కొడుకా.. కోటీశ్వరుడా!

ABN , First Publish Date - 2022-11-25T00:26:56+05:30 IST

ఆర్టీసీ డిపోలో హైడ్రామా నడిచింది. 15 వేల లీటర్ల డీజిల్‌ను తెచ్చిన ఓ ట్యాంకర్‌ను బుధవారం రాత్రి కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు పట్టుకున్నారు. బిల్లులు చూపకపోవడంతో ఏకంగా 12 గంటలపాటు నిలిపేశారు. ఆ తరువాత ఏం జరిగిందోగాని, గురువారం వదిలిపెట్టారు. కర్ణాటక నుంచి తెచ్చిన ఈ డీజిల్‌ను ఆంధ్ర రికార్డులతో పకడ్బం దీగా అనలోడ్‌ చేయించారని సమాచారం. డీజిల్‌ ట్యాంకర్‌ను నిలిపేసిన కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులపై నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యనేత పుత్రుడి కనుసన్నల్లో కర్ణాటక నుంచి తక్కువ ధరకు డీజిల్‌ను తెచ్చి.. దుర్గం ఆర్టీసీ డిపోలో వినియోగిస్తున్నారని తెలిసింది. గడిచిన ఎనిమిది నెలల్లో డీజిల్‌ దందా ద్వారా రూ.కోటికి పైగా అక్రమార్జన పొందారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కొడుకా.. కోటీశ్వరుడా!
రాయదుర్గం డిపోలో నిలిపిన ట్యాంకర్‌

దుర్గంలో సుపుత్రుడి డీజిల్‌ దందా

కర్ణాటక నుంచి ఆర్టీసీ డిపోకి సరఫరా

నెలకు రూ.13 లక్షలకు పైగా ఆదాయం

రాయదుర్గం డిపోలో రాత్రంతా హైడ్రామా

ఓ ట్యాంకర్‌ను పట్టుకుని.. వదిలేశారు..!

ముఖ్యనేత ఒత్తిళ్లకు సరెండర్‌ అయ్యారా..?

రాయదుర్గం నియోజకవర్గంలో కీలక నేత కుమారుడు రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నాడు. కర్ణాటక నుంచి డీజిల్‌ను అక్రమంగా తెప్పించి.. జిల్లా, పొరుగు జిల్లాకు వ్యాపారాన్ని విస్తరించాడని ఆరోపణలు వస్తున్నాయి. సరిహద్దు ఆవల నుంచి డీజిల్‌ తెప్పించి.. ఇవతలి డిపోల ఇనవాయిస్‌లతో ‘వ్యాపారం’ సాగిస్తున్నారని సమాచారం. గడిచిన ఎనిమిది నెలలుగా ఈ దందా జోరందుకుందని ప్రచారం జరుగుతోంది.

రాయదుర్గం, నవంబరు 24: ఆర్టీసీ డిపోలో హైడ్రామా నడిచింది. 15 వేల లీటర్ల డీజిల్‌ను తెచ్చిన ఓ ట్యాంకర్‌ను బుధవారం రాత్రి కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు పట్టుకున్నారు. బిల్లులు చూపకపోవడంతో ఏకంగా 12 గంటలపాటు నిలిపేశారు. ఆ తరువాత ఏం జరిగిందోగాని, గురువారం వదిలిపెట్టారు. కర్ణాటక నుంచి తెచ్చిన ఈ డీజిల్‌ను ఆంధ్ర రికార్డులతో పకడ్బం దీగా అనలోడ్‌ చేయించారని సమాచారం. డీజిల్‌ ట్యాంకర్‌ను నిలిపేసిన కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులపై నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యనేత పుత్రుడి కనుసన్నల్లో కర్ణాటక నుంచి తక్కువ ధరకు డీజిల్‌ను తెచ్చి.. దుర్గం ఆర్టీసీ డిపోలో వినియోగిస్తున్నారని తెలిసింది. గడిచిన ఎనిమిది నెలల్లో డీజిల్‌ దందా ద్వారా రూ.కోటికి పైగా అక్రమార్జన పొందారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బళ్లారి సమీపంలోని బంకుల నుంచి బుధవారం సాయంత్రం సేకరించిన డీజిల్‌ను రాత్రి రాయదుర్గం డిపోకు తెచ్చారని, బొమ్మనహాళ్‌ మండలంలోని ఓ డీజిల్‌ బంకు నుంచి తరలించినట్లు రికార్డులు చూపించారని ఆరోపణలు వస్తున్నాయి.

