దెబ్బలు.. దుర్భాషలతో టార్చర్‌

ABN , First Publish Date - 2022-09-26T05:37:15+05:30 IST

ఆయన పగటిపూట పెద్దగా పనిపెట్టుకోరు. రాత్రిళ్లు మాత్రం విరామం లేకుండా పని చేస్తారు. అలాగని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాదు..! హార్డ్‌ వేర్‌ అధికారి..! లాఠీలు.. లారీ టైర్‌ చీలికలను ఆయన ఎక్కువగా వాడుతుంటారు.

దెబ్బలు.. దుర్భాషలతో టార్చర్‌
డీఎస్పీ దెబ్బలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు (ఫైల్‌)

నైట్‌డ్యూటీ.. విరిగే లాఠీ!

సబ్‌డివిజన స్టేషన్లలో కౌన్సెలింగ్‌

డీఎస్పీ చైతన్యపై ప్రైవేటు కేసులు

బాధితుల్లో ఎక్కువగా టీడీపీ వర్గీయులు


       ఆయన పగటిపూట పెద్దగా పనిపెట్టుకోరు. రాత్రిళ్లు మాత్రం విరామం లేకుండా పని చేస్తారు. అలాగని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాదు..! హార్డ్‌ వేర్‌ అధికారి..! లాఠీలు.. లారీ టైర్‌ చీలికలను ఆయన ఎక్కువగా వాడుతుంటారు. చేతికి.. నోటీకి పని చెబుతారు. వాటిని భరించడం కంటే చావడం మేలు అని బాధితులు అంటారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య టార్చర్‌ గురించే ఇదంతా..! ఆయన దెబ్బలు తింటే కోలుకునేందుకు నెలలు పడుతుందట. కౌన్సెలింగ్‌ పేరిట స్టేషనకు పిలిపించి.. రాత్రిపూట చిత్రహింసలు పెడతారని అంటున్నారు. ఒక్కోసారి స్వయంగా స్టేషన్లకు వెళతారు. వీలుకానప్పుడు తన వద్దకు పిలిపించు కుంటారు. తనివితీరా తిడతారు. అలసిపోకుండా కొడతారు.. అని బాధితులు అంటున్నారు. పగటి పూట స్టేషనలో రద్దీ ఉంటుందని, అదే రాత్రి అయితే ఎలాంటి డిస్టర్‌బెన్స లేకుండా కౌన్సెలింగ్‌ ఇవ్వొచ్చని డీఎస్పీ భావిస్తారట. టీడీపీ వర్గీయులను టార్చర్‌ పెట్టే సమయంలో అర్ధనగ్నంగా మారుస్తారని, కళ్లకు గంతలు కట్టి శరీరాన్ని కుళ్లబొడుస్తారని చెబుతారు. కొట్టేటప్పుడు తమ కుటుంబ సభ్యులనుద్దేశించి అసభ్యంగా మాట్లాడుతారని, ఆ మాటలను భరించలేమని బాధితులు అంటున్నారు. ‘డీఎస్పీ దుర్భాషలను విని భరించడంకంటే ఆత్మహత్య చేసుకోవడం మేలు..’ అని బాధితుడు ఒకరు కంటతడి పెట్టుకున్నారు. ‘నీ ఇంటికి వస్తా.. నీ భార్యతో కలిసి భజన చేస్తా..’ వంటి మాటలను భరించలేక పుట్లూరు మండలం ఎ.కొండాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు వెంకటేశ, రెండు రోజుల క్రితం ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయాడు. తన ఆత్మహత్యకు డీఎస్పీదే బాధ్యత అని లేఖరాసిపెట్టి అదృశ్యమయ్యాడు. 

- తాడిపత్రి
విరిగిన లాఠీలు.. చిరిగిన టైర్లు..

- మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ వర్గీయులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోమశేఖర్‌ నాయుడు, టీడీపీ వర్గీయులు పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన పవన, పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన నరేంద్రరెడ్డి, పెద్దపప్పూరు మండలం పెద్దయక్కలూరుకు చెందిన ఓబిరెడ్డిని తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషనకు తీసుకువచ్చారు. కళ్లకు గంతలు కట్టిమరీ డీఎస్పీ చైతన్య లాఠీలతో చితకబాదారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీలు సరిపోవు అనుకుంటే.. లారీ టైర్లను అనువుగా కత్తిరించి, వాటితో కూడా బాదుతారని సమాచారం. 

