చావు కోసం... బతుకుతున్నాం..

ABN , First Publish Date - 2022-07-19T05:20:49+05:30 IST

మండలంలో చిన్న పంచాయతీ అయిన వంకమద్ది పరిధిలోని పెద్దరాంపల్లికి పెద్దకష్టం వచ్చిపడింది. రోజురోజుకీ ఖాళీ అవుతోంది. కనుమరుగైపోతోంది.

చావు కోసం...  బతుకుతున్నాం..

ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళ

నేడు ఎటుచూసినా బీడే..

వలసెళ్లిన పిల్లలు..

20 మంది వృద్ధులే నివాసం

పథకాలు, పింఛన అందక పస్తులతో సావాసం

చస్తేగానీ, పిల్లలు రారని కంటతడి


నంబులపూలకుంట

మండలంలో చిన్న పంచాయతీ అయిన వంకమద్ది పరిధిలోని పెద్దరాంపల్లికి పెద్దకష్టం వచ్చిపడింది. రోజురోజుకీ ఖాళీ అవుతోంది. కనుమరుగైపోతోంది. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టిన ఊరు నేడు తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు, భూములు, ఇల్లు వదిలి పట్టణాలకు వలసబాట పట్టారు యువకులు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పల్లెలో ఉంటున్న వారి తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సి వస్తోంది. పెద్దరాంపల్లిలో గతంలో 80 కుటుంబాలు ఉండేవి. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దరాంపల్లికి కూలి పనులకు వచ్చేవారు. పుష్కలమైన పాడి, పచ్చని పొలాలతో ఎటుచూసినా కోనసీమను తలపించేది. ఒక్కో రైతుకు 15 ఎకరాలకు పైబడి భూమి ఉంది. కాలక్రమేణా అతివృష్టి, అనావృష్టి ప్రభావంతో ఏటా పంటలను సాగుచేయడమే తప్ప.. పైసా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఏడాదికేడాదికీ అప్పులు పెరిగిపోయి, కనీసం వడ్డీలు కట్టలేని దుస్థితి తలెత్తింది. దీంతో చాలామంది గ్రామం వదిలి, పట్టణ ప్రాంతాలకు వలసబాట పట్టారు. ప్రస్తుతం గ్రామంలో 20 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారిలో కూడా 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఉన్నారు. గ్రామంలో ఆరేళ్ల క్రితం పెద్ద గంగయ్య అనే రైతు బోరు వేశాడు. నేటికీ ఆ బోరుకు విద్యుత కనెక్షన లేదు. నేటికీ గ్రామానికి మూడు ఫేస్‌ల కరెంటు లేదంటే ఎంత వెనుకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏ ఇంట్లో చూసినా.. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు.


భూములు ఉంటేనన్నా.. బిడ్డలు వస్తారని..

గ్రామంలో దాదాపు 20 మంది వృద్ధులు మాత్రమే ప్రస్తుతం నివసిస్తున్నారు. భూములు పండట్లేదు, వృద్ధుల జీవనం కూడా భారంగా మారింది. ఈ నేపథ్యంలో భూములు అమ్ముకోవచ్చు కదా.. అనగా.. వృద్ధులు కళ్లు చెమర్చే సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న పిల్లలు.. భూములుంటే వాటిని చూసేందుకైనా వస్తారనీ, వాటిని అమ్మేస్తే.. ఊరికే రారు, తమను చూడరని ఆవేదన చెందారు. ఇక, తాము చనిపోతే తప్ప గ్రామానికి వచ్చే పరిస్థితి ఉండదని కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికే కొంతమంది యువకులు.. ఏడాదికోసారి తమ పెద్దల సమాధుల వద్దకు వచ్చి వెళ్తుంటారని వాపోయారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం.


