ఘోరం జరిగిపాయనే..!

ABN , First Publish Date - 2022-02-23T06:20:28+05:30 IST

పట్టణ సమీపంలోని చెర్లోపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

ఘోరం జరిగిపాయనే..!
నన్నీబీ, హుసేనబీ మృతదేహాలు.. విలపిస్తున్న బంఽధువులు

ఆటో అదుపుతప్పి బోల్తా

ఇద్దరు మహిళల మృతి

సంచార కుటుంబాల్లో విషాదం

పోలీసులు వెళ్లిపొమ్మన్నందుకే..!


సంచార జీవనం సాగించే పేదలు వారు. ఊరూరా తిరుగుతూ ప్లాస్టిక్‌ టబ్బులను అమ్మి బతుకుతున్నారు. ఏ ఊరిలో చీకటి పడితే, అక్కడే ఓ చోటు వెదుక్కుని విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారితే మరో ఊరికి దావ పడతారు. అదేవిధంగా మంగళవారం గోరంట్లకు చేరారు. పగలంతా వీధి వీధి తిరిగి వ్యాపారం చేశారు. రాత్రికి ఒకచోట చేరారు. ఇంత ముద్ద తిని నిద్రపోదామని అనుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. ‘ఎవరు మీరు..? ఇక్కడేం చేస్తున్నారు..?’ అని గద్దించారు. వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. అంతే.. సరుకు నెత్తిన పెట్టుకుని, ఇంకో ఊరికి పయనం కట్టారు. మార్గ మధ్యలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు  బెదిరించకపోతే ఈ ఘోరం జరిగేది కాదని మిగిలినవారు బోరున విలపించారు. ఈ విషాద సన్నివేశానికి హిందూపురం ఆస్పత్రి వేదిక అయ్యింది. 


హిందూపురం టౌన, ఫిబ్రవరి 22: పట్టణ సమీపంలోని చెర్లోపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి హిందూపురం- గోరంట్ల ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. మృతులను హుసేనబీ (40), నన్నీబీ (42)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, తనకల్లు మండల కేంద్రానికి చెందిన షేక్‌ మస్తాన, బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన వలి కుటుంబాలు ప్లాస్టిక్‌ టబ్బులు వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నాయి. ఈ కుటుంబాలవారు వ్యాపారం నిమిత్తం సంచార జీవనం గడుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గోరంట్ల మండల కేంద్రంలో వ్యాపారం ముగించుకుని, హిందూపురానికి మినీ గూడ్స్‌ అటోలో బయలుదేరారు. చెర్లోపల్లి సమీపంలో మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వెనుక భాగాన కూర్చున్న హుసేనబీ, నన్నీబీ వాహనం కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు. హుసేనబీకి భర్త, నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నన్నీబీకి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హిందూపురం అప్‌గ్రేడ్‌ సీఐ జీటీ నాయుడు తెలిపారు. అదే వాహనంలో ప్రయాణించిన హుసేనబీ భర్త వలీ, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 


కన్నీరుమున్నీరైన బాధితులు

వ్యాపారం ముగించుకున్న అనంతరం గోరంట్ల పట్టణంలో ఒకచోట తాము విడిది చేశామని, ఆ సమయంలో పోలీసులు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెళ్లిపోకపోతే కేసు పెడతామని భయపెట్టారని, దీంతో రాత్రి సమయంలో ఆటోలో హిందూపురానికి బయలుదేరామని వాపోయారు. పోలీసులు భయపెట్టకుండా ఉంటే తాము రాత్రికి గోరంట్లలోనే ఉండేవారమని, రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదని బోరున విలపించారు. ‘అమ్మ మనల్ని వదిలిపెట్టి పొయ్యిందయ్యా..’ అని బిడ్డలు తండ్రిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటే.. అక్కడున్నవారు చలించిపోయారు.

Updated Date - 2022-02-23T06:20:28+05:30 IST