-
-
Home » Andhra Pradesh » Ananthapuram » We cannot give plants-MRGS-AndhraPradesh
-
మొక్కలను మేం ఇవ్వలేం
ABN , First Publish Date - 2022-09-14T05:22:50+05:30 IST
డ్రైలాండ్ హార్టికల్చర్ కింద రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేయాల్సిన డ్వామా అధికారులు చేతులెత్తేశారు. ‘మీరే తెచ్చుకోండి.. బిల్లు చెల్లిస్తాం..’ అని చెప్పేశారు.

చేతులెత్తేసిని డ్వామా
ప్రభుత్వ తీరుతో లబ్ధిదారులకు నష్టం
మూడేళ్లుగా రూ.32 కోట్ల బిల్లు బకాయి
అనంతపురం క్లాక్‌టవర్ : డ్రైలాండ్ హార్టికల్చర్ కింద రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేయాల్సిన డ్వామా అధికారులు చేతులెత్తేశారు. ‘మీరే తెచ్చుకోండి.. బిల్లు చెల్లిస్తాం..’ అని చెప్పేశారు. పరోక్షంగా రైతులపై రవాణా భారాన్ని మోపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏటా రైతులకు ప్రభుత్వం పండ్ల మొక్కలను అందజేస్తుంది. లబ్ధిదారులు వేసవిలో గుంతలు తవ్వుకుని సిద్ధంగా ఉంటారు. వర్షాలు మొదలు కాగానే వారికి పొలం వద్దకే పండ్లమొక్కలను సరఫరా చేసేవారు. రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న కడియం నర్సరీల నుంచి నాణ్యమైన, జిల్లా వాతావరణానికి అనువైన మొక్కలను తెప్పించి ఇచ్చే బాధ్యత డ్వామా అధికారులు తీసుకునేవారు. కానీ ఈ ఏడాది మొక్కలు సరఫరా చేయలేమని, రైతులే తెచ్చుకోవాలని చెప్పేశారు. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పండ్ల తోటల రైతులకు నీరు, కూలి ఖర్చుల బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.
ప్రభుత్వం అందించే మొక్కలను నాటుకుని.. వాటికి నీరుపోసి కాపాడుకునేందుకు రైతులు యజ్ఞం చేస్తారు. బోరుబావుల్లో ఉండే అరకొర నీటిని బిందెల్లో పటుకుని మరీ మొక్కలను తడుపుతారు. బోరు ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు. మొక్కలు నాటేందుకు, సంరక్షణకు, నీరు పోసేందుకు కూలీలపై ఆధారపడతారు. వీటి ఖర్చులకే అప్పు చేస్తారు. ఇది చాలదన్నట్లు మొక్కలను రైతులే తెచ్చుకోవాలని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, తైవాస్జామ, సపోటా, చింత, నేరేడు, కొబ్బరి, సీతాఫలం, ఆపిల్ బేర్, డ్రాగనఫ్రూట్, గులాబీ, మునగ, మల్లె మొక్కలను పంపిణీ చేసేవారు. ఇవి కావాల్సిన రైతులు స్వయంగా దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వందలాది మంది రైతులకు డ్వామా అధికారులు గతంలో గంపగుత్తగా మొక్కలను లారీల్లో తెచ్చేవారు. ఇప్పుడు రైతులు వ్యక్తిగతం తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి.
అనంతపురం జిల్లాలో 4 వేల మంది రైతులకు రూ.13.56 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేళ్ల నుంచి బిల్లులను చెల్లించలేదు. బాధిత రైతులు పలుమార్లు కలెక్టర్, డ్వామా అధికారులను కలిశారు. బిల్లులు చెల్లించాలని విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది మే, జూన నెలల్లో మొక్కలు నాటేందుకు 2,844 మంది రైతులు 5,500 ఎకరాలను సిద్ధం చేసుకున్నారు. వీరు మొక్కల కోసం ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలలు గడిచినా అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఉన్న ట్లుండి.. ‘మీరే తెచ్చుకోండి..’ అని బాంబు పేల్చారు. ఏటా పంటల సాగుకు అప్పు చేసే రైతులు.. వందల కి.మీ. వెళ్లి ఎవరికి వారు మొక్కలను ఎలా తెచ్చుకోగలరు..?
రైతులే మొక్కలు తెచ్చుకోవాలి..
ఈ ఏడాదిలో డ్రైలాండ్ హార్టికల్చర్ కింద పండ్లతోటల పెంప కం రైతులు స్వయంగా మొక్కలు తెచ్చుకోవాలి. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం లబ్ధిదారుల కు ఈ విషయాన్ని తెలియజేశాం. గత ఏడాది బిల్లులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. పండ్లతోటల రైతులందరికీ ప్రతి పైసా బిల్లు చెల్లిస్తాం. దరఖాస్తు చేసుకున్న రైతులకు పండ్లమొక్కలు అందించాల్సి ఉంది. ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులతో చర్చించాం. కడియం నుంచి మొక్కలు తెప్పించి సరఫరా చేసేవాళ్లం. ఈ ఏడాది పంపిణీ చేయడం లేదు.