పెద్దరాంపల్లికి అప్పట్లో కూలి కోసం వచ్చేవారు

పంటలు బాగా పండే రోజుల్లో తమ గ్రామానికి సమీపంలోని ఊళ్ల వారు కూలి పనులకు వచ్చేవారని వృద్ధులు తెలిపారు. అప్పట్లో గ్రామం పాడిపంటలతో కళకళలాడుతుండేదని చెప్పుకొచ్చారు. ఏ ఇంట్లో చూసినా ధాన్యం రాసులుండేవనీ, వాటి కొనుగోలుకు పెద్దఎత్తున వ్యాపారులు వచ్చేవారని గత వైభవాన్ని వివరించారు. కాలక్రమేణా పంటలు పండక అప్పులు పెరిగిపోయాయని వాపోయారు. ఈ కారణంగా గ్రామంలో గౌరవముండదు, పైసాకూడా పుట్టదని యువకులు భావించారు. అప్పులు కూడా పుట్టని దుర్భర పరిస్థితుల్లో ఊరు వదలాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా ఉంటుండడంతో వృద్ధులు ఒంటరిగా బతుకుతున్నారు. తమను ఎప్పుడు దేవుడు తీసుకుపోతాడా అని ఎదురు చూస్తున్నట్లు వారు కంటతడి పెట్టుకుంటున్నారు. బిడ్డలు బతుకు దేరువుకోసం పట్టణాలకు వలసలు వెళ్లారు. పండగలకు కూడా రాని దుస్థితి. ఇన్ని కష్టాలు పడుతున్నా, గ్రామానికి ఏ అధికారి, నాయకుడు కూడా రాలేదని ఆవేదన చెందారు.


ఊరిలో పస్తులతో జీవనం

ఊరిలో ఉన్నవారి పరిస్థితి దుర్భరం. పంటలు లేవు. చేద్దామంటే పనిలేదు. రేషనబియ్యంతో కడుపునింపుకునేవారు. ప్రస్తుతం అవి కూడా అందక పస్తులు ఉంటున్నామని వృద్ధులు వాపోతున్నారు. గతంలో తమకు పింఛన, రేషన బియ్యం అందేవనీ, ప్రస్తుతం అవికూడా రాకుండా పోయాయని ఆందోళన చెందారు. ఏ సాయం అందక, ఎలాంటి భరోసా దక్కక కష్టంగా జీవనం సాగిస్తున్నామన్నారు.


పథకాలకు దూరం చేశారు..

గ్రామంలో ఉంటున్న వృద్ధులకు గతంలో పింఛన ఇతర ప్రభుత్వ పథకాలు అందేవి. ప్రస్తుతం అధిక భూమి ఉందన్న సాకుతో రేషనకార్డు తీసేశారు. పింఛన కూడా ఇవ్వట్లేదని గ్రామస్థులు దొడ్డెప్ప, సుబ్బయ్య, గంగయ్య, సెంటన్న, గంగన్న, చిన్ననాగన్న, నాగభూషణ ఆవేదన చెందుతున్నారు. భూములు వృద్ధుల పేరునే ఉండడంతో ప్రభుత్వ పథకాలకు అనర్హులయ్యారు. భూములున్నా.. అవి పండేదీ లేదు, పండించే వారూ లేరని వృద్ధులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా భూములే శాపాలుగా మారాయని ఆవేదన చెందుతున్నారు. పిల్లలు పొట్ట చేతబట్టుకుని, బతుకుదెరువు కోసం వలసెళ్లారు. ఊరుగాని ఊరిలో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి జీవనమే వారికి భారమవుతోంది. గ్రామంలో ఉన్న తమకు పథకాలు, పింఛన ఆసరాగా ఉండేవి. అవి కూడా దక్కకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.


కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా..

నా వయసు 60  ఏళ్లు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. నా భర్త సుబ్బయ్య పేరున 15 ఎకరాల భూమి ఉంది. దీంతో రేషనకార్డు, పింఛన ఆపేశారు. భూమిని పిల్లలు పంచుకోకపోవడంతో నా భర్త పేరు మీదే ఉండిపోయింది. అదే శాపంగా మారింది.

శకుంతలమ్మ


80 ఏళ్లొచ్చినా.. పింఛన ఇవ్వట్లేదు

నా వయసు 80 ఏళ్లు. మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. నేటికీ నాకు పింఛన రావడం లేదు. నా పేరుతో భూములుండడమే శాపమైంది. నాకు నలుగురు కుమారులున్నారు. వారి పేర్లమీద భూమి రాసిద్దామంటే రిజిస్ర్టార్‌ ఆఫీసుకు వెళ్లేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వలేదు. దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నా. ప్రభుత్వం పింఛన, రేషన ఇచ్చి ఆదుకోవాలి.

దొడ్డెప్ప


Updated Date - 2022-07-19T05:20:49+05:30 IST