- తాడిపత్రి మండలం కోమలికి చెందిన పెద్దిరాజు, మరికొందరు డీఎస్పీ లాఠీ దెబ్బలను తిన్నారు. వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడి, తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దిరాజును స్టేషనకు తీసుకువెళ్లి వారంరోజులపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

- పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అడ్డుగా ఉన్నారన్న ఆలోచనతో టీడీపీకి చెందిన తిరుపాల్‌రెడ్డిని ఆయన స్వగ్రామం, తాడిపత్రి మండలం ఆలూరుకు వెళ్లనీకుండా అడ్డుకున్నారని, అక్రమంగా కేసులు బనాయించారని డీఎస్పీపై టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపాల్‌రెడ్డి అనుచరులపై వైసీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఆ ఘటనలో గాయపడిన టీడీపీ వర్గీయులు రంగనాయకులు, ప్రసాద్‌, రమేష్‌, శివ తదితరులను డీఎస్పీ స్టేషనకు పిలిపించి చితకబాదారని బాధితులు వాపోతున్నారు.

- కొన్ని రోజుల క్రితం తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన టీడీపీ వర్గీయులను లాఠీలతో చితకబాదారు. పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఎదురుగా వస్తున్న ప్రత్యర్థులను చూసి బైక్‌ హారనను కొట్టాడన్న నెపంతో టీడీపీ వర్గీయులను చితకబాదారు. 

- పెద్దపప్పూరు మండలం పెద్దయక్కలూరులో ఓ దళితుడిపై భూమి విషయంలో వైసీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. దీంతో కేసు నమోదు చేయాలని బాధితుడు పోలీస్‌స్టేషన చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. దీంతో అనంతపురానికి వెళ్లి.. స్పందనలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ, పెద్దయక్కలూరు టీడీపీ నాయకుడికి ఫోనచేసి బెదిరించారని సమాచారం. ‘నీ అనుచరులను కంట్రోల్‌లో పెట్టుకోలేవా? పోలీసులపై స్పందనలో ఫిర్యాదు చేస్తాడా? జాగ్రత్త..! ఇకపై అలా జరిగితే తర్వాత తెలుస్తుంది నేనేమిటో..’ అని బెదిరించాడన్న ప్రచారం ఉంది.
డీఎస్పీపై ప్రైవేట్‌ ఫిర్యాదులు

తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని టీడీపీ వర్గీయులు వాపోతున్నారు. ఏ పార్టీలతో సంబంధం లేనివారూ ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో న్యాయం కోసం కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు చేస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో ఐదు ప్రైవేట్‌ ఫిర్యాదులు డీఎస్పీపై కోర్టుకు వెళ్లాయి. విచారణ పేరుతో స్టేషనకు పిలిపించి తమను డీఎస్పీ చితకబాదారని యాడికి మండలం కోనుప్పలపాడుకి చెందిన టీడీపీ వర్గీయులు రాజు, నాగార్జున, మరొకరు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎస్టీపీ-1 వద్ద జరిగిన దాడికి సంబంధించి వైసీపీ మద్దతుదారులపై కేసు నమోదుచేయలేదని టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జున, కాంట్రాక్టర్‌ మల్లికార్జునరెడ్డి కోర్టును ఆశ్రయించారు. మరికొందరు కూడా డీఎస్పీపై కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదులు వేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. 
ఎమ్మెల్యేకి అడ్వైజర్‌..

వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి డీఎస్పీ చైతన్య అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పిన వాటికి తలాడిస్తూ, ముందు వెనుక ఆలోచించకుండా టీడీపీ వర్గీయులను టార్గెట్‌ చేస్తున్నారు. తాడిపత్రి సబ్‌డివిజనలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను అణగదొక్కేందుకు ఎమ్మెల్యేకు డీఎస్పీ సహకరిస్తున్నారు. కౌన్సెలింగ్‌ పేరుతో చితకబాదుతూ.. భయబ్రాంతులు కలిగిస్తున్నారు. అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అనేక సంఘటనల్లో డీఎస్పీ పాత్ర ఎక్కువగా ఉంది. 

- జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన


అక్రమ కేసు పెట్టించాడు..

కోనుప్పలపాడులో టీడీపీ మద్దతుదారులను డీఎస్పీ చితకబాదారు. గాయపడ్డ సర్పంచ భర్త రామాంజనేయులు, సింహాద్రి, నాగార్జున తాడిపత్రి కోర్టులో డీఎస్పీ చైతన్యపై ప్రైవేట్‌ ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న నన్ను డీఎస్పీ స్టేషనకు పిలిపించుకున్నారు. ప్రైవేటు కేసులను ఉపసంహరించుకునేలా చూడాలని అన్నారు. నేను చెబితే వారు వినరని చెప్పినా పట్టించుకోలేదు. ఏం చేస్తావో ఏమో ఫిర్యాదులు ఉపసంహరించుకునేలా చూడాలి అని ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన నా కుమారుడిని అసభ్య పదజాలంతో దూషించాడు. కేసులు ఉపసంహరించలేదని అదేరోజు నాపై అక్రమ కేసు పెట్టించాడు. ప్రభోదానంద భక్తుడు రంగస్వామిని నేను బెదిరించినట్లు ఫిర్యాదు తీసుకొని ఈనెల 16న అక్రమ కేసు పెట్టించాడు. 

