టీచర్లకు సర్దు ‘పోటు’

ABN , First Publish Date - 2022-12-13T00:09:41+05:30 IST

అయిన వారిని అక్కడే ఉంచారు. కానివారిని కిలోమీటర్ల దూరానికి సర్దుబాటు చేశారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని సైతం సరిహద్దు మండలాలు, డివిజన్‌ సరిహద్దులకు తోసేశారు

టీచర్లకు సర్దు ‘పోటు’
జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం

పలు మండలాల్లో సీనియర్లను దూరంగా సర్దుబాటు

15 నెలలు, 17 నెలల్లో రిటైర్‌ అయ్యే వారికి బహుమానం!

కొందరు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల అత్యుత్సాహం

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

అనంతపురం విద్య, డిసెంబరు 12: అయిన వారిని అక్కడే ఉంచారు. కానివారిని కిలోమీటర్ల దూరానికి సర్దుబాటు చేశారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని సైతం సరిహద్దు మండలాలు, డివిజన్‌ సరిహద్దులకు తోసేశారు. కొన్ని స్కూళ్లలో మిగులు (సర్‌ప్లస్‌) టీచర్లు ఉన్నా అక్కడికే అదనంగా టీచర్లను కేటాయించారు. ఉపాధ్యాయుల సర్దుబాటులో కొందరు డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు తమకు బాగా అయినోళ్లను బాగానే సర్దుబాటు చేసుకున్నారని సమాచారం. ఉన్నతాధికా రులు ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు తావిస్తోంది.

సీనియర్లే కంటే జూనియర్లే ముద్దు...

పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్యపై అనేక ఫిర్యాదులు రావడంతోపాటు పిల్లలకు సిలబస్‌ పూర్తి చేసే విషయంలో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఇటీవల టీచర్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టారు. అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లకు సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేసేందుకు సుమారు 10 రోజుల కిందట శ్రీకారం చుట్టారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలకు ఈ బాధ్యతలు అప్పగించారు. మిగులు టీచర్లు ఉన్న స్కూళ్ల నుంచి సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లకు వర్క్‌ అడ్జె్‌స్టమెంట్‌ చేయడంతోపాటు, అర్హులైన ఎస్‌జీటీలను సైతం సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే చాలా స్కూళ్లలో జూనియర్లను సర్దుబాటులో కదిలించాల్సి ఉండగా, వారిని కాదని సీనియర్లను కదిలించారు. ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో చాలా మంది టీచర్లు సర్వీసును కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు 6 నెలలు, మరికొందరు 8 నెలలు ఇలా పూర్తి చేసుకున్నారు. మరో 14 నెలలు, 15 నెలలు, 17 నెలలు సమయంలోగా వారి సర్వీస్‌ కూడా పూర్తయ్యి....రిటైర్డ్‌ కావాల్సిన వారున్నారు. అయితే అలాంటి టీచర్లను, కేన్సర్‌, డయాబెటిస్‌, హృద్రోగులు వంటి వారిని సైతం సర్దుబాటులో భాగంగా దూర ప్రాంతాలకు పంపారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే జూనియర్లను మాత్రం అక్కడే ఉంచారన్న విమర్శలు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలపై వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 270 మందిని, శ్రీసత్య సాయి జిల్లాలో 448 మంది టీచర్లను సర్దుబాటు చేస్తే అధికారులు చేతివాటం ప్రదర్శించి, ఇష్టారాజ్యంగా వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా.. సర్దుబాటు..!

అనంతపురం నగరంలోని పలు స్కూళ్లకు టీచర్ల సర్దుబాటుపై అనేక విమర్శలు వస్తున్నాయి. మరో ఏడాదిన్నరలో రిటైర్‌ అయ్యే వారిని కూడా కదిలించి, జూనియర్లను అలాగే ఉంచారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని స్కూళ్లకు అవసరం లేకున్నా...టీచర్లకు సర్దుబాటు చేశారు. గుత్తి రోడ్డు సర్కిల్‌లోని ఎన్వీఆర్‌ స్కూల్‌కు అదనంగా ఒక ఎస్‌జీటీని నియమించారు. రాంనగర్‌లోని మదర్‌ థెరీసా స్కూల్‌కు సైతం అదనంగా మరొక ఎస్‌జీటీని నియమించారు. ఆయా స్కూళ్లకు అవసరం లేకున్నా అదనంగా టీచర్లను సర్దుబాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అరవింద్‌నగర్‌లోని ఎస్కేడీ స్కూల్‌లో జూనియర్లను అలాగే ఉంచి సీనియర్‌ అయిన నసీబాభానూ అనే టీచర్‌ను మరో స్కూల్‌కు సర్దుబాటు చేశారు. మొరార్జీ స్కూల్‌లో సైతం జూనియర్లను కాదని లావణ్య అనే సీనియర్‌ టీచర్‌ను కదిలించారన్న విమర్శలు వస్తున్నాయి. గుత్తి, అనంతపురం డివిజన్లలో సైతం కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్దుబాటు అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:09:42+05:30 IST