ప్రపంచ ప్రఖ్యాతి.. అభివృద్ధిలో అపఖ్యాతి

ABN , First Publish Date - 2022-09-27T05:53:20+05:30 IST

చారిత్రక సంపద, కళాకృతులు, భాష, సంస్కృతిని తెలిపే శిల్పవైభవం, కట్టడాలు, దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు జిల్లా అంతటా ఉన్నాయి.

ప్రపంచ ప్రఖ్యాతి..  అభివృద్ధిలో అపఖ్యాతి

జిల్లా టూరిజం సర్క్యూట్‌ కలేనా?

యునెస్కో తాత్కాలిక జాబితాలోనే లేపాక్షి

విదేశీ అతిథులకు సౌకర్యాల కొరత

అభివృద్ధికి దూరంగా ఆధ్యాత్మిక కేంద్రం

తిమ్మమ్మ మర్రిమాను వద్ద దుర్భర పరిస్థితులు

పర్యాటకంపై ప్రభుత్వం చిన్నచూపు


పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

చారిత్రక సంపద, కళాకృతులు, భాష, సంస్కృతిని తెలిపే శిల్పవైభవం, కట్టడాలు, దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు జిల్లా అంతటా ఉన్నాయి. అలనాటి విజయనగర రాజుల వైభవం మొదలుకుని శిల్పకళల కాణాచి లేపాక్షి, రాయల రెండో రాజధాని పెనుకొండ, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి, విదేశీ అతిథులు విడిదిచేసే వీరాపురం, ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, తిమ్మమ్మ మర్రిమాను ఇలా చెప్పుకుంటూపోతే జిల్లాలో ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. వీటన్నింటిని అభివృద్ధి చేసి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా హామీలు గుప్పిస్తున్నాయే తప్ప.. అడుగు ముందుకేసిన పాపాన పోలేదు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అన్ని అవకాశాలున్నా నిధులను కేటాయించి, ఆ దిశగా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టలేదన్నది నిర్వివాదాంశం. పర్యాటక ఆకర్షణ లేక చారిత్రక సంపద మరుగున పడుతోందన్న విమర్శలున్నాయి. 


పెనుకొండపై హామీలే..

టూరిజిం సర్క్యూట్‌ తీసుకొచ్చేందుకు 2010లో పెనుకొండలో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల పంచమి శతాబ్ది ఉత్సవాల్లోనే పునాది పడింది. అప్పట్లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పర్యాటక, దేవదాయ శాఖల ఉన్నతస్థాయి అధికారులు హాజరై, ప్రపంచస్థాయిలో గుర్తించేలా దశల వారిగా జి ల్లాలో చారిత్రాక, పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకొస్తామని హామీలు ఇచ్చారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల మాటే మరచిపోయా రు. కొండపైకి రోడ్డు నిర్మాణానికి నిధులు మం జూరు చేశారు. నేటికీ పనులు కొనసాగుతూనే ఉ న్నాయి. ఇటీవల కొండపైకి రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ముందుకు సాగలేదు. కోట గోడలు శిథిలావస్థకు చేరుతున్నాయి. అక్రమణలు పెరిగిపోయి కోట కళావిహీనంగా మారుతోంది.


యునెస్కో తాత్కాలిక జాబితాలోనే..

శిల్పకళ నిలయం లేపాక్షికి ప్రపంచ గుర్తింపు ఉంది. వారసత్వ సంపద గుర్తింపు కోసం పురావస్తు శాఖ, స్థానికులు నేటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ హయాంలో లేపాక్షి నంది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రూ.పది కోట్లకుపైగా నిధులు విడుదల చేసి, అభివృద్ధి పనులు చేపట్టారు. ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రపంచ వారసత్వ గుర్తింపు ప్రస్తావన ఉత్సవాలతో తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఏడాది మార్చిలో యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కింది. వారసత్వ సంపద గుర్తింపు కోసం మాత్రం ఎదురు చూడాల్సి వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్సవాల నిర్వహణను అటకెక్కించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయాయి. లేపాక్షి ఆర్ట్‌ ఆఫ్‌ స్కూల్‌, హస్తకళల శిక్షణా కేంద్రం నిర్మించాలన్నది ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది. 


అంత దూరం నుంచి వచ్చి..

