పర్యవేక్షణ రివర్స్‌

ABN , First Publish Date - 2022-07-05T05:53:59+05:30 IST

వైసీపీ పాలన మొత్తంగా రివర్స్‌లో సాగుతోంద న్న విమర్శలు ఆది నుంచీ వినిపిస్తున్నాయి. అ లాంటి నిర్ణయమే మరొకటి వెలువడింది.

పర్యవేక్షణ రివర్స్‌

పథకాల పర్యవేక్షణ బాధ్యతలు

సచివాలయ ఉద్యోగులకు..

ఉత్తర్వులు జారీ

గెజిటెడ్‌ ఉపాధ్యాయులపై 

క్లర్క్‌స్థాయి ఉద్యోగుల అజమాయిషీ?

ఉపాధ్యాయవర్గాల విస్మయం

ధర్మవరం

వైసీపీ పాలన మొత్తంగా రివర్స్‌లో సాగుతోంద న్న విమర్శలు ఆది నుంచీ వినిపిస్తున్నాయి. అ లాంటి నిర్ణయమే మరొకటి వెలువడింది. గెజిటెడ్‌ స్థాయి ప్రధానోపాధ్యాయులు ఉండే పాఠశాలలో పథకాల అమలు పర్యవేక్షణ బాఽధ్యతలను క్ల ర్కు స్థాయి సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం ఏంటని ఉపాధ్యాయ వర్గాలు విస్మ యం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రివర్స్‌ నిర్ణయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులపై కక్ష సాధింపేనని ఆవేదన చెందుతున్నారు. తాజాగా ప్రభుత్వం.. పాఠశాలల్లో పథకాల అమలు పర్యవేక్షణ బా ధ్యతలను సచివాలయాల కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ ఉద్యోగులపై క్లరికల్‌ స్థాయి వారికి పెత్తనం అప్పగించింది.


ఇదీ పరిస్థితి..

శ్రీసత్యసాయి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1560, ప్రాథమికోన్నత పాఠశాలలు 225, ఉన్నత పాఠశాలలు 241 ఉన్నాయి. వాటి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న కార్యదర్శులు.. నాన గెజిటెడ్‌ ఉద్యోగులు కావడంతోపాటు క్లరికల్‌ కేడర్‌ కంటే దిగువ పోస్టుల్లో ఉన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి కంటే ఎక్కువ కేడర్‌లో ఉంటారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ గెజిటెడ్‌ హోదా ఉంటుంది. అలాంటి వారిపై సచివాలయ సంక్షేమ, విద్య కార్యదర్శిని పర్యవేక్షణ చేసి, వివరాలు సేకరించాలని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమను అవమాన పరిచేందుకు జారీ చేసిన ఉత్తర్వుగా ఉపాఽధ్యాయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను టార్గెట్‌ చేస్తోందని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారికి అన్ని వివరాలు అందజేస్తున్నామనీ, ఇప్పుడు కొత్తగా ఈ పర్యవేక్షణ, వివరాల సేకరణ ఏంటని ఉపాధ్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


ఉపాధ్యాయులే టార్గెట్‌

గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ బాధ్యతలను హెచఎంలకు అప్పగించారు. భోజనం నాణ్యతగా లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వమే తీసుకుంది. అంతటితో ఆగకుండా మరుగుదొడ్లు ప్రతిరోజూ శుభ్రం చేయించి, ఆ ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయుల విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదంగా మారింది. విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా, ఉపాధ్యాయులను మాత్రం పాఠశాలలకు రప్పించారు. దీనిపై కూడా ఉపాధ్యాయ వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. అయినా.. ప్రభుత్వ వైఖరి మారలేదు. తాజాగా మండల, మున్సిపాలిటీ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పథకాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను ఆయా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల హాజరు, పారిశుధ్య పనులు, నాడు-నేడు పనుల తీరు తదితరాలపై పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తిగా సహకరించాలని కూడా సూచించడం గమనార్హం.


నిర్ణయం సరికాదు

పర్యవేక్షణ బాధ్యతల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలి. పాఠశాలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అప్‌లోడ్‌ చేసేందుకు ప్రతి పాఠశాలకు ఒక కంప్యూటర్‌ ఇనస్ట్రక్టర్‌ని నియమించాలి. సచివాలయ ఉద్యోగులది క్లరికల్‌ కేడర్‌. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్‌ అధికారి స్థాయి ఉంటుంది. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయ కార్యదర్శులకు అప్పగిస్తే సమన్వయం లోపిస్తుంది.

శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


లేనిపోని సమస్యలు

సచివాలయ ఉద్యోగులు వారి పనులు వారు చూసుకుంటే ఫర్వాలేదు. ఉపాధ్యాయులపై అజమాయిషీ చేయాలని చూస్తే అనేక సమస్యలు వస్తాయి. పాఠశాలల నిర్వహణ బాధ్యతలు ఇప్పటికే ఎంఈఓ, సీఆర్‌పీలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా సచివాలయ ఉద్యోగులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయులపై కక్ష సాధింపులో భాగమే.

చంద్ర, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి


Updated Date - 2022-07-05T05:53:59+05:30 IST