మూగ రోదన

ABN , First Publish Date - 2022-11-16T23:52:19+05:30 IST

అసలే కరువు జిల్లా. వర్షం కురిసిందంటే అతివృష్టి. లేదంటే అనావృష్టి. వెరసి ఏటా పంట పెట్టడం, దిగుబడి రాక నష్టపోవడం అన్నదాతకు పరిపాటిగా మారింది.

మూగ రోదన
లంపి వ్యాధి బారిన పడిన ఆవు

పశువులను కబళిస్తున్న లంపి మహమ్మారి

తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

పట్టించుకోని ప్రభుత్వం

జిల్లాలో పశువైద్యుల కొరత

టీకా లక్ష్యం అందుకునేరా?

మడకశిర

అసలే కరువు జిల్లా. వర్షం కురిసిందంటే అతివృష్టి. లేదంటే అనావృష్టి. వెరసి ఏటా పంట పెట్టడం, దిగుబడి రాక నష్టపోవడం అన్నదాతకు పరిపాటిగా మారింది. పంటల సాగుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితులు తలెత్తాయి. పంటల సాగు ద్వారా బతకడం కష్టమనుకున్న రైతు ప్రత్యామ్నాయం వైపు మళ్లాడు. అప్పటికే ఉన్న దానితోపాటు మరింత అప్పు చేసి, పాడిపశువులు కొనుగోలు చేశాడు. వాటిపైనే ఆధారపడి అతికష్టమ్మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆధారంపై కూడా దెబ్బపడుతోంది. లంపి చర్మ వ్యాధి పశువులను కబళిస్తోంది. పశువులు మృతిచెందుతుండడంతో అన్నదాతలు జీవనాధారం కోల్పోయి, మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యాధి నివారణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పశువైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం శోచనీయం. పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం అందజేసి, ఆదుకునే దిశగా ఆలోచించట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పశువులకు ప్రాణాంతకమైన లంపి చర్మ వ్యాధి ప్రబలుతోంది. మహమ్మారి బారిన పడి పశువులు మృత్యువాత పడుతుండడంతో నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12కిపైగా పశువులు చనిపోయినట్లు తెలుస్తోంది. వ్యాధి విస్తరించకుండా పలు పశువుల సంతలను కూడా అధికారులు బంద్‌ చేశారు. అయినా వ్యాధి తగ్గుముఖం పట్టడం లేదని రైతన్నలు అంటున్నారు. గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో లంపి వ్యాధి ప్రబలడం, ఎద్దు మృతిచెందడంతో వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి.

లంపి వ్యాధి సోకకుండా అధికారులు వ్యాక్సిన వేస్తున్నారు. జిల్లాలో 2.20 లక్షల పశువులు ఉన్నాయి. ఇందులో చిన్నదూడలు, గర్భంతో ఉన్న పాడిపశువులకు వ్యాక్సిన వేయకూడదని అధికారులు అంటున్నారు. అవిపోను 1.80 లక్షల పశువులకు వ్యాక్సిన వేయాల్సి ఉందని సంబంధిత శాఖాధికారి తెపారు. ఇప్పటి వరకు లక్ష పశువులకు వేశామని అధికారులు పేర్కొంటున్నారు.

ఎద్దులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

లంపి వ్యాధి బారినపడి మృతిచెందిన ఎద్దులకు ఎక్స్‌గేషియా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులను వేలకువేల రూపాయలు వెచ్చించి, కొనుగోలు చేస్తున్నామనీ, అవి చనిపోతే తీవ్రంగా నష్టపోతామని పేర్కొంటున్నారు. వాటికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, ఆదుకోవాలని కోరుతున్నారు.

పశువైద్య పోస్టులను భర్తీ చేయాలి

జిల్లావ్యాప్తంగా పలు పశువైద్య శాలల్లో డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. డిప్యుటేషనపై వైద్యులను నియమిస్తున్నారు. లంపి ప్రబలుతున్న నేపథ్యంలో పశువులకు వైద్యం అందట్లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. పశువైద్య పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

అప్పులు చేసి.. పశువులు కొన్నా

ఏటా పంటలు దెబ్బతిని నష్టపోతుండడంతో జీవనాధారం కోసం పాడి పశువులను అప్పులు చేసి, కొనుగోలు చేశా. కొన్ని రోజులుగా ఆవులకు లంపి వ్యాది సోకింది. వాటి శరీరంపై బుడిపెలు వస్తున్నాయి. కొన్నిరోజులకే అవి శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. పాల దిగుబడి తగ్గింది. చికిత్స చెయిద్దామంటే స్థానికంగా పశువైద్య శాలలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. అమ్ముదామంటే కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.

రైతు లింగప్ప, ఎస్‌ రాయాపురం

60 శాతం వ్యాక్సినేషన పూర్తి చేశాం..

పశువులకు వ్యాక్సిన వేయడం ద్వారా లంపి చర్మ వ్యాధి తగ్గుముఖం పడుతోంది. పశువులు చనిపోవడం తగ్గింది. దీంతో పశువుల సంతను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం.

సుబ్రహ్మణ్యం, జిల్లా పశువైద్యాధికారి

Updated Date - 2022-11-16T23:52:22+05:30 IST