వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది: అనిత

ABN , First Publish Date - 2022-03-23T20:12:43+05:30 IST

వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ నేత వంగలపూడి అనిత అన్నారు.

వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది: అనిత

అమరావతి: వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కల్తీ మద్యానికి మహిళల మాంగల్యాలు బలైపోతున్నాయని, జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రజల ప్రాణాలంటే వైసీపీ నేతలకు లెక్కలేదని విమర్శించారు. తండ్రి శవం పక్కనే సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. కల్తీ సారా, జే బ్రాండ్లను ఓ పథకంలా అమలు చేస్తున్నారని ఆరోపించారు.


దిశా యాప్ తెచ్చి, దిశా పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభిస్తే అత్యాచారాలు ఆగిపోతాయా? అని అనిత ప్రశ్నించారు. నాటుసారా ప్రబలి నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ ఉదాసీనత వల్ల మృగాళ్లు చెలరేగిపోతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ పనిచేస్తోందా? అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని మహిళా హోంమంత్రి ఎందుకని అనిత మండిపడ్డారు. 

Read more