చిలమత్తూరు మండలం వీరాపురానికి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి పెయింటెడ్‌ స్టార్క్స్‌ పక్షులు (ఎర్రకాళ్ల కొంగలు) ఏటా సంతానోత్పత్తికి వస్తాయి. ఫిబ్రవరి వచ్చిందంటే పెయింటెడ్‌ స్టార్స్క్‌ పక్షులు వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సందడి చేస్తాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. వారికి ఇక్కడ కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. చెట్లపై ఉన్న కొంగలను దూరం నుంచి చూడాల్సిందే. పక్షులు, వాటి పిల్లలకు వీరాపురంలో నిర్మించిన ఫిష్‌పాట్‌ నిరుపయోగంగా మారింది. పక్షులకు చెట్లపై గూళ్లు, నీరు, ఆహారం వంటి సౌకర్యం కల్పిస్తామని పర్యాటక, అటవీ శాఖ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు.


అన్ని దేశాల భక్తులు వస్తున్నా..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. టీడీపీ హయాంలో పుట్టపర్తి సమీపాన చిత్రావతి నది పరివాహక ప్రాంత అభివృద్ధిలో భాగంగా రూ.4కోట్లకుపైగా నిధులు విడుదల చేసి, చెక్‌డ్యామ్‌, హారతి ఘాట్‌, నదికిరువైపులా ఆధునికీకరణ పనులు చేపట్టారు. అవి ప్రస్తుతం పర్యవేక్షణ లేక కళావిహీనంగా మారాయి.


గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించినా..

తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించింది. అక్కడ అభివృద్ధి మాత్రం మచ్చుకైనా కనిపించదు. పర్యాటకులకు కనీస వసతులు కూడా ఉండవు. కటారుపల్లి యోగివేమన సమాధి వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. తోలుబొమ్మల కళకు గుర్తింపు పొందిన నిమ్మలకుంట పర్యాటక ప్రాంతాల వద్ద సౌకర్యాలు మృగ్యమయ్యాయి.


పర్యాటక సర్క్యూట్‌ సంగతేంటో?

ఉమ్మడి జిల్లాను రెండు ప్రత్యేక పర్యాటక వలయా(సర్క్యూట్‌)లుగా ఏర్పాటు చేసేందుకు కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో లేపాక్షి, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, హేమావతి, కటారుపల్లి వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, విదేశీ పక్షుల విడిది వీరాపురం, పట్టుచీరలకు పేరొందిన ధర్మవరం, హిందూపురం వీవర్స్‌ కాలనీ, తోలుబొమ్మల నిమ్మలకుంట ప్రాంతాలను కలుపుతూ ఓ ప్రత్యేక సర్య్కూట్‌  చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి, పెన్నహోబిలం ఆలయం, గుత్తి, రాయదుర్గం కోటలతో పాటు మరికొన్ని ప్రాంతాలను కలిపి మరో వలయంగా చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పెనుకొండలో 2010లో నిర్వహించిన కృష్ణదేవరాయల ఉత్సవాల్లో టూరిజం సర్క్యూట్‌ తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో చారిత్రక సంపద, కళాకృతులు, శిల్పకళ, కట్టడాలు, దేవాలయాలతోపాటు పర్యాటక ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌ కిందకు తీసుకొచ్చేందుకు 2016లో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. 25 కోట్లు వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిపాదనలను సైతం పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఇటీవల లేపాక్షి, పెనుకొండను రాయలసీమ పర్యాటక సర్క్యూట్‌లోకి చేర్చేలా ప్రతిపాదన చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో పర్యాటక సర్య్కూట్‌  మాట కాగితాలకే పరిమితమైంది.


ఉత్సవాలను మరిచారు: జయకుమార్‌, లేపాక్షి

టీడీపీ హయాంలో లేపాక్షి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. లేపాక్షికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో ఐదేళ్లుగా లేపాక్షికి భక్తులు, పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేసి, పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేపట్టాలి.


ప్రత్యేక కార్యాచరణ

పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. పర్యాటక ప్రాంతాలన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేస్తాం. ఆయా పర్యాటక కేంద్రాల్లో అవసరమైన పనులను గుర్తించి, ప్రతిపాదనలు పంపాం. ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్‌కు రూట్‌ మ్యాప్‌ సిద్ధంగా ఉంది. ఇటీవల రాయలసీమ పర్యాటక సర్వ్యూట్‌లోకి లేపాక్షి, పెనుకొండను కలుపుతూ ప్రతిపాదనలు చేశాం.

ఈశ్వరయ్య, ఆర్‌డీ, పర్యాటక శాఖ


Updated Date - 2022-09-27T05:53:20+05:30 IST