- చవ్వా గోపాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు


చికిత్స పొందుతున్నా వదల్లేదు.. 

వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న నాతోపాటు మరికొందరిని డీఎస్పీ చైత న్య బలవంతంగా తీసుకువెళ్లి చావబాదారు. వైసీపీ మద్దతుదారులపై నామమాత్రపు సెక్షనలతో కేసు పెట్టాడు. మాపై ఐపీసీ 307 కింద కేసు పెట్టించాడు. మమ్మల్ని చితకబాదడమే కాకుండా అక్రమ కేసు పెట్టించిన డీఎస్పీపై కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు వేస్తాను. 

- పెద్దిరాజు, కోమలి, తాడిపత్రి మండలం


అసభ్య పదజాలంతో దూషించాడు..

జూనలో ఎస్టీపీ-1 వద్ద పైపులైన మరమ్మతు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే తనయుడు హర్షవర్దనరెడ్డి, మరికొందరు నాపై దాడి చేశారు. పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన నాపై డీఎస్పీ దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. డీఎస్పీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అందుకే తాడిపత్రి కోర్టులో ఫిర్యాదు చేశాను.

- మల్లికార్జునరెడ్డి, టీడీపీ


కాళ్లు, చేతులకు వాపులు..

యానిమేటర్‌కు సంబంధించిన గొడవలో పోలీ్‌సస్టేషనలో ఉన్న నన్ను డీఎస్పీ చైతన్య లాఠీతో ఇష్టానుసారంగా కొట్టారు. ఆ దెబ్బలకు నా చేతులు, కాళ్లకు వాపులు వచ్చాయి. రక్తగాయాలు అయ్యాయి. దీనిపై ప్రైవేట్‌ కేసు వేశాం. మాకు న్యాయం జరగాలి.

- రామాంజనేయులు, యానిమేటర్‌, కోనుప్పలపాడు


విచారించకుండా చితకబాదారు..

యానిమేటర్‌ నియామకంపై గ్రామంలో గొడవ జరిగింది. యాడికి పోలీ్‌సస్టేషనలో ఉన్న మమ్మల్ని విచారించకుండానే డీఎస్పీ చైతన్య నానా దుర్భాషలాడారు. ఇష్టానుసారంగా చితకబాదారు. నా చేతుల వేళ్లకు వాపులు వచ్చాయి. టీడీపీ వర్గీయులమనే మాపైన ఇంత కక్ష కట్టారు. అవతలి వర్గంపై ఫిర్యాదు చేసినా పోలీసులు తీసుకోలేదు. 

- నాగార్జున, కోనుప్పలపాడు 


చేతివేళ్లు విరిగాయి...

నాపై ఇంతవరకు ఒక్క కేసు కూడా లేదు. యానిమేటర్‌ విషయంలో జరిగిన గొడవలో పోలీస్‌స్టేషనకు తీసుకు వెళ్లారు. అక్కడ నన్ను డీఎస్పీ తీవ్రంగా కొట్టాడు. నా రెండు చేతుల వేళ్లు విరిగాయి. హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందాను. గొడవ గురించి విచారించకుండానే డీఎస్పీ ఇష్టానుసారం కొట్టడం అన్యాయం. డీఎస్పీపై ప్రైవేట్‌ ఫిర్యాదు చేశాం. నాకు న్యాయం కావాలి. డీఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. 

- రాజు, కోనుప్పలపాడు


లాఠీతో కుళ్లబొడిచాడు

కోనుప్పలపాడు గొడవ విషయంలో పోలీస్‌స్టేషనలో ఉన్న మమ్మల్ని డీఎస్పీ చైతన్య ఇష్టానుసారంగా చితకబాదారు. చేతి వేళ్లు బండపై పెట్టించి ఫైబర్‌ లాఠీతో కుళ్లబొడిచాడు. దీంతో చేతి వేళ్లు విరిగాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాను. డీఎస్పీపై ప్రైవేట్‌ కేసు వేశాం. మమ్మల్ని ఇష్టానుసారం కొట్టె డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి.

- సింహాద్రి, కోనుప్పలపాడు


Read more