పురం పంచాయితీ

ABN , First Publish Date - 2022-07-19T05:17:16+05:30 IST

అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీంతో హిందూపురం పంచాయితీ తాడేపల్లికి చేరింది.

పురం పంచాయితీ

ముఖ్యనాయకులకు అధిష్టానం పిలుపు

తరలివెళ్లిన ఎమ్మెల్సీ, అసమ్మతి నాయకులు 

నేటి చర్చలపై ఉత్కంఠ


హిందూపురం టౌన, జూలై 18: అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీంతో హిందూపురం పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇనచార్జిపై ఏం తేలుస్తారోనని నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ను అసమ్మతి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి, స్థానికులకే ఇనచార్జి ఇవ్వాలంటూ నినదించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీతోపాటు అసమ్మతి వర్గంలోని ముఖ్యనాయకులైన రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌, వైసీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్తలు చౌళూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డి, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డితోపాటు మరికొంతమందికి జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఫోన ద్వారా విజయవాడకు రావాలని పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. వీరంతా సోమవారం సాయంత్రం విజయవాడకు బయలుదేరి వెళ్లారు.


ఆది నుంచీ అసమ్మతి 

ఎన్నికల సందర్భంగా మాజీ ఐపీఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌కు అధిష్టానం ఎమ్మెల్యే బీ-ఫారం ఇచ్చి, హిందూపురం బరిలో నిలిపింది. ఆయన హిందూపురానికి వచ్చిన మొదటిరోజు నుంచే నవీననిశ్చల్‌ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఏడాది క్రితం ఎమ్మెల్సీపై నవీన వర్గీయులు పెద్దఎత్తున ధర్నాలు, నిరసనలు చేశారు. ఆ తరువాత మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్సీని వ్యతిరేకిస్తూ వచ్చారు. మరో మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా గళం విప్పారు. వీరితోపాటు మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, మరికొంతమంది ఎంపీటీసీలు బహిరంగంగా ఎమ్మెల్సీపై విమర్శలు చేశారు. సీనియర్‌ నాయకులైన తమకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపించారు. తాజాగా మార్కెట్‌యార్డ్‌ చైర్మన కొండూరు మల్లికార్జున కూడా ఎమ్మెల్సీ వర్గం వీడి అసమ్మతి బాట పట్టారు. దీంతో రానురాను అసమ్మతి వర్గం పెరిగిపోతుండటంతో అధిష్టానం దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అసమ్మతి నాయకులు విజయవాడకు వెళ్లి ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. సమస్యను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


వందమందికిపైగా తరలి వెళ్లారు..

అసమ్మతి నేపథ్యంలో అధిష్టానం పిలుపు అందడంతో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ సోమవారం విజయవాడ వెళ్లారు. నియోజకవర్గ ఇనచార్జిల సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ వర్గీయులు 50మందిదాకా రైళ్లు, కారులో వెళ్లారు. ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌, ఆయన వర్గీయులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి, బలరామిరెడ్డి, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా వాహనాల్లో వెళ్లారు. మొత్తం వంద మందిదాకా అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. ముఖ్య నాయకులతో మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశంలో ఏం తేల్చుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీని ఇనచార్జిగా కొనసాగిస్తారా.. ఇతరులకు అవకాశం ఇస్తారా.. లేదంటే అందరినీ కలుపుకుని పోవాలని ఎమ్మెల్సీకి సూచిస్తారా అనేది తేలనుంది.Read more