అటకెక్కిన అభివృద్ధి

ABN , First Publish Date - 2022-11-30T23:57:33+05:30 IST

అధికారుల అలసత్వంతో జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల అభివృద్ధి అటకెక్కింది. చాలా మంది అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. సొంత లాభం తప్ప మార్కెట్‌ కమిటీ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆయా వర్గాల నుంచే వినిపిస్తోంది.

అటకెక్కిన అభివృద్ధి
మార్కెటింగ్‌ శాఖ ఏడీ కార్యాలయం

మార్కెట్‌ కమిటీల అభివృద్ధిపై దృష్టేదీ..?

ఫీజు వసూళ్లలో వెనుకబాటు

నిర్లక్ష్య ధోరణిలో సంబంధిత అధికారులు

రూ.10కోట్లకుగాను.. రూ.5కోట్లు వసూలు

అనంతపురం రూరల్‌, నవంబరు 30: అధికారుల అలసత్వంతో జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల అభివృద్ధి అటకెక్కింది. చాలా మంది అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. సొంత లాభం తప్ప మార్కెట్‌ కమిటీ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆయా వర్గాల నుంచే వినిపిస్తోంది. ఫలితంగా మార్కెట్‌ ఫీజుల వసూలు దారుణంగా పడిపోయింది. గడిచిన ఎనిమిది నెలల్లో రాబట్టిన మార్కెట్‌ ఫీజు వసూళ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మార్కెట్‌ కమిటీల నుంచి రూ.5కోట్లు మాత్రమే వసూలు చేశారు.

లక్ష్యం ఘనం.. వసూళ్లే దారుణం

జిల్లాలో అనంతపురం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాప్తాడు, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ మార్కెట్‌ కమిటీలున్నాయి. వీటి ఆదాయ వనరులను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఉన్నతాధికారులు రూ.10.43 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.5.4కోట్లు వసూలు చేశారు. ఇందులో అనంతపురం, రాప్తాడు, శింగనమల కమిటీలు వసూళ్ల పరంగా బాగానే ఉన్నాయి. ఈ కమిటీలు ఇప్పటికే 50శాతంకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఆ తరువాత తాడిపత్రి పర్వాలేదనిపించినా.. మిగిలిన కమిటీల పరిస్థితి దారుణంగా ఉంది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి మార్కెట్‌ కమిటీలు ఫీజు వసూళ్లలో అధ్వానంగా ఉన్నాయి. 30శాతం కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. గుంతకల్లు మార్కెట్‌ కమిటీ 15.60శాతంతో అట్టడుగు స్థానంలో ఉంది.

దృష్టి సారించని పాలకవర్గం..

మార్కెట్‌ల అభివృద్ధి పట్ల పాలకవర్గ సభ్యులు దృష్టి సారించడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాల కమిటీల పాలనా కాలం ముగిపోయింది. పాలక వర్గ సభ్యులు పాలన సమయంలో మార్కెట్‌ అభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపలేదని ఆయా వర్గాల సభ్యులే చెప్పు కొస్తున్నారు. ఆ పాలక వర్గ సభ్యులు కేవలం పదవులకే పరిమితమయ్యా రన్న విమర్శలున్నాయి. ఇటీవల మార్కెట్‌ యార్డులకు రిజ్వరేషన్లు ఖరారు అయ్యాయి. ఈక్రమంలోనే రెండు కమిటీలకు కొత్త పాలక వర్గ సభ్యుల నియామకం పూర్తి అయింది. త్వరలో మిగిలిన కమిటీలకు కొత్త పాలక వర్గ సభ్యుల నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పాలక వర్గ సభ్యుల రాకతోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందా..లేకపోతే పాత పాలక వర్గ సభ్యుల మాదిరిగానే ఉండిపోతారో వేచిచూడాలంటున్నారు.

Updated Date - 2022-11-30T23:57:33+05:30 IST

Read more