నిరీక్షణ

ABN , First Publish Date - 2022-10-04T04:22:08+05:30 IST

‘ఉచితంగా బోర్లు తవ్విస్తాం. విద్యుత కనెక్షన, పంపుసెట్లను కూడా ఉచితంగా ఇస్తాం.

నిరీక్షణ
అనంతపురం జిల్లా డ్వామా కార్యాలయం

-ముందుకు సాగని జలకళ

-51 వేల దరఖాస్తులు పెండింగ్‌

-తవ్విన బోర్లకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం

-డీజిల్‌ ధరలు పెరగడంతో కదలని కాంట్రాక్టర్లు

-పాత ధరలకు తవ్వితే నష్టపోతామని ఆవేదన


 అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 3: ‘ఉచితంగా బోర్లు తవ్విస్తాం. విద్యుత కనెక్షన, పంపుసెట్లను కూడా ఉచితంగా ఇస్తాం. వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా రైతులందరినీ ఆదుకుంటాం..’ అని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పారు. అధికారం చేపట్టి మూడేళ్లు గడిచింది. చాలామంది రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. ఉమ్మడి జిల్లాలో 51 వేల మందికి పైగా రైతులు దరఖాస్తు చేసి, నిరీక్షిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల  సిఫారసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, ఎంపిక చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.


అధికార పార్టీ వారికే..?


  ప్రతి క్లస్టర్‌ నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. దీంతో బోర్లు వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొందరికి బోర్లు మంజూరు చేసినా, తవ్వడం లేదు. బోర్లను తవ్వే యంత్రాలు తగినన్ని జిల్లాలో అందుబాటులో లేవు. పైగా తవ్విన బోర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రైతులు డ్వామా అధికారులు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లాలో దరఖాస్తుదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికారపార్టీకి అనుకూలంగా ఉండే వారికే బోరుబావుల మంజూరు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బోర్లు తవ్వేందుకు మొదట జియాలజిస్టు నివేదిక తప్పనిసరి. నివేదిక ఆధారంగా బోర్లు మంజూరు చేస్తున్నారు. 


51 వేలకుపైగా..


ఉమ్మడి జిల్లాలో 51 వేలకు పైగా రైతులు జలకళ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6900 మందికి బోర్లు మంజూరు చేశారు. 2,712 మందికి బోర్లు తవ్వారు. 51,603 మంది ఎదురు చూస్తున్నారు. అనంతపురం నియోజకవర్గంలో 18 మంది, ధర్మవరం 4,738, గుంతకల్లు 3,414,  హిందూపురం 878, కదిరి 1,694, కళ్యాణదుర్గం 8,183, మడకశిర 622, పెనుకొండ 1,979, పుట్టపర్తి  6,792, రాప్తాడు 11,162, రాయదుర్గం 3,098, తాడిపత్రి 1,371, ఉరవకొండ 4,834మంది, శింగనమల 2,820 మంది రైతులు జలకళ కోసం ఎరుచూస్తున్నారు. పథకం ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి. 


డీజిల్‌ ధర పెరిగి..


  వైఎస్సార్‌ జలకళ బిల్లులు చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంది. మూడు నెలలుగా బోర్లు వేయడం లేదు. డీజిల్‌ ధరలు పెరిగిన కారనంగా కాంట్రాక్టర్లు బోర్లను తవ్వేందుకు ముందుకు రావడం లేదు. గిట్టుబాటు కాదని వెనకడుగువేస్తున్నారు. 2020లో ఒప్పందం సమయంలో లీటరు డీజిల్‌ ధర రూ.70 ఉండేది. అప్పుడు బోరు వేసేందుకు అడుగుకు కనిష్ఠంగా రూ.112, గరిష్ఠంగా రూ.145 చెల్లించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.100 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో పాత ధరకు బోర్లు వేస్తే తీవ్రంగా నష్టపోతామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 


అర్హులను గుర్తిస్తున్నాం..  : వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ


  వైఎస్సార్‌ జలకళ పథకం అమలులో కొంత జాప్యం వాస్తవమే. దరఖాస్తు చేసుకున్న రైతుల సీనియార్టీ ప్రకారం నియోజకవర్గాలు, క్లస్టర్ల వారిగా గుర్తిస్తున్నాం. ప్రతిపాదనలు బిల్లులను మళ్లీ సిద్ధం చేయాలని సూచించాం. వాటి ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయి. జియాలజిస్టు ఇచ్చిన నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి బోర్లు తవ్వించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. 


Updated Date - 2022-10-04T04:22:08+05:30 IST