యల్లనూరు స్టేషనకు వాహనం లేదు

ABN , First Publish Date - 2022-07-31T05:58:45+05:30 IST

యల్లనూరు మండలం పేరు చెబితే గొడవలు గుర్తొస్తాయి. అక్కడ పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా పోలీసు శాఖకు కత్తిమీద సాము.

యల్లనూరు స్టేషనకు వాహనం లేదు
మూలనపడ్డ పోలీసు జీపు(ఫైల్‌)

పొరుగు జిల్లాకు పోలీస్‌ జీప్‌!

సంక్లిష్టమైన ప్రాంతంలో సిబ్బందికి కష్టాలు

వంతులవారిగా ప్రైవేటు వాహనాల వినియోగం

ఇదే అదనుగా.. ప్రయాణికులను కుక్కుతున్న డ్రైవర్లు


తాడిపత్రి: యల్లనూరు మండలం పేరు చెబితే గొడవలు గుర్తొస్తాయి. అక్కడ పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా పోలీసు శాఖకు కత్తిమీద సాము. ఆ మండలంలో ఏక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నట్లుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. సంచలన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఫ్యాక్షన ప్రభావిత ప్రాంతమైన ఈ మండలంలో రాజకీయ వైషమ్యాలు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ. మట్కా, పేకాట వంటివి ప్రజల జీవితాలను నాశనం చేస్తుంటాయి. ఇలాంటి మండలానికి సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉండాలి. శాంతిభద్రతల పరిరక్షణకు అదే స్థాయిలో సౌకర్యాలు ఉండాలి. మరీ ముఖ్యంగా.. కండిషనలో ఉన్న వాహనం పోలీసులకు తప్పనిసరి. కానీ కొన్ని నెలలుగా యల్లనూరు పీఎ్‌సకి పోలీసు వాహనం లేదు. తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజనలో పట్టణ సర్కిల్‌ స్టేషన్లకు రెండు, మండల స్టేషన్లకు ఒక్కొ క్క వాహనం ఉంటా యి. కానీ అత్యంత సున్నిత ప్రాంతమైన యల్లనూరుకు మాత్రం పోలీసు వాహనాన్ని కేటాయించలేదు. గతంలో ఇక్క డ ఉన్న జీపు చెడిపోయింది. దీంతో మరమ్మతు చేయించకుండా మూలన పడేశారు. చివరకు ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా కేంద్రానికి పంపించారు. దీంతో మరమ్మతు చేసి, తిరిగి పంపిస్తారని సిబ్బంది అనుకున్నారు. కానీ ఆ జీపును శ్రీసత్యసాయి జిల్లాకు పంపించారు. తమ పరిస్థితి ఏమిటని ఉన్నతాధికారులను అడిగితే.. త్వరలో మరో వాహనాన్ని పంపుతామని హామీ ఇచ్చారని అంటున్నారు. కానీ రోజులు గడుస్తున్నా అతీగతి లేదు. 


ఎన్ని కష్టాలో..

పోలీస్‌స్టేషనకు జీపు లేకపోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తుకు వెళ్లేందుకు ఎస్‌ఐతోపాటు సిబ్బంది ప్రైవేట్‌ జీపులపై ఆధారపడుతున్నారు. యల్లనూరు మండల కేంద్రం నుంచి తాడిపత్రికి ప్రయాణికులను చేరవేసే జీపులు చాలా ఉన్నాయి. వంతులవారీగా వాటిని ఉపయోగిస్తున్నారు. వాహన యజమానులకు బాడుగ చెల్లించకుండా, డీజిల్‌తోనే సరిపెడుతున్నారని సమాచారం. జీపులు దొరకనప్పుడు ఎస్‌ఐ, సిబ్బంది తమ ద్విచక్రవాహనాలలో వెళుతున్నారు. అత్యవసర సమయాల్లో మండల నాయకులు, వారి మద్దతుదారుల వాహనాలను ఉపయోగించుకుంటున్నారు. 


ఇదే అదనుగా..

పోలీసులు ప్రైవేటు వాహనాలను వంతులవారీగా వాడుతున్నారు. దీన్ని అదనుగా తీసుకుని ప్రైవేటు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను దర్జాగా ఎక్కించుకుని వెళుతున్నారు. వారి జీపులను వినియోగిస్తున్న కారణంగా పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. యల్లనూరు-తాడిపత్రి రోడ్డు అధ్వానంగా ఉంది. పలుచోట్ల గుంతలు పడ్డాయి. గతంలో ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి రోడ్డుపై కిక్కిరిసిన ప్రయాణికులతో వాహనాలు వెళుతున్నాయి. 



ఎన్నెన్నో సమస్యలు

యల్లనూరు మండలంలో ఫ్యాక్షన నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. కానీ రాజకీయ వైషమ్యాలు మాత్రం రాజుకుంటూనే ఉంటాయి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత మండలం కావడంతో ఇక్కడ పట్టుకోసం వైరి వర్గాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. భోగాతి నారాయణరెడ్డి వర్గంతోపాటు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి యల్లనూరు మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరి ఎత్తులు, పై ఎత్తుల కారణంగా మండలంలో రాజకీయ వేడి నిరంతరం ఉంటోంది. మట్కా, పేకాట, ఇసుక అక్రమ తరలింపు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటాయి. దీంతో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ముందు జాగ్రత్తగా రాత్రి సమయాల్లో గస్తీ తిరగాల్సి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగితే వేగంగా ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని పోలీసు శాఖ వర్గాలే అంటున్నాయి. అందుకే యల్లనూరు మండలంలో పోలీసు వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-07-31T05:58:45+05:30 IST