రిజిసే్ట్రషన్లు తుస్సు..!

ABN , First Publish Date - 2022-10-04T05:10:47+05:30 IST

ప్రజల దగ్గరకే అన్ని సేవలు చేరువ చేస్తామని వైసీపీ పాలకులు ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తుంటారు.

రిజిసే్ట్రషన్లు తుస్సు..!

 సచివాలయాల్లో ప్రారంభంకాని రిజిసే్ట్రషన్లు

 వసతులు లేకనే?

అమలుకాని పాలకుల మాటలు 

హిందూపురం

ప్రజల దగ్గరకే అన్ని సేవలు చేరువ చేస్తామని వైసీపీ పాలకులు ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తుంటారు. అందుకోసమే సచివాలయాలు ఏర్పాటు చేశామని పదేపదే ప్రకటనలు చేస్తుంటారు. వాటి అమలు మాత్రం మరచిపోతుంటారు. సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన సేవల ప్రారంభమే అందుకు నిదర్శనం. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈనెల 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పాలకులు గొప్పలు పోయారు. ఇక రిజిస్ట్రేషన్ల కోసం రిజిసా్ట్రర్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఏవేవో చెప్పారు. అమలు విషయానికొస్తే.. తుస్సుమనిపించారు. 2వ తేదీన సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించలేకపోయారు. వసతులు కల్పించకకుండా, భూముల రీసర్వే పూర్తికాకుండా, పూర్తి వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా ప్రారంభిస్తారని సచివాలయాల సిబ్బందే ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన అమలు ఎలా సాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మొదటి నుంచీ..

సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా అక్టోబరు 2 నుంచి భూ క్రయవిక్రయాల కోసం రిజిస్ర్టేషన్లు చేపడతాయని పాలకులు ప్రకటించారు. దీంతో ప్రజలు ఎదురు చూశారు. చెప్పిన రోజు దాటింది. తొలిరోజు ఎక్కడా రిజిస్ర్టేషన్లు బోణీ కాలేదని తెలిసింది. కారణం దానికి తగినట్లు ఏర్పాటు చేయడంలో విఫలం కావడమేనని సమాచారం. కొన్ని సచివాలయాలను దీని కోసం ఎంపిక చేశారు. చివరలో చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. భూములకు సంబంధించి రీసర్వే పూర్తికాకముందే జిల్లాలో కొన్ని సచివాలయాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి, రిజిస్ర్టేషన ప్రక్రియను గత నెలలోనే ప్రారంభించాలని భావించారు. అది సాధ్యపడలేదు. అక్టోబరు 2వ తేదీన ప్రారంభిస్తామన్నారు. అప్పటికీ సాధ్యపడలేదు. దీంతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన సేవల ప్రారంభం రోజు ఉందో.. లేదో.. తెలియక అధికారులు తికమకపడుతుండడం గమనార్హం.


వసతులు లేకనే..?

వాస్తవానికి భూములు, స్థలాల రిజిస్ర్టేషన్లు చేయాలంటే దానికి ప్రత్యేకమైన లింక్‌ డాక్యుమెంట్‌, స్కానర్‌, ఐరిష్‌ పరికరాలు అవసరం. ప్రస్తుతానికి సచివాలయాల్లో ఇలాంటివేవీ కనబడట్లేదు. చాలావరకు హిందూపురంలో ప్లాట్లకు సంబంధించి ఒకే స్థలంపై నాలుగైదు రిజిస్ర్టేషన్లు చేసుంటారు. ఆ వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలోనే వీలవుతుంది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలంటే తప్పుమీద తప్పు చేసినట్లు అవుతుంది. ప్రతి భూమిని ఆనలైన చేసి, రీసర్వే పూర్తయ్యాక సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తే రిజిస్ర్టేషన్లు చేయడానికి వీలుంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు.


అప్‌లోడ్‌ చేశారంతే..

రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభానికి కొన్నిరోజుల క్రితం రిజిస్ర్టార్‌ కార్యాలయ సిబ్బంది.. సచివాలయాలకు వెళ్లి, సంబంధింత సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేశారు. రిజిస్ట్రేషన్లు చేయడానికి అవసరమైన పరికరాలేవీ పంపలేదని తెలిసింది. కొంతమందికి రిజిస్ర్టేషన్లపై శిక్షణ కూడా ఇచ్చారు. అయినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో సచివాలయాలకు రిజిస్ట్రేషన్లకు అవసరమైన సామగ్రి ఎప్పుడు పంపుతారో, ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయాల్లో రిజిస్ట్రేషన సేవలు సాధ్యమేనా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.Read more