ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థుల వేదన

ABN , First Publish Date - 2022-07-14T06:47:20+05:30 IST

ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు పెట్టే భోజనంపై బేరసారాలు జరిగాయి. వేలాది మంది మేధావులను దేశానికి అందించిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో.. ‘సార్‌.. భోజనం పెట్టించండి..’ అని అధికారులను, ప్రజా ప్రతినిధులను విద్యార్థులు నోరు తెరిచి అడగాల్సిన దుస్థితి

ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థుల వేదన
విద్యార్థులతో చర్చిస్తున్న ఎంపీ రంగయ్య, ఆర్ట్స్‌ కాలేజీ యాజమాన్యం

సార్‌..బువ్వ పెట్టించండి

ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థుల వేదన

కొవిడ్‌తో రెండేళ్లుగా హాస్టల్‌ మూసివేత

పునఃప్రారంభానికి ఒప్పుకోని యాజమాన్యం

జగనన్న వసతి దీవెన తెచ్చిన తంటా 

ఎంపీ, అదనపు ప్రిన్సిపాల్‌ సమక్షంలో బేరం

అనంతపురం సెంట్రల్‌, జూలై 13: ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు పెట్టే భోజనంపై బేరసారాలు జరిగాయి. వేలాది మంది మేధావులను దేశానికి అందించిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో.. ‘సార్‌.. భోజనం పెట్టించండి..’ అని అధికారులను, ప్రజా ప్రతినిధులను విద్యార్థులు నోరు తెరిచి అడగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంపీ తలారి రంగయ్య,  అదనపు ప్రిన్సిపాల్‌ మక్బూల్‌ హుస్సేన సమక్షంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు హాస్టల్‌ పునఃప్రారంభం కోసం జరిపిన చర్చలు ఫలించలేదు. మరోమారు గురువారం చర్చించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరంలో డిగ్రీ చదివేందుకు వచ్చే విద్యార్థులకు గతంలో హాస్టల్‌నే ఏర్పాటు చేశారు. భోజనం ఖర్చుల కోసం ఏటా స్కాలర్‌షిప్‌ రూపంలో ప్రభుత్వం కాలేజీ ఖాతాలో సొమ్ము జమ చేసేది. ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో ఏటా సుమారు రెండువేల మంది విద్యార్థులు వసతి పొందేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. స్కాలర్‌షిప్‌ పేరును వసతి దీవెనగా మార్చింది. దీంతోపాటు సొమ్మును కాలేజీ ఖాతాలో కాకుండా, విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేయడం ప్రారంభించింది. దీంతో కాలేజీ యాజమాన్యానికి హాస్టల్‌ నిర్వహణ భారంగా మారింది. కొవిడ్‌ కారణంగా 2020 నుంచి హాస్టల్‌ను మూసేశారు. తిరిగి ప్రారంభించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థి నాయకులు సమస్యను ఎంపీ తలారి రంగయ్య దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థులతో కలిసి కాలేజీ యాజమాన్యంతో ఎంపీ చర్చించారు.


బేరసారాలు..

ఒక్కో విద్యార్థి రూ.12 వేలు డిపాజిట్‌ చేస్తేనే హాస్టల్‌ను పునఃప్రారంభిస్తామని కాలేజీ యాజమాన్యం బుధవారం జరిగిన చర్చల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రైవేట్‌ హాస్టల్స్‌లో నెలకు ఎంత చెల్లిస్తున్నారు, ఎన్నిపూటల భోజనం పెడుతున్నారు, ఎన్నిరకాల ఐటమ్స్‌ పెడుతున్నారు అని విద్యార్థులను ఎంపీ అడిగారు. అనంతరం హాస్టల్‌ డిపాజిట్‌ రూ.6 వేలు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యానికి సూచించారు. కానీ రూ.10 వేలైనా కట్టాల్సిందే అని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో సమస్య ఎటూ తేలలేదు. ఇస్కాన ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో నెల రోజులు భోజన సదుపాయం ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు ఎంపీ హామీ ఇచ్చారు. డిపాజిట్‌ అంశంపై గురువారం మరోసారి సమీక్షిస్తామని ఎంపీ తెలిపారు. చర్చల్లో ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ ఆలం, నిరుద్యోగ ఐక్యవేదిక నాయకులు టీపీ రామన్న, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు పరమేష్‌, విద్యార్థులు, కళాశాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-14T06:47:20+05:30 IST