అప్పుల ఉరికి వేలాడిన ఇద్దరు..

ABN , First Publish Date - 2022-04-24T06:45:10+05:30 IST

పొలంలో పోరాడుతున్న రైతులు రాలిపోతూనే ఉన్నారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇస్తే చాలన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు.

అప్పుల ఉరికి వేలాడిన ఇద్దరు..
నల్లబోతుల శివకుమార్‌ మృతదేహం

రాలిపోతున్న రైతన్న

అప్పుల ఉరికి వేలాడిన ఇద్దరు..

కొనకొండ్ల, యాటకల్లులో విషాదం


పొలంలో పోరాడుతున్న రైతులు రాలిపోతూనే ఉన్నారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇస్తే చాలన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు. ఉన్న రైతులందరూ ఉరిపోసుకుంటుంటే.. భవిష్యత్తు ఏమిటి..? వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నమే చేయరా..? మట్టి మనిషిని బతికించుకోవాలన్న స్పృహ లేకుంటే ఎలా..? కౌలు సేద్యం చేసినా, సొంత పొలంలో పంట పెట్టినా.. ఆత్మహత్యే శరణ్యమన్నట్లు పరిస్థితి తయారైంది. చినుకు ఎప్పుడు రాలుతుందో, గాలివాన ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియని అనంతలో అన్నదాతల బలిదానాలకు అంతేలేకుండా పోతోంది. ఇది ఎంతటి విషాదం..! ఆత్మహత్యల జాబితాలో మరో ఇద్దరు రైతులు చేరారు. యాటకల్లు సన్నకారు రైతు రాజన్న, కొనకొండ్ల కౌలు రైతు శివకుమార్‌ ఉరితాడుకు వేలాడారు. సేద్యపు అప్పులు తీర్చే మార్గం లేక, ఆలుబిడ్డలను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 


బతుకు భారమై..

వజ్రకరూరు మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన  కౌలు రైతు నల్లబోతుల శివకుమార్‌ (25) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు భార్య అనితాంజలి, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, కొనకొండ్ల గ్రామానికి చెందిన రైతు చుక్కా మల్లికార్జునకు చెందిన మూడు ఎకరాల పొలాన్ని శివకుమార్‌ ఐదేళ్లుగా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఏటా మిరప, వేరుశనగ సాగు చేసేవాడు. పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు రూ.5 లక్షలకు పైగా అయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. ఇదే సమయంలో భార్య ఆరోగ్యం క్షీణించింది. ఆమె వైద్యం కోసం మరో రూ.3 లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శివకుమార్‌ భార్య అనితాంజలి శుక్రవారం పుట్టింటికి వెళ్లింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు ఉరివేసుకున్నాడు. కాసేపటికి శివకుమార్‌ తల్లి వరలక్ష్మి ఇంటి తలుపులు తీసింది. ఫ్యానకు వేలాడుతున్న కొడుకును చూసి గట్టిగా కేకలు వేసి కుటుంబ సభ్యులను పిలిచింది. కొన ఊపిరితో ఉన్న శివకుమార్‌ను కిందికి దించి, చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, శివకుమార్‌ అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. రైతుకు కూతుళ్లు గ్రేసి(5), నిత్య(3), కుమారుడు అఖిల్‌(11 నెలలు) ఉన్నారు.

- వజ్రకరూరు


ఒత్తిడి భరించలేక..

శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లు గ్రామానికి చెందిన రైతు గొల్ల రాజన్న (36) అప్పుల బాధ తాళలేక ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్థులు తెలిపిన మేరకు, రాజన్న తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వేరుశనగ, టమోటా సాగు చేసి నష్టపోయాడు. ఏటా సరైన దిగుబడి రాక అప్పులపాలయ్యాడు. పెట్టుబడుల కోసం రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. వ్యవసాయం నుంచి నష్టాలు తప్ప ఆదాయం లేకపోవడంతో తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. దిక్కుతోచని స్థితిలో శుక్రవారం రాత్రి పొలానికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిపోయాడు. ఉదయం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన చేశారు. స్పందించకపోవడంతో అనుమానం వచ్చి  పొలం వద్దకు వెళ్లి గాలించారు.  అక్కడ కానుగ చెట్టుకు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. విగతజీవిగా ఉన్న రాజన్నను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రైతుకు భార్య లక్ష్మి, ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

- శెట్టూరు

Read more