హంద్రీనీవాకు మార్చిదాకా నీరివ్వాల్సిందే..

ABN , First Publish Date - 2022-11-24T00:11:26+05:30 IST

హంద్రీనీవాకు నీటిని తేవడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని, అసమర్థత వల్ల రైతులను నట్టేట ముంచు తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు.

హంద్రీనీవాకు మార్చిదాకా నీరివ్వాల్సిందే..

- మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లు, నవంబరు 23: హంద్రీనీవాకు నీటిని తేవడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని, అసమర్థత వల్ల రైతులను నట్టేట ముంచు తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు. హంద్రీ నీవాకు డిసెంబరు ఆఖరుకల్లా నీరు బంద్‌ అవుతుందని ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి నిరసన ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజేంద్రనగర్‌లోని హంద్రీనీవా ఇంజనీరింగ్‌ సర్కిల్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జితేంద్రగౌడు మాట్లాడుతూ హంద్రీనీ వాకు ఏప్రిల్‌ వరకూ నీరిచ్చే పరిస్థితి నుంచి డిసెంబరుకే ఎత్తిపోతలను నిలిపిస్తామని చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతారని, అప్పులపాలై అధోగతి చెందుతారన్న ఇంగితం ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఇలా అర్ధాంతరంగా నీటిని నిలిపివేసిన దృష్టాంతం లేదన్నారు. ఐదేళ్లూ సమర్థవంతంగా హంద్రీనీవాలో నీటిని పారించారన్నారు. గత సంవత్సరం ఇదేవిధంగా రెండు నెలల ముందే కాల్వలో ఎత్తిపోతలను నిలిపివేసినందున రైతులు నట్టేటమునిగారన్నారు. ఈ సంవత్సరం నాలుగు నెలల ముందే నీరు బందవుతుందని నిస్సిగ్గుగా చెబుతున్నారన్నారు. తమది రైతు ప్రభుత్వమని బడాయిలు చెప్పుకోవడం కాదని, చేతల్లో రైతులకు మేలు చేసిచూపాలన్నారు. ఇదే పరిస్థితి చంద్రబాబుకు ఎదురైతే పోరాటం చేసైనా పంటల కాలం పూర్తయ్యే వరకూ నీరు వచ్చేలా చూసేవారన్నారు. రైతులకు ఖర్మపట్టి అసమర్థుడైన జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. మార్చి వరకూ హంద్రీనీవా కాలువకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్‌కుమార్‌ గౌడు, సింగిల్‌విండో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన్‌ యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, మాజీ ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, సింగిల్‌విండో సొసైటీ మాజీ అధ్యక్షుడు మల్లికార్జున, కౌన్సిలరు కే కృపాకర్‌, ఎంపీటీసీ సభ్యుడు తలారి మస్తానప్ప, నాయకులు అనిల్‌కుమార్‌ గౌడు, హనుమంతు, కేశప్ప, బొజ్జేనాయక్‌, ముక్కన్నగారి రామాంజనేయులు, రామన్నచౌదరి, ఆటోఖాజా, రంజాన్‌, ఫ్రూట్‌ మస్తాన్‌, ఫజులు, కే సురేశ్‌, గిడ్డయ్య, రంగస్వామి, గోపాల్‌, గిడ్డయ్య, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:11:26+05:30 IST

Read more