సర్కారు సారు పాట..!

ABN , First Publish Date - 2022-11-30T00:20:40+05:30 IST

మండలంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఆ అధికారి అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఏకంగా రూ.లక్షలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలో లే ఔట్‌ వేయాలంటే.. ఆయనకు కప్పం కట్టాల్సిందేనని అంటున్నారు. వెంచర్ల యజమానుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తారట. అడిగినంత ఇస్తేనే సంతృప్తి చెందుతారట. లే ఔట్లకు అనుమతి ఇవ్వడం ఆయన పరిధిలో లేదు

సర్కారు సారు పాట..!

లౌ ఔట్‌ వేస్తే కప్పం కట్టాల్సిందే

రూ.50 లక్షలతో బేరం మొదలు

కనీసం రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే

తాడిపత్రి చుట్టూ ఆయన హవా

అనంతపురం క్రైం, నవంబరు 29: మండలంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఆ అధికారి అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఏకంగా రూ.లక్షలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలో లే ఔట్‌ వేయాలంటే.. ఆయనకు కప్పం కట్టాల్సిందేనని అంటున్నారు. వెంచర్ల యజమానుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తారట. అడిగినంత ఇస్తేనే సంతృప్తి చెందుతారట. లే ఔట్లకు అనుమతి ఇవ్వడం ఆయన పరిధిలో లేదు. వచ్చిన దరఖాస్తులపై సంతకం చేసి.. కార్యాలయం నుంచి ఫైల్‌ ఫార్వర్డ్‌ చేయడం ఒక్కటే ఆయన పరిధిలో ఉంది. మిగిలిన వ్యవహారాలతో ఆయనకు సంబంధమే లేదు. కానీ అంతా తానే అన్నట్లు ఆయన చక్రం తిప్పుతున్నాడు. కానీ, అధికార పార్టీ కీలక నేత అనుచరుల జోలికి మాత్రం వెళ్లడట. మిగిలిన వారి నుంచి మాత్రమే మామూళ్లు దండుకుంటున్నారని సమాచారం.

సంబంధం లేకున్నా..

పుట్టపర్తి అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ (పుడా) ప్రాంతం మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అనంతపురం-హిందూపురం అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ (అహుడా)పరిధిలోకి వచ్చేశాయి. ఇది వరకు తాడిపత్రి ప్రాంతంలో లే ఔట్‌ వేయాలంటే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) పరిధిలో ఉండేది. ఐదెకరాలలోపు వెంచర్‌ వేస్తే జిల్లాలోని ఆ శాఖ అధికారులే అప్రూవల్‌ ఇచ్చేవారు. అంతకు మించి అయితే.. డీటీసీపీ మంగళగిరి(రాష్ట్ర స్థాయి) కార్యాలయం నుంచి అప్రూవల్‌ రావాలి. లే ఔట్‌ అప్రూవల్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఎంపీడీఓ కార్యాలయం నుంచి సంతకాలు చేసి ఫైల్‌ డీటీసీపీకి పంపుతారు. ఇప్పుడు అహుడా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఆ పని కూడా ఉండదు. ఈ నిబంధనలు ఇంతవరకే ఉన్నాయి. కానీ ఆ అధికారి మాత్రం అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. డీటీసీపీ పరిధిలో సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈయన వ్యవహారం సజావుగా సాగుతోంది. ఎక్కడ లే ఔట్‌ ఉన్నా సరే.. అప్రూవల్‌ కోసం ఆయన వద్దకు సంతకం కోసం ఫైల్‌ వెళితే చాలు.. వెంటనే లే ఔట్‌లో వాలిపోయి బేరం పెట్టేస్తారని సమాచారం.

రూ.50 లక్షల నుంచి బేరం..

తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో లే ఔట్లు బాగానే వెలిశాయి. పుట్లూరు రోడ్డు, యల్లనూరు రోడ్డు, కడప రోడ్డు, అనంతపురం రోడ్డు, నంద్యాల రోడ్డులో ప్రధానమైన వెంచర్లు ఏర్పడ్డాయి. కొంతకాలంగా 70కి పైగా లేఔట్లు వేసినట్లు తెలిసింది. ఇందులో 8 ఎకరాలు, 10 ఎకరాలు, 13 ఎకరాలు ఇలా వివిధ విస్తీర్ణాలు ఉన్నాయి. ఎంత ఎక్కువ విస్తీర్ణం ఉంటే.. అంత ఎక్కువగా ఆయన అడుగుతారట. ‘వేలం’ పాటను రూ.50 లక్షల నుంచి మొదలుపెడతారట. సిఫార్సులు, వినతులు, బతిమలాడటం, ఇంతకు మించి తమవల్ల కాదనడం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తే.. కాస్త తగ్గుతారట. అప్పటికీ ఒక్కో వెంచర్‌కు కనీసం రూ.10 లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తారని సమాచారం. ఇప్పటికే పలు లే ఔట్ల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశాడని తెలిసింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఏడాదిగా పనిచేస్తున్న ఆయన, వెంచర్ల వసూళ్ల ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-11-30T00:20:43+05:30 IST