మా పర్మిషన్ లేదు..!

ABN , First Publish Date - 2022-04-24T06:47:04+05:30 IST

తమ కనుసన్నలో ఏర్పాటు కాలేదన్న కారణంగా కంటి వైద్య శిబిరాన్ని అడ్డుకున్నారు వైసీపీ నాయకులు.

మా పర్మిషన్ లేదు..!
కంటివైద్యం కోసం ఎదురుచూస్తున్న రోగులు

వైసీపీ నాయకుల ప్రచారం

ఉచిత కంటి వైద్య శిబిరం రద్దు

యాడికిలో ఇబ్బంది పడ్డ వృద్ధులు

మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి

యాడికి, ఏప్రిల్‌ 23: తమ కనుసన్నలో ఏర్పాటు కాలేదన్న కారణంగా కంటి వైద్య శిబిరాన్ని అడ్డుకున్నారు వైసీపీ నాయకులు. సోషల్‌ మీడియాలో వారు పెట్టిన ఓ పోస్టు కారణంగా యాడికి మండల కేంద్రంలో శనివారం నిర్వహించాల్సిన ఉచిత కంటి వైద్య శిబిరం రద్దు అయింది. దీంతో అనంతపురం, పామిడి, యల్లనూరు, పుట్లూరు, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రోటరీక్లబ్‌, శంకర్‌ ఐ హాస్పిటల్‌ వారు పది రోజులుగా ప్రచారం చేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. దీంతో పలువురు వృద్ధులు యాడికి ప్రభుత్వ ఆస్పత్రికి (మాతాశిశు  ఆరోగ్య కేంద్రం) చేరుకున్నారు. శిబిరం రద్దు అయిందని తెలుసుకుని ఆవేదన చెందారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి యాడికి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. డాక్టర్లతో మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు అనుమతులు తీసుకోవాలా అని విచారించారు. అక్కడే ఉన్న వృద్ధులతో మాట్లాడారు. వారు సొంత గ్రామాలకు వెళ్లడానికి స్థానిక నాయకులతో ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వైసీపీ నాయకుల అనుమతి తీసుకోవాలా? ఇదెక్కడి నిబంధన? అని ప్రశ్నించారు. రోటరీక్లబ్‌ వారు ఎన్నో సేవలు అందిస్తున్నారని, శంకర ఐ హాస్పిటల్‌ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని అన్నారు. కంచి కామకోటి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్‌ వారు పేదలకు సేవ చేస్తుంటే, వారిపై అసత్య ప్రచారాలు చేస్తారా? సేవ చేసేవారు కిడ్నీలు, కళ్లు దోచుకుంటారా? అని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మానుకోండి, సేవ చేసే వారిపై మీ పెత్తనం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత సేవ చేయడానికి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల అనుమతి తీసుకోవాలా ? మీకు ముడుపులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. గత నెలలో కూడా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కదా, అప్పుడేం చేశారు? అని నిలదీశారు. సేవను సొంత పబ్లిసిటీకి వాడుకోవడానికి అసత్య ప్రచారాలు చేయడం తగదని, వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఇకమీదట పెళ్లిళ్లు, ప్రసవాలు, ముస్లింల వడుగుల కోసం కూడా వైసీపీ నాయకుల అనుమతి తీసుకోవాలని అంటారేమో అని ఎద్దేవా చేశారు. త్వరలోనే యాడికిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తానని, అవసరమైన వారంతా వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని జేసీపీఆర్‌ తెలిపారు.





యల్లనూరు నుంచి వచ్చాను..

ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారంటే యల్లనూరు నుంచి ఇక్కడికి వచ్చాను. వైసీపీ వాళ్లు అనుమతి ఇవ్వలేదని డాక్టర్లు రాలేదంట. డాక్టర్లు ఊరికే చేసేదానికి వైసీపీ వాళ్ల అనుమతి తీసుకోవాలా..? ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చాను. వైద్యం చేయించుకోకుండానే తిరిగి వెళుతున్నాను.

- చంద్రమ్మ

Updated Date - 2022-04-24T06:47:04+05:30 IST