బీపీ మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చడం సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-10-01T05:46:33+05:30 IST

బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు.

బీపీ మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చడం సిగ్గుచేటు
రాస్తారోకో చేస్తున్న బీకే, టీడీపీ బీసీ సెల్‌ నాయకులు

బీసీలను అగౌరవపరిస్తే పుట్టగతులుండవ్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి


పెనుకొండ, సెప్టెంబరు 30: బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. బీసీలను అగౌరవ పరిచే వారికి పుట్టగతులుండవన్నారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బీపీ మండల్‌ విగ్రహ దిమ్మెను మునిసిపల్‌ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీకే ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పట్టణంలో నిరసనకు దిగారు. తొలుత ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ బీపీ మండల్‌ జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారానికే శ్రమపడ్డారన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు, పదవులను ఆశించని ధీరుడన్నారు. అలాంటి మహనీయుడి విగ్రహ దిమ్మెను ప్రభుత్వం కూల్చివేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జగనరెడ్డి  తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటుచేసి రాజకీయం చేశారన్నారు. దేశంలో సుమారు 56శాతం జనాభా, 65కోట్లమంది జీవితాల్లో వెలుగులు నింపిన మండల్‌ విగ్రహ ఏర్పాటుపై కక్ష సాధింపులకు దిగడం సిగ్గుచేటన్నారు. తక్షణమే మండల్‌ విగ్రహ దిమ్మెను పునరుద్ధరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మండల్‌ విగ్రహాలను ఏర్పాటుచేసి, ఆయనకు ఘననివాళులు అర్పించి, జగనరెడ్డి అహంకారానికి సమాధి కడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, కురుబ, వడ్డెర, కుమ్మర సాధికారిక కమిటీల అధ్యక్షులు గంగులకుంట రమణ, వడ్డె వెంకట్‌, కుమ్మర పోతులయ్య, బీసీ సాధికార సమితి నాయకుడు గిరిధర్‌ గౌడ్‌, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి గుట్టూరు చిన్న వెంకటరాముడు, బీసీ నాయకులు రాజగోపాల్‌, మాజీ సర్పంచ అశ్వత్థప్ప, యల్లప్ప, వీరన్న, కేశవయ్య, వీజీపాళ్యం శీనా, గుట్టూరు నాగరాజు, బోయాదిశేషు, రామలింగ, లక్ష్మీనారాయణరెడ్డి, పోతిరెడ్డి, సర్పంచ శ్రీనివాసులు, త్రివేంద్రనాయుడు, రమే్‌షనాయుడు, బాబుల్‌రెడ్డి, వడ్డినాగప్ప, కన్వీనర్లు సిద్దయ్య, నరహరి, రవిశంకర్‌, రఘువీర చౌదరి, గాయత్రి, అనసూయమ్మ, మైనార్టీసెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి హుజురుల్లా ఖాన తదితరులు    పాల్గొన్నారు.



Updated Date - 2022-10-01T05:46:33+05:30 IST