ఇదేం బ్యాంక్‌రా బాబోయ్‌..!

ABN , First Publish Date - 2022-05-18T06:20:44+05:30 IST

రైతుల రుణాల రెన్యూవల్‌ విషయంలో కణేకల్లులోని యూనియన బ్యాంకు రూటే సెపరేట్‌. పలు బ్యాంకుల్లో కేవలం వడ్డీను మాత్రమే కట్టించుకుని సులభ పద్ధతిలో రుణాలను రెన్యూవల్‌ చేస్తున్నారు.

ఇదేం బ్యాంక్‌రా బాబోయ్‌..!
కణేకల్లులోని యూనియన బ్యాంకు

పలు బ్యాంకుల్లో వడ్డీ చెల్లింపుతో రుణాల రెన్యువల్‌

‘యూనియన’లో మాత్రం వడ్డీతో సహా అసలూ చెల్లించాల్సిందే

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు 


కణేకల్లు, మే 17 : రైతుల రుణాల రెన్యూవల్‌ విషయంలో కణేకల్లులోని యూనియన బ్యాంకు రూటే సెపరేట్‌.  పలు బ్యాంకుల్లో కేవలం వడ్డీను మాత్రమే కట్టించుకుని సులభ పద్ధతిలో రుణాలను రెన్యూవల్‌ చేస్తున్నారు. అయితే కణేకల్లులోని యూనియన బ్యాంకులో మాత్రం వడ్డీతో సహా అసలు చెల్లించి రుణాలు రెన్యూవల్‌ చేసుకోవాల్సిందేనని ఖరాకండిగా తెల్చిచెబుతుండటంతో రైతులు పడరాని పాటు పడుతున్నారు. అంతేకాకుండా ప్రతి రైతుకు ఖచ్చితంగా చెక్‌బుక్‌ కూడా ఉండాలని నిబం ధన  పెడుతున్నారు.  కేవలం ఈ బ్యాంకులో మాత్రమే ఇలాంటి నిబంధనలు ఉండటంతో దాదాపు నెల రోజుల నుంచి రైతన్నలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

దళారుల రంగప్రవేశం  :  ఇదే అదునుగా   పలువురు దళారులు రంగప్రవేశం చేశారు. రైతులకు అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సొమ్ము చేసుకొంటున్నారు. రూ. లక్షకు రూ.2 వేలు ప్రకారం దళారులు వడ్డీ వసూలు చేస్తున్నారు. 


Read more