నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T05:38:29+05:30 IST

హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
కొత్తవూరు అమ్మవారిశాల వద్ద విద్యుద్దీపాల వెలుతురులో తోరణం

అమ్మవారి ఆలయాలు ముస్తాబు

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 25: హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వున్న అమ్మవారి ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. జిల్లాకేంద్రంలో కొత్తూరు, పాతూరు అమ్మవారిశాలలు, మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయ ఆవరణలోని శారదామాత దేవాలయం, బెంగుళూరు రోడ్డులోని శివకోటి ఆలయం, హెచ్చెల్సీ కాలనీలోని నసనకోట ముత్యాలమ్మ దేవాలయం,  పాతూరులోని రేణుకా యల్లమ్మ ఆలయాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలన్నీ విద్యుద్దీపాలం కరణల తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


జగత్ప్రసూతిక అలంకారంలో  దర్శనమిచ్చిన శారదామాత...

శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం లో ఆదివారం నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు చేయడంతోపాటు జగత్ప్రసూతికగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని వేదికపై మంజీర నృత్యకళాక్షేత్రం చిన్నారులతో సంప్రదాయ నృత్యప్రదర్శనలు నిర్వహించారు. మహామంగళహారతి నివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం గావించారు. కార్యక్రమంలో మఠం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్‌, మోహన తదితరులు పాల్గొన్నారు.


Read more