లీటరుపై రూ.10 ఆదాయం

డీజిల్‌ ధర జిల్లాలో లీటరు రూ.99 కాగా, కర్ణాటకలో రూ.89.60 మాత్రమే. అక్కడి నుంచి జిల్లాలో విక్రయిస్తే లీటరుకు రూ.10 మిగులుతోంది. రాయదుర్గం ఆర్టీసీ డిపోకి లీటరు రూ.97.47 ప్రకారం డిజిల్‌ సరఫరా చేసేందుకు కళ్లుదేవనహళ్లి వద్ద ఉన్న వెంకటసాయి డీజిల్‌ బంక్‌ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయదుర్గం డిపోకు రోజుకు 4500 నుంచి 5 వేల లీటర్ల దాకా డీజిల్‌ అవసరం అవుతుంది. దీంతో 15 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ ద్వారా నెలకు పది ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. ఒకే పెట్రోల్‌ బంక్‌ నుంచి కాకుండా మరో పెట్రోల్‌ బంక్‌ నుంచి కూడా సరఫరా చేసినట్లు రికార్డులు ఉన్నాయి. దీన్ని అదనుగా తీసుకున్న ముఖ్యనేత అనుచరులు కొందరు, ఆయన పుత్రుడి సహకారంతో రంగంలోకి దిగి దందా మొదలుపెట్టినట్లు తెలిసింది.

దగ్గరుండి తీసుకురావాలి..

డీజిల్‌ బంక్‌ నిర్వాహకులు ఇనవాయి్‌స ఇచ్చి, డీజిల్‌ను డిపో వరకు సరఫరా చేయాలి. ఆర్టీసీ సిబ్బంది డీజిల్‌ బంక్‌కు వెళ్లి ట్యాంకర్‌లోకి డీజిల్‌ను నింపాలి. ఆ వాహనాన్ని డిపో వరకూ వెంట ఉండి తీసుకురావాలి. ఆ తరువాత డీజిల్‌ బంక్‌ ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. ఆర్టీసీ వరకు అధికారులు రికార్డులు పక్కాగా నిర్వహిస్తున్నారు. కానీ లీటరుపై రూ.10 మిగులుతుందని భావించి, కర్ణాటక నుంచి అక్రమంగా తెప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర పరిధిలోని ఓ డీజిల్‌ బంకు నుంచి సరఫరా చేస్తున్నట్లు ఇనవాయి్‌సలను చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ట్యాంకర్‌ డీజిల్‌పై రూ.1.50 లక్షల దాకా మిగులుతోందని సమాచారం.

ఆడిట్‌ చేస్తే..

ఆర్టీసీ డిపోకు డీజిల్‌ సరఫరా చేస్తున్న బంక్‌కు ఐఓసీ నుంచి ప్రతి నెలా ఎంత డీజిల్‌ సరఫరా అవుతోందో, బంకులో ఎంత అమ్ముతున్నారో రికార్డులను పరిశీలిస్తే.. నిజాలు నిగ్గు తేలుతాయి. క్షుణ్ణంగా ఆడిట్‌ చేస్తే ఆర్టీసీ డిపోకి ఎంత డీజిల్‌ సరఫరా చేశారో తెలుస్తుంది. డీజిల్‌ మాఫియా గుట్టు రట్టవుతుంది. కానీ ఆడిట్‌ చేసేందుకు ఐఓసీ అధికారులు, సేల్స్‌ అండ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు సాహసించడం లేదని సమాచారం. దందా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. డీజిల్‌ దందా కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులకు ఆదాయం సమకూరుతున్నందుకే మౌనం వహిస్తున్నారని సమాచారం.

ఇక్కడే తెచ్చారు : డిపో మేనేజర్‌

కర్ణాటక నుంచి డీజిల్‌ అక్రమంగా తీసుకువచ్చి, ఆంధ్ర బిల్లులతో వినియోగంలోకి తెస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. కానీ బొమ్మనహాళ్‌ మండలంలోని కళ్లుదేవనహళ్లి వద్ద ఉన్న వెంకటసాయి ఫిల్లింగ్‌ స్టేషన నుంచి డీజిల్‌ను కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ సురేష్‌ తెలిపారు. సేల్‌ ట్యాక్స్‌ అధికారులకు ఆ బిల్లులన్నీ సమర్పించామని ఆయన అన్నారు.

Updated Date - 2022-11-25T00:27:47+05:30 IST

Read more