వానలకు తేరుకున్న పంటలు

ABN , First Publish Date - 2022-09-10T05:37:43+05:30 IST

జిల్లాలో వరుస వర్షాలు ఎండుతున్న పంటలకు ఊపిరి పోశాయి. ఖరీ్‌ఫలో మెట్ట భూముల్లో సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం ఊడలు దిగే దశ నుంచి పిందె ఏర్పడే దశలో ఉంది.

వానలకు తేరుకున్న పంటలు
గుత్తి వద్ద కళకళలాడుతున్న వేరుశనగ పంట


ఊడ, పిందె దశలోవేరుశనగ 

తేమ అధికమైతే తెగుళ్లు సోకే ప్రమాదం  


అనంతపురం అర్బన :  జిల్లాలో వరుస వర్షాలు ఎండుతున్న పంటలకు ఊపిరి పోశాయి. ఖరీ్‌ఫలో మెట్ట భూముల్లో సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం ఊడలు దిగే దశ నుంచి పిందె ఏర్పడే దశలో ఉంది. వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయంలో తప్పని సరిగా భూమిలో తేమ ఉండాలి. గత కొన్ని రోజుల కిందటి వరకూ వేరుశనగ పంట వాడుదశలో కొట్టుమిట్టాడింది. ఈ పరిస్థితుల్లో వరుసగా వర్షాలు పడటంతో వాడుదశలోని వేరుశనగ తేరుకుంది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 3.76 లక్షల హెక్టార్లులుగా అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా  3.34 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో  2.02 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ సాగైంది. కంది 35వేల హెక్టార్లు, ఆముదం 11వేల హెక్టార్లు, పత్తి 52వేల హెక్టార్లల్లో సాగయ్యాయి. మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, పెసలు, ఉలవలు, అలసంద, మిరప, సోయాబీన, తదితర రకాల పంటలు సాగయ్యాయి. 


వరుస వానలతో బతికిన పంటలు 

వేరుశనగ విత్తిన తర్వాత 45 రోజుల నుంచి ఊడలు దిగుతాయి. జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ ఊడలు దిగే దశ నుంచి పిందెలు పడే దశలో ఉంది. ఊడలు దిగే సమయం నుంచి కాయ పూర్తిగా ఉధృతి చెందే దాకా భూమిలో  తగి నంత తేమ అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమిలో తేమ ఉంటేనే ఊడలు సులభంగా భూమిలోకి దిగడంతోపాటు గట్టిపడతాయి. గత కొన్ని రోజుల క్రితం వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట వాడు దశకు చేరుకుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వరుస వర్షాలు పడటంతో వాడుదశ నుంచి వేరుశనగ పంట బతికింది. జిల్లాలో ప్రస్తుతం కంది పంట శాకీయ దశలో (కొమ్మలు వృద్ధి చెందే దశ) ఉంది. మరో నెలన్నర రోజుల్లో పూతదశకు చేరుకో నుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కంది పంటకు ప్రయోజనమే. అలాగే పత్తి పంట పూత, కాయ ఏర్పడే దశలో ఉంది. మొక్కజొన్న కంకి దశలో ఉంది. ఆముదం గొల ఏర్పడే దశలో ఉంది. ఆయాపంటలకు వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రయోజనమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 


తేమ అధికమైతే తెగుళ్లు సోకే ప్రమాదం 

వరుస వర్షాలు కొనసాగి తేమ  శాతం అధికమైతే పలు రకాల పంటల్లో తెగుళ్లు సోకే ప్రమాదం కూడా లేక పోలేదు. కొండ ప్రాంతాలు, వంక పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో భూమిలో నీరు జౌకులు పట్టి తేమ శాతం అధికమైతే వేరుశనగ, ఇతర రకాల పైరు ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశనగ కాయ ఊరే సమయంలో అధికతేమ శాతం ఉంటే బూజు, మచ్చతెగులు సోకే ప్రమాదం ఉంది. ఆము దం గొల ఏర్పడేదశలో ఎక్కువ వాన పడితే బూజు తెగులు సోకే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2022-09-10T05:37:43+05:30 IST