పప్పుశనగ రైతుకు సబ్సిడీ కుదింపు

ABN , First Publish Date - 2022-10-08T05:35:04+05:30 IST

సబ్సిడీ ధర తగ్గించి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పప్పుశనగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 30 శాతం సబ్సిడీ ధర వర్తింపజేశారు. గత ఏడాది నుంచి సబ్సిడీని 25 శాతానికి కుదించారు. ఈ సారి అంతే సబ్సిడీని వర్తింపజేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

పప్పుశనగ రైతుకు సబ్సిడీ కుదింపు


రెండేళ్ల కిందట 30 శాతం, ఇప్పుడు 25 శాతానికి తగ్గింపు 

ప్రభుత్వ విత్తనానికి.. బయటకి పెద్దగా తేడా లేనివైనం 

సబ్సిడీ, విత్తనాలు పెంచాలంటున్న నల్లరేగడి రైతులు   

 అనంతపురం అర్బన, అక్టోబరు 7: సబ్సిడీ ధర తగ్గించి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పప్పుశనగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 30 శాతం సబ్సిడీ ధర వర్తింపజేశారు. గత ఏడాది నుంచి సబ్సిడీని 25 శాతానికి కుదించారు. ఈ సారి అంతే సబ్సిడీని వర్తింపజేయడంతో రైతులు ఆవేదన  చెందుతున్నారు. అలాగే సబ్సిడీ విత్తనం ధరకు బహిరంగ మార్కెట్‌లో పప్పుశనగ ధరకు పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం. తాడిపత్రి ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌ పప్పుశనగ రూ.4900 నుంచి రూ.5వేలు, బెళుగుప్ప ప్రాంతంలో క్వింటాల్‌ రూ.5వేలు పలుకుతోంది. అప్పుగా క్వింటాల్‌ పప్పుశనగ ధర రూ.5200 నుంచి రూ.5300 దాకా విక్రయిస్తున్నారు. పంట పండించిన తర్వాత ఆ మొత్తాన్ని పట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చే విధంగా రైతులతో వ్యాపారులు ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ధర కుదించడంతో  ఎక్కువ శాతం రైతులు బహిరంగ మార్కెట్‌లో విత్తన పప్పుశనగ కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. హెక్టారులోపు పొలమున్న రైతులు మాత్రమే సబ్సిడీ విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రైతులు కూడా రెండున్నర ఎకరాల పొలంలో విత్తనం వేయాలంటే బహిరంగ మార్కెట్‌లో అదనంగా విత్తనం కొనుగోలు చేయాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు నల్లరేగడి భూముల్లో  పప్పుశనగ విత్తనం వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పలు  ప్రాంతాల్లో  ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో విత్తనం కొనుగోలు చేయగా, మరికొందరు సబ్సిడీ విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు.

సబ్సిడీ కుదింపుతో అన్యాయం 

ఈ ఏడాది రబీ సీజనకు సంబంధించి పప్పుశనగ క్వింటాల్‌ పూర్తి ధర రూ.6456లుగా నిర్ణయించారు. ఇందులో 25 శాతం సబ్సిడీ రూ.1614పోను రైతు వాటా కింద క్వింటాల్‌కు రూ.4842 చెల్లించాలి. రెండేళ్ల క్రితం 30 శాతం సబ్సిడీ వర్తింపజేశారు. గత ప్రభుత్వాల హయాంలో 40 శాతం నుంచి 50 శాతం దాకా సబ్సిడీని వర్తింపజేస్తూ రైతుకు ఆసరాగా నిలుస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీ ధరను తగ్గించడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు.  

ఎకరాకు 25 కేజీలు.. ఐదెకరాల వరకే పరిమితి  

పొలం విస్తీర్ణం ఆధారంగా రైతులకు సరిపడా పప్పుశనగ విత్తనం పంపిణీ చేయడంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఈఏడాది రబీ సీజనకు  సంబంధించి జిల్లాకు 40వేల క్వింటాళ్ల పప్పుశనగ కేటాయించారు. ఎకరాకు ఒక బస్తా (25 కేజీలు) చొప్పున పప్పుశనగ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఐదెకరాల దాకా పరిమితి విధించారు. అంతకంటేఎక్కువ భూమి ఉన్నా ఐదు బస్తాలు మాత్రమే పంపిణీ చేస్తారు. నల్లరేగడి భూముల్లో ఎకరాకు 40 కేజీలకుపైగానే విత్తనం విత్తుతున్నారు. పంట సాగు కాలంలో తెగుళ్ల బెడద, ఇతర కారణాలతో కొంత శనగ పంట దెబ్బతిన్నా మిగతా పైరుతో గట్టెక్కొచ్చన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. రెండెకరాల పొలమున్న రైతుకు 80 కేజీలకుపైగా విత్తనం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిబంధనల పేరుతో 50 కేజీలు మాత్రమే పంపిణీ చేస్తోంది. దీంతో మిగతా విత్తనాన్ని బహిరంగ మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేయాల్సిందే. 

Read more