కదిరి ప్రజాప్రతినిధిపై ప్రజల్లో వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-10-05T05:00:47+05:30 IST

అధికార వైసీపీలో అంతర్యుద్ధం రోజురోజుకూ బహిర్గతమవుతోంది.

కదిరి ప్రజాప్రతినిధిపై ప్రజల్లో వ్యతిరేకత
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ పట్టణాధ్యక్షుడు బాహుద్దీన

- పార్టీ కోసం పనిచేసినోళ్లను ఆయన మర్చిపోయాడు

- కార్యకర్తల సమావేశంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు

 కదిరి, అక్టోబరు 4: అధికార వైసీపీలో అంతర్యుద్ధం రోజురోజుకూ బహిర్గతమవుతోంది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డిపై వైసీపీ నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో కదిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేఎస్‌ బాహుద్దీన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్‌ టాఫిక్‌ అయ్యాయి. ‘కదిరిలో ముఖ్య ప్రజాప్రతినిధిపై ప్రజల్లోనూ, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది...’ అంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటాగుళ్లలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు  మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాహుద్దీన మాట్లాడుతూ.. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను ముఖ్య ప్రజాప్రతినిధి మర్చిపోయాడన్నారు. కార్యకర్తలను హౌ ఆర్‌ యూ అనకపోయినా హు ఆర్‌ యూ అని మాత్రం అనకూడదని అన్నారు. మూడున్నరేళ్లగా వైసీపీకి పనిచేసిన కార్యకర్తలను స్థానిక ప్రజాప్రతినిధిగానీ, ఇతర ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు పదే పదే ఫోన్లు చేసిన నాయకులు తరువాత  ఎలా ఉన్నారని కూడా పలకరించిన పాపాన పోలేదన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త పనిచేశారని గుర్తు చేశారు. కార్యకర్తలు లేకుండా ఏపార్టీ మనుగడ సాగించలేదని తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలను విస్మరించడం దారుణమన్నారు. తాము సోలార్‌లో ఉద్యోగాలు అడగలేదని, కేవలం తమను పలకరించాలని కోరుకున్నామని సెటైర్లు వేశారు. కార్యకర్తలను పెడచెవిని పెట్టిన ప్రజాప్రతినిధులు పా ర్టీని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బతికించుకోవాలంటే కనీసం ఇప్పుడైనా కార్యకర్తలను పట్టించుకోవాలని హితవుపలికారు. కదిరిలో పార్టీ అధ్వాన పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తమన్నారు. ప్రజల్లో స్థానిక ప్రజాప్రతినిధికి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సమావేశంలో సింగల్‌ విండో మాజీ ప్రెసిండెంట్‌ సురేష్‌, నాయకులు సలీం, ఇందాయత, మాజీ కౌన్సిలర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-05T05:00:47+05:30 IST