తల పగలగొట్టాడు

ABN , First Publish Date - 2022-05-24T06:10:30+05:30 IST

బకాయి బిల్లు చెల్లింపు విషయంలో వివాదం తలెత్తి, వినియోగదారుడిపై సచివా లయ ఎనర్జీ అసిస్టెంట్‌ (జేఎల్‌ ఎం) దాడి చేసి, తీవ్రంగా గాయ పరిచాడు.

తల పగలగొట్టాడు

వినియోగదారుడిపై జేఎల్‌ఎం దాడి 

పెండింగ్‌ బిల్లుపై వివాదం

గార్లదిన్నె, మే 23: బకాయి బిల్లు చెల్లింపు విషయంలో వివాదం తలెత్తి, వినియోగదారుడిపై సచివా లయ ఎనర్జీ అసిస్టెంట్‌ (జేఎల్‌ ఎం) దాడి చేసి, తీవ్రంగా గాయ పరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెనకచెర్లలో సోమవా రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు, పెనక చెర్లలో రాము అనే కూలీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి విద్యుత బిల్లులు చెల్లించలేదు. తన వదిన పేరిట ఉన్న ఈ విద్యుత సర్వీసు కు బకాయి సుమారు రూ.1,800 ఉంది. సచివాలయ ఉద్యోగి దివాకర్‌ సోమవారం ఉదయం బకాయి వసూలు కోసం వెళ్లాడు. తన వద్ద డబ్బులు లేవని, త్వరలోనే చెల్లిస్తానని రాము సమాధానమిచ్చాడు. కానీ ఇప్పుడే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ, జేఎల్‌ఎం దివాకర్‌ విద్యుత స్తంభం ఎక్కి సర్వీస్‌ వైర్‌ను కట్‌ చేశాడు. అంతటితో అగకుండా ఇంటి వద్ద ఉన్న వైర్‌ను కట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ‘స్తంభానికి ఉన్న వైర్‌ కట్‌ చేశావు కదా, ఇక్కడెందుకు కట్‌ చేస్తావ్‌?’ అని రాము అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై, ఘర్షణ చోటుచేసుకుంది. జేఎల్‌ఎం దివాకర్‌ తన చేతిలో ఉన్న కటింగ్‌ ప్లయర్‌తో దాడి చేశాడు. రాము తలకు తీవ్ర గాయమైంది. బాధితుడిని కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


గొడవ వాస్తవమే: శివప్రసాద్‌, ఏఈ

పెనకచెర్లలో విద్యుత వైర్‌ కట్‌చేసే విషయంలో వినియోగదారుడికి, జేఎల్‌ఎంకు గొడవ జరిగింది. బకాయి చెల్లించలేదని సర్వీస్‌ తొలగించాము. అయినా, అక్రమంగా వినియోగిస్తున్నారని తెలిసి, సర్వీస్‌ వైర్‌ కట్‌ చేసేందుకు జేఎల్‌ఎం దివాకర్‌ వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తోపులాటలో జేఎల్‌ఎం వద్ద ఉన్న కటింగ్‌ ప్లయర్‌ వినియోగదారుడి తలకు తగిలింది.


Read more