుకోక ముందే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అండమాన్‌ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది అల్పపీడనంగా మారి మరింత బలపడి మరో వాయుగుండంగానో, తుఫాన్‌గానో మారే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర రైతాంగానికి కోలుకోలేని స్థితి ఏర్పడుతుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితమే మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, కాల్వలు పొంగి వేల ఎకరాల్లో రబీ పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోనూ మాగాణుల్లోని వరి పైరు నేల వాలి కొంత మట్టిపాలవ్వగా, కోసి కుప్పలేసిన వరి తడిచిపోయింది. అప్పటికే నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబోసిన టన్నుల కొద్దీ ధాన్యం తడిసిపోయింది.

రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలతో పాటు శనగ, వేరుశనగ, చిరుధాన్యాలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మిర్చికి కూడా నష్టం జరిగింది. కాగా.. మాండస్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంటలను నీటి ముంపు తగ్గిన తర్వాత ఎన్యుమరేషన్‌ చేపట్టి, ఈ నెల 21లోపు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. 26 జిల్లాల వ్యవసాయ అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను, సామాజిక తనిఖీని ఈనెల 26 కల్లా పూర్తి చేసి, 27న తుది జాబితాను ఈ-క్రాప్‌ ప్రాతిపదికన తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొనసాగుతున్న వర్షాలు..

సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం కూడా రాష్ట్రంలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంట ల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం నుంచి బలంగా తూర్పుగాలులు వీస్తుండడంతో తమిళనాడు, దానికి ఆనుకుని ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ప్రకాశం జిల్లాలో రైతులు సోమవారం పొలాల్లో ఉన్న నీటిని బయటకు పంపి ఉన్న పైర్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లాలోని శింగనమల, కూడేరు, వజ్రకరూరు, ఉరవకొండ, నార్పల, బొమ్మనహాళ్‌, కణేకల్లు, గార్లదిన్నె మండలాల్లో 483 హెక్టార్లల్లో రూ.3.7 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Updated Date - 2022-12-13T03:22:47+05:30 IST