ప్రతి పనికీ ఓ రేటు..!

ABN , First Publish Date - 2022-06-07T06:11:50+05:30 IST

ధర్మవరం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వెళ్లి తమ ఆస్తులను రిజిస్ట్రేషన చేసుకుకోవాలంటే జనం బెంబేలెత్తుతున్నారు.

ప్రతి పనికీ ఓ రేటు..!

ధర్మవరం సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అవినీతి దందా

డబ్బు ముడితే ప్రభుత్వ భూములనూ 

రిజిసే్ట్రషన చేస్తున్న వైనం..

544, 494, 602 సర్వే నెంబర్లలో 

భారీగా అక్రమాలు

రిటైర్డ్‌ ఉద్యోగి ద్వారా వసూళ్లు

ధర్మవరం 

ధర్మవరం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వెళ్లి తమ ఆస్తులను రిజిస్ట్రేషన చేసుకుకోవాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. ప్రతి పనికీ అక్కడ కాసులు ఇవ్వాల్సి రావడమే అందుకు కారణం. అక్కడ పనిచేసే ఓ అధికారి అవినీతి అంతా.. ఇంతా కాదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో ప్రతి పనికీ రేటు పెట్టి, దర్జాగా వసూలు చేస్తున్నారన్న వాదనలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను సైతం వదలట్లేదు. 30 నుంచి 40 ఏళ్లుగా రిజిస్ట్రేషనకు నోచుకోని సర్వే నెంబర్లలోని భూములు సైతం చకచకా రిజిస్ట్రేషన అవుతున్నాయి. సెంటుకు రూ.5 వేల నుంచి రూ.10వేల దాకా, ఎకరాకి రూ.50 వేల నుంచి రూ.లక్షదాకా వసూలు చేస్తూ అవినీతి తిమింగలంగా మారిపోయారన్న విమర్శలు ఆ శాఖ వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఇది కాకుండా ప్రతి రిజిస్ట్రేషనకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలదాకా రైటర్ల ద్వారా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం కాగానే అక్కడే పనిచేస్తున్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ద్వారా రిజిస్ట్రేషన పత్రాల ఆధారంగా వసూలు చేసి, ఆయా అధికారికి ముట్టబెప్పుతున్నారు. రోజూ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలదాకా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.కోటిదాకా ఆయన జేబులోకి చేరుతున్నాయన్నది సుస్పష్టం.


మూడింతలు  అదనం

ప్రతి రిజిస్ట్రేషనకు దాని ఫీజు బేరీజు వేసుకుంటే మూడింతలు అదనంగా వసూలు చేస్తూ సామాన్య ప్రజానీకం జేబులకు చిల్లు పెడుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. రిజిస్ట్రేషన ఫీజు రూ.50వేలు ఉంటే.. అందుకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో కొందరైతే రిజిస్ట్రేషన చేయించుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే వారి రిజిస్ట్రేషన్లపై కాలయాపన తప్పదు. అది కావాలి.. ఇది కావాలంటూ.. వారిని ఇబ్బందులు పెడుతుండడంతో చేసేదిలేక అడిగినంత ఇచ్చుకుని, పని చేయించుకు వెళ్లాల్సి వస్తోంది.


డబ్బులిస్తే... ప్రభుత్వ భూములైనా..

ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన చేయరాదన్నది నిబంధన. వాటిని తుంగలో తొక్కుతూ విచ్చలవిడిగా రిజస్ట్రేషన్లు చేస్తూ భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ధర్మవరం పట్టణంలో రాజేంద్రనగర్‌, దుర్గానగర్‌, మారుతీనగర్‌, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లోని 544, 494, 602 సర్వే నెంబర్లలో పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ కోట్లాది రుపాయల అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆ సర్వే నెంబర్లలో దాదాపు 2 ఎకరాల్లో సెంట్ల లెక్కన రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేనెంబర్ల ద్వారా రూ.3 కోట్లకుపైగా వసూళ్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచినట్లు తెలుస్తోంది.


ఈసీ కావాలన్నా... కాసు ఇవ్వాల్సిందే..

ధర్మవరం సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు కట్టి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. దీనిపై పై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి ప్రశ్నించకపోవడం వెనుక భారీగా ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి రిజిస్ట్రేషనకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు అందజేసే బాధ్యతను రైటర్లపై ఉంచడం, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక వ్యక్తులను నియమించుకుని, వారి ద్వారా భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ద్వారా సెంటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు, ఎకరాకి రూ.50వేల నుంచి రూ.లక్షదాకా వసూలు చేస్తూ పేదల జేబులు గుల్ల చేస్తున్నారని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. నకలు, ఈసీలు పొందాలన్నా.. మామూళ్లు ముట్టజెప్పాల్సిందేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


రిటైర్డ్‌ ఉద్యోగి ద్వారా..

రిజిస్ట్రేషన కార్యాలయంలో అక్రమ వసూళ్ల వెనుక అదే కార్యాలయంలో పనిచేసి రిటైరైన ఉద్యోగి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కాగానే లిస్టు పట్టుకుని, ఒక్కో రైటర్‌ ఎన్నెన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన చేశారో వివరిస్తూ ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన చేస్తే సెంటుకు రూ.5వేల నుంచి రూ.10వేలదాకా, గృహాలకు రూ.10వేల నుంచి రూ.20వేలదాకా వసూలు చేసి, ఆ మొత్తాన్ని అధికారికి ముట్టజెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలదాకా అక్రమంగా సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తమ అవినీతి బయటకు పొక్కకుండా అక్కడ పనిచేసే సిబ్బందికి రూ.12 వేల నుంచి రూ.15 వేలదాకా ఇస్తున్నట్లు తెలుస్తోంది. పైఅధికారులకు పర్సెంటేజీ ప్రకారం స్థానిక  ప్రజాప్రతినిధులకు కూడా ఒక్కో రిజిస్ట్రేషన లెక్కన ముట్టజెబుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందరికీ తాయిలాలు వేసినా.. ఇంకా రోజుకు ఆ అధికారి జేబులోకి రూ.2 లక్షలుపైనే చేరుతున్నట్లు తెలుస్తోంది.


విచారించి, చర్యలు తీసుకుంటాం

ధర్మవరం సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి. వీటిపై విచారణ చేపడతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

మాధవి, డీఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ


Updated Date - 2022-06-07T06:11:50+05:30 IST