అంగనవాడీలు, స్కూల్స్‌కు ఎండీయూ ద్వారా సరుకులు

ABN , First Publish Date - 2022-10-03T05:59:24+05:30 IST

ప్పటి వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు.

అంగనవాడీలు, స్కూల్స్‌కు ఎండీయూ ద్వారా సరుకులు
సరుకుల సరఫరాపై సమీక్షిస్తున్న జేసీ కేతనగార్గ్‌

ఈనెల నుంచే అమలుకు శ్రీకారం

సక్రమంగా అందించేరా..?

అనంతపురం టౌన అక్టోబరు 2: ఇప్పటి వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. అంగనవాడీలు, పాఠశాలలకు వచ్చే బియ్యం ఇతర సరుకులు డీలర్ల ద్వారా తీసుకొని వెళ్ళాల్సి ఉండేది. అంగనవాడీ కార్యకర్తలు, పాఠశాలల హెచఎంలు ఈ బాధ్యతలు తీసుకొనేవారు. ఆ సమయంలో వీరు సరుకులు స్కూల్స్‌కు చేర్చేందుకు రెండుమూడు సార్లు డీలర్ల వద్దకు తిరిగేవారు. ఆ మూటలు తీసుకెళ్ళేందుకు ఇబ్బందులు పడేవారు. అయితే ఇక నుంచి అంగనవాడీలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం, సరుకులు కూడా ఎండీయూ వాహనాలు ద్వారా నేరుగా అందజేయనున్నారు. ఈ నెల నుంచే ఆ ప్రక్రియ ప్రారంభిం చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు అంగనవాడీ కేంద్రాలకు ఎండీయూ వాహనాల ద్వారానే బియ్యం, సరుకులు అందజేయనున్నారు. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్ల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 


సమస్య తీరేనా...

పాఠశాలలు, అంగనవాడీలకు నేరుగా ఎండీయూ వాహనాలు సరుకులు పంపిణీతో సమస్య తీరుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇంటింటికి రేషన పథకంను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రత్యేక ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వాహనాలు సక్రమంగా ఇళ్ల వద్దకు వెళ్ళి సరుకులు అందజేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట అది ఒకటి, రెండు రోజులు తిరిగి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయినా వాహనాలు తిరిగినట్లు చూపించి నెలనెల బిల్లులు దండుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, అంగనవాడీ కేంద్రాలకు సక్రమంగా సరుకులు పంపిణీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సరఫరా చేసినా తూకాలు సక్రమంగా ఇస్తారా అనేది కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అంగనవాడీలు, పాఠశాలలకు నేరుగా ఇక నుంచి బియ్యం సరుకులు సరఫరా కానున్నాయి. 


పక్కాగా అమలుకు ఆదేశాలు...

అంగనవాడీలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం, సరుకులు నేరుగా ఎండీయూ వాహనాల ద్వారానే ఈ నెల నుంచే సరఫరా చేయనున్నారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశాం. డీలర్లు, ఎండీ యూ వాహనదారులు సమన్వయంతో పనిచేయాలని సూచిం చాం. తూకాలు తేడా వస్తే చర్యలు తీసుకుంటాం. 

- కేతనగార్గ్‌,  జాయింట్‌ కలెక్టర్‌Read more