నిరసన గళం

ABN , First Publish Date - 2022-02-23T06:19:13+05:30 IST

: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు.

నిరసన గళం
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆశావర్కర్లు

కలెక్టరేట్‌ వద్ద ఆశాల ధర్నా.. 

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌

అనంతపురం వైద్యం ఫిబ్రవరి 22: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అడ్డుకున్నా, సీఐటీయూ నేతృత్వంలో వందలాది మంది ఆశావర్కర్లు జిల్లా కేంద్రానికి చేరుకుని, ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, సీఎం జగన తీరును విమర్శించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు నాగమణి, రామాంజనేయులు, వెంకటనారాయణ, ఆశా వర్కర్ల సంఘం నాయకులు భారతి, మాలతి తదితరులు ప్రసంగించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ టెస్ట్‌లు ఆశాలతో చేయించరాదని, ఖాళీగా ఉన్న ఆశా వర్కర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. శాఖతో సంబంధంలేని పనులు తమకు అప్పగించి, పనిభారం మోపుతున్నారని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌తో మరణించిన ఆశావర్కర్లకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. 


ఖర్చులకే సరి..

గ్రామాల్లో నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు పనికి దగ్గ వేతనం ఇవ్వడం లేదని అన్నారు. వివిధ రకాల పనులను తమకు అధికారులు అప్పగిస్తున్నారని, వచ్చిన జీతంలో సగం చార్జీలకే సరిపోతోందని వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగేంద్ర, సాంబశివ, సౌభాగ్య, ఆశా కార్యకర్తలు సౌభాగ్య, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. 


అడ్డుకున్న పోలీసులు..

జిల్లా కేంద్రంలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డగించి, స్టేషన్లకు తరలించారు. మరికొందరిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. డి.హీరేహాళ్‌, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, విడపనకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల, కూడేరు మండలాలలో పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేశారు. రాయదుర్గం ప్రాంతం వారు బస్సులో వస్తుండగా కళ్యాణదుర్గం వద్ద దించి స్టేషనకు తీసుకెళ్ళారు. మధ్యాహ్నం వరకు అరెస్టులు కొనసాగాయి. సాయంత్రం వారిని వదిలిపెట్టారు. పోలీసులు తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. Read more