రూ.25 కోట్ల భూమి హాం ఫట్‌..?

ABN , First Publish Date - 2022-09-28T05:56:20+05:30 IST

రూ.పాతిక కోట్ల విలువైన భూమి వివాదం రామ్‌ నగర్‌ రిజిస్ట్రేషన కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

రూ.25 కోట్ల భూమి హాం ఫట్‌..?
రిజిసే్ట్రషన కార్యాలయం వద్ద పోలీసులతో బాధితుల వాగ్వాదం

భూ యజమానులకు బురిడీ

అదే ఇంటిపేరున్న సమీప బంధువులతో తతంగం

గత ఏడాది రిజిస్ట్రేషన తిరస్కరించిన సబ్‌ రిజిసా్ట్రర్‌

కోర్టు ఉత్తర్వుల పేరిట పని చేసిపెట్టిన అధికారులు

రూ.70 లక్షలు చేతులు మారాయంటున్న బాధితులు

రామ్‌నగర్‌ కార్యాలయం వద్ద ఆందోళన.. ఉద్రిక్తత

అధికారుల ఫిర్యాదుతో బాధితులపై కేసు నమోదు


అనంతపురం క్రైం, సెప్టెంబరు 27: రూ.పాతిక కోట్ల విలువైన భూమి వివాదం రామ్‌ నగర్‌ రిజిస్ట్రేషన కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు ఆందోళనకు దిగడంతో వ్యవహారం పోలీస్‌ స్టేషన దాకా వెళ్లింది. తమ విధులకు ఆటంకం కలిగించారని రిజిస్ట్రేషన శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. బాధితులపైనే కేసు నమోదైంది. ఈ భూమి రిజిస్ట్రేషన వ్యవహారంలో రూ.70 లక్షల దాకా చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు తెలియకుండా.. తమ ఇంటి పేరున్న కొందరి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన చేయించుకున్నారని భూ యజమానులు వాపోతున్నారు.


బాధితులు ఏమంటున్నారు..?

- అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి సర్వే నెంబరు 108-3, 5లో ఐదెకరాలకు పైగా భూమి ఉంది. రుద్రంపేటకు చెందిన చెరుకూరి పార్వతమ్మ, శాంతమ్మ ఈ భూమి యజమానులు. కాగా, గాయత్రీ మిల్క్‌ డెయిరీ యజమానులు పల్లి శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నాగభూషణం రెడ్డి, పాటిల్‌ లోకనాథ్‌ రెడ్డి, పల్లి నిత్యానంద రెడ్డి ఆ భూమిపై కన్నేశారు. భూ యజమానుల దూరపు బంధువులు, భూమితో ఎలాంటి సంబంధం లేని చెరుకూరి నాగమ్మ, చెరుకూరి నారాయణమ్మ, చెరుకూరి నరేంద్రను తెరపైకి తీసుకొచ్చారు. భూ యజమానుల ఇంటిపేరు.. వీరి ఇంటిపేరు ఒకటే కావడంతో.. వారే యజమానులు అన్నట్లు సృష్టించారు. భూమి విస్తీర్ణం కొన్ని సెంట్లకు పరిమితమైతే.. రిజిస్ట్రేషన సమయంలో 1బీ అడంగల్‌ అవసరం లేదు. కానీ ఎకరాల్లో ఉంటే  తప్పనిసరిగా ఉండాలి. ఈ అడ్డంకి నుంచి బయట పడేందుకు, తెలివిగా ఆ భూమికి ఎక్కువమంది యజమానులు ఉండేలా, గజాల ప్రకారం వేరు  చేశారు. కానీ రిజిస్ట్రేషనకు వెళ్లిన సమయంలో నాటి సబ్‌ రిజిసా్ట్రర్‌ నుంచి చుక్కెదురైంది. 

- 2021 డిసెంబరు 6న రిజిస్ర్టేషన కోసం వెళ్లారు. అయితే అప్పటి సబ్‌ రిజిస్ర్టార్‌ హరికృష్ణ తిరస్కరించి పంపారు. 1బీ అడంగల్‌లో ఆ పేర్లు లేవని, ఒకవేళ యజమానులు చనిపోయి ఉంటే డెత సర్టిఫికెట్‌ తీసుకురావాలని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఈ భూమిని కాజేసేందుకు తతంగం నడుస్తోంది. ఈ విషయంపై కన్సిడర్‌ చేయాలని కోర్టుకెళ్లారు. డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. రిజిస్ర్టేషన అధికారులు గతంలోనే రిజిస్ట్రేషన రద్దు చేశామని చెప్పి, తిరస్కరించి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ ఈ నెల 20న అధికారులు గాయత్రీ మిల్క్‌ డెయిరీ యజమానులు పల్లి శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులు నాగభూషణంరెడ్డి, పాటిల్‌ లోకనాథ్‌రెడ్డి, పల్లి నిత్యానందరెడ్డి పేరిట రిజిస్ర్టేషన చేశారు. 


చేతులు మారిన రూ.70 లక్షలు 

రూ.25 కోట్ల విలువైన భూమిని కాజేసే వ్యవహారంలో రూ.70లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. వివాదంలో చిక్కుకున్న భూమి విలువ ఎకరం రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో ఆ భూమిని ఎలాగైనా ఆక్రమించాలని అనుకున్నారు. ఇందు కోసం రిజిస్ట్రేషన చేయించుకున్న వారి నుంచి బినామీలు, డాక్యుమెంట్‌ రైటర్లు, రిజిస్ర్టేషన శాఖ అధికారులకు రూ.70 లక్షల దాకా చేతులు మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టు ఆర్డర్‌ను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహారం నడిపించారని తెలుస్తోంది. 


వంశవృక్షం సృష్టించి..

తమ భూమిని మరొకరి పేరిట ఎలా రిజిస్ర్టేషన చేస్తారని బాధితులు మండిపడ్డారు. రామ్‌నగర్‌ రిజిస్ర్టేషన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ‘రుద్రంపేటకు చెందిన అవనిగొండ అనిత, చెరుకూరి నారాయణస్వామి, అవనికొండ ఎర్రిస్వామి, సిద్దయ్య, లక్ష్మిదేవి, పార్వతమ్మ  బంధువులతో కలిసి కథానాయకుడు ఎల్లప్ప సహకారంతో..  వంశవృక్షం సృష్టించి పట్టా భూమిని ఇతరులకు రిజిస్ర్టేషన చేయించారు’ అని ఫ్లెక్సీలో రాసి ప్రదర్శించారు. తక్షణమే రిజిస్ర్టేషనను  రద్దు చేయాలని, ఆ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. 2019 నుంచి తమ భూముల్లోకి వారు అక్రమంగా చొరబడుతూ ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. సబ్‌ రిజిస్ర్టార్‌ను సస్పెండ్‌ చేయాలని, కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు  తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


ఉద్రిక్తత..

బంధువులతో కలిసి రిజిస్ర్టేషన కార్యాలయంలోకి వెళ్లిన బాధితులు, అధికారులపై తిట్ల దండకం అందుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన విరమించాలని బాధితులకు సూచించారు. అయితే, న్యాయం జరిగే వరకు కదలబోమని వారు చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో బాధితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తోపులాటలో ఓ మహిళ గాయపడింది. బాధితులను పోలీసులు ఫోర్త్‌టౌన స్టేషనకు తరలించారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో వృద్ఢుడు నారాయణస్వామి స్పృహ తప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


బాధితులపైనే కేసు

కార్యాలయంలోకి వచ్చి రభస చేశారని రిజిస్ర్టేషన శాఖ అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వచ్చి బూతులు మాట్లాడారని అన్నారు. విధులను బహిష్కరించి బయటకు వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి పోలీ్‌సస్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల  విధులకు ఆటంకం కలిగించినందుకు, వారిని దుర్భాషలాడినందుకు కేసు నమోదు చేశామని సీఐ జాకీర్‌ హుస్సేన తెలిపారు. 


కోర్టు ఆర్డర్‌ ప్రకారమే..

కోర్టు ఉత్తర్వుల మేరకు రిజిస్ర్టేషన చేశామని సబ్‌ రిజిస్ర్టార్‌ సత్యనారాయణ తెలిపారు. పోలీ్‌సస్టేషన ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. 2021లో కక్కలపల్లి సర్వే నెంబరు 308-3 భూమిని అప్పటి సబ్‌ రిజిస్ర్టార్‌ హరికృష్ణ పెండింగ్‌లో ఉంచి తిరస్కరించారని అన్నారు. ఆ విషయంలో గాయత్రీ మిల్క్‌ డెయిరీ యజమాని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని, రిజిస్ర్టేషన చేయించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని అన్నారు. దీంతో జిల్లా రిజిస్ర్టార్‌ ఆదేశాల మేరకు భూమిని రిజిస్ర్టేషన చేశామని తెలిపారు. ఇందులో తమ తప్పేమీ లేదని తేలిపోయారు. రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి సంబంధించి ఎనీవేర్‌ కింద అప్పట్లో చేశారని అన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించినందుకు, దుర్భాషలాడినందుకు కేసు పెట్టామని తెలిపారు. 


Updated Date - 2022-09-28T05:56:20+05